logo

అధ్వాన దారులు... తప్పని అవస్థలు!

Published : 08 Dec 2023 04:58 IST

గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. గతంలో కురిసిన వర్షాలకు గుంతలు పడగా ఆయా చోట్ల అవసరమైన మరమ్మతులు నేటికీ చేపట్టలేదు. గుంతల దారుల్లో వెళ్లాలంటే నిత్యం నరకం అనుభవిస్తున్నామని వాహన చోదకులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పలుగ్రామాల్లో నెలకొన్న దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ కథనం.

మద్దునూరు వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై అధ్వానంగా కల్వర్టు

దశాబ్దకాలంగా వీడని గ్రహణం

బుగ్గారం : బుగ్గారం నుంచి రాయపట్నం వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. మద్దునూరు శివారులో కల్వర్టు పది సంవత్సరాలుగా రాళ్లు తేలి ప్రమాదకరంగా తయారైంది. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడికి సమీపంలో రహదారి కోతకు గురవడంతో వాహనదారులు భయం భయంగా ప్రయాణం చేస్తున్నారు. చెట్ల కొమ్మలు రహదారి మీదికి రావడం మూల మలుపులు ఎక్కువగా ఉండటంతో తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణం చేస్తున్నామని వాహన చోదకులు అంటున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ మరమ్మతు పనులకు మోక్షం రావడం లేదు.

రోడ్డువిస్తరణ పనులతో..

గొల్లపల్లి, న్యూస్‌టుడే: గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూర్‌ నుంచి వెల్గటూరు మండలంలోని స్తంభంపల్లి మధ్య సుమారు అయిదు నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. గొల్లపల్లి నుంచి లక్షెట్టిపేట, మంచిర్యాల వైపు వెళ్లే వారికి ఇది దగ్గరి మార్గం కావడంతో చాలా మంది ఇక్కడి నుంచి ప్రయాణం సాగిస్తారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా తవ్వి కంకరతో నింపారు. ఈ మార్గంలో చిల్వాకోడూర్‌ నుంచి లొత్తునూర్‌ వరకు సుమారు 4 కి.మీ వరకు కంకర తేలి ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలు అదుపు తప్పుతున్నాయి. దీంతో కొద్ది మంది లొత్తునూరు వైపు వెళ్లే వారు మరో మార్గమైన గొల్లపల్లి మీదుగా సుమారు 15 కి.మీ ప్రయాణించి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

నిర్మాణం నాస్తి.. మరమ్మతులు జాస్తి

వెల్గటూరు, న్యూస్‌టుడే: స్తంభంపల్లి నుంచి లొత్తునూరు వెళ్లే రహదారి పలు చోట్ల ప్రమాదకరంగా ఉంది. కొన్నిచోట్ల కోతకు గురి కావడంతో అధ్వాన్నంగా తయారైంది. దీనికి తోడు ఇరువైపులా దట్టంగా చెట్ల కొమ్మలు రహదారి మీదికి రావడంతో వాహనదారులు భయంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రమాదకరంగా మూల మలుపులుండటం రహదారి సరిగా లేకపోవడంతో తాము అవస్థలు పడుతున్నామని వాహన చోదకులు అంటున్నారు.

నత్తనడకన పనులు

ధర్మపురి గ్రామీణం, న్యూస్‌టుడే: జైన నుంచి దొంతాపూర్‌ వెళ్లే రహదారి సంవత్సరాల తరబడి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైన మూల మలుపు, మగ్గిడి శివారు లోలెవల్‌ వంతెనల వద్ద రహదారి అంత్యంత ప్రమాదకరంగా ఉంది. కల్వర్టులకు రెండు వైపులా చదునుగా లేక గుంతగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు అదుపు తప్పుతున్నాయి. మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మెరుగైన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

గండి పడిన ప్రాంతాల్లో ప్రమాదాలు

ధర్మపురి, న్యూస్‌టుడే: ధర్మపురి నుంచి బీర్‌పూర్‌ వరకు గల 12 కి.మీ.ల రహదారి అధ్వానంగా మారింది. కోరండ్లపల్లె వద్ద గత వానా కాలంలో భారీ వర్షాలతో రహదారిపై గండి పడింది. ప్రతిరోజు వందలాది వాహనాలు ఇదే రహదారి నుంచి కమ్మునూర్‌ వరకు వెళ్లుంటాయి. మధ్యన నక్కలపేట, దోనూర్‌, తీగలధర్మారం, బీర్‌పూర్‌, నర్సింహులపల్లె, తుంగూర్‌, కొల్వాయి, తాళ్లధర్మారం, కమ్మునూర్‌ వరకు రహదారి విస్తరించి ఉంది. గండిపడిన ప్రాంతంలో రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారి మరమ్మతు చేసేందుకు ప్రతిపాదలను పంపించారు. నిధులు విడుదల కాకపోవడంతో మరమ్మతులు కరవయ్యాయి. కోతకు గురైన రహదారికి మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ధర్మపురి నుంచి బీర్‌పూర్‌ మార్గంలో పడిన గండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని