logo

ఇద్దరికి అమాత్యయోగం

అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు హుస్నాబాద్‌లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్‌లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 08 Dec 2023 06:21 IST

సీనియర్‌ నేతలకే అవకాశం
కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం 

పొన్నం ప్రభాకర్‌

ఈనాడు, కరీంనగర్‌, పెద్దపల్లి : అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు హుస్నాబాద్‌లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్‌లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు సీనియర్‌ నాయకులు కావడంతో అనుభవం దృష్ట్యా మొదటి విడతలోనే మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీధర్‌బాబు ఇప్పటికే అయిదుసార్లు మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు మంత్రిగా పనిచేశారు. పొన్నం ప్రభాకర్‌కు గతంలో కరీంనగర్‌ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండగా తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీధర్‌బాబు 2009లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరవాత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు అందించారు. రోశయ్య కేబినెట్‌లోనూ కొనసాగిన ఆయనకు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా శాసనసభ వ్యవహారాలు, న్యాయమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

కార్యకర్తల సంబరాలు

ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ పరిధిలో హుస్నాబాద్‌ కలుపుకొని 13 నియోజకవర్గాలుండగా ఇందులో 8 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. మరో అయిదుచోట్ల భారాస అభ్యర్థులు గెలుపొందారు. పాత కరీంనగర్‌ జిల్లాలో శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతోపాటు మరొకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం సాగినప్పటికీ ఇద్దరికే అమాత్య యోగం దక్కింది. మున్ముందు విస్తరణలో మరొకరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొన్నం నివాసం కరీంనగర్‌లో ఉండటంతో ఆయన ఇక్కడికి తరచూ రాకపోకల్ని సాగించే అవకాశం ఉండగా.. మంత్రి శ్రీధర్‌బాబు గతంలో మాదిరిగానే ఈసారి కూడా కరీంనగర్‌లోనే నివాసం ఉండే అవకాశమున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

గతంలో మన జిల్లా మంత్రులు వీరు...

  • ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి 21 మంది మంత్రి పదవుల్ని అందుకున్నారు. ఈసారి కొత్తగా పొన్నం ప్రభాకర్‌ ఈ జాబితాలో చేరడంతో మొత్తంగా 22 మందికి అమాత్య యోగం లభించింది.  వీరేకాకుండా గతంలో జి.నారాయణరావు, దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్‌లుగా పనిచేశారు.
  • పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన జి.వెంకటస్వామి  కార్మిక, పౌరసరఫరాల శాఖా మంత్రిగా పని చేశారు.

1. పీవీ నరసింహారావు : న్యాయ, ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, విద్యాశాఖ
2. కెవి. నారాయణరెడ్డి : ప్రణాళిక, న్యాయశాఖ
3. జె.చొక్కారావు : రవాణా, భూగర్భజలాలు, వ్యవసాయం, పరిశ్రమలు, పౌరసరఫరాలు
4. వర్దినేని వెంకటేశ్వర్‌రావు : భూగర్భజలాలు, లఘు పరిశ్రమలు, కార్మిక, న్యాయ, రెవెన్యూశాఖలు
5. టి. జీవన్‌రెడ్డి : ఎక్సైజ్‌ ఆబ్కారీ, పంచాయత్‌రాజ్‌ శాఖ
6. మాతంగి నర్సయ్య : షెడ్యూల్‌ కులాల సంక్షేమ శాఖ
7. రాజేశంగౌడ్‌ : న్యాయశాఖ
8. పాటిరాజం : నీటిపారుదల, ఉన్నత విద్యాశాఖ
9. సి.ఆనందరావు : న్యాయశాఖ
10. ఎన్‌.రాంకిషన్‌రావు : అటవీశాఖ
11. ఎం. దామోదర్‌రెడ్డి :  మైనింగ్‌శాఖ, సాంకేతిక విద్య
12. ఎల్‌.రమణ : చేనేత , జౌళి శాఖ
13. సుద్దాల దేవయ్య : సహకార శాఖ
14. ఇనుగాల పెద్దిరెడ్డి : కార్మిక, ఉపాధి, పర్యాటకం, చక్కెరశాఖలు
15. ఎం. సత్యనారాయణరావు : దేవాదాయ, క్రీడలు, సినిమాటోగ్రఫీ
16. కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు : బీసీ సంక్షేమశాఖ
17. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు : ఉన్నత విద్య, న్యాయ, ఎన్నారై వ్యవహారాలు, పౌరసరఫరాలు వినయోగదారుల వ్యవహారాలు, శాసనసభ వ్యవహారాలు శాఖలు
18. ఈటల రాజేందర్‌ : ఆర్థిక, ప్రణాళిక, పౌరసరఫరాలు, తూనికలు, కొలతలు, వినియోగదారుల వ్యవహారాలు, వైద్యఆరోగ్యశాఖలు
19. కె.తారకరామారావు : పురపాలిక, ఐటీ, పరిశ్రమల శాఖలు
20. కొప్పుల ఈశ్వర్‌ : ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలు
21. గంగుల కమలాకర్‌ : బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖలు

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని