logo

సైక్లిస్ట్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం, ఒకరి మృతి

సైక్లిస్ట్‌ను ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృత్యువాత పడ్డాడు. మృతుడి కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లికి చెందిన పరశురాములు (60) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

Published : 22 Feb 2024 04:42 IST

జమ్మికుంట, న్యూస్‌టుడే : సైక్లిస్ట్‌ను ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు మృత్యువాత పడ్డాడు. మృతుడి కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలంలోని పెద్దంపల్లికి చెందిన పరశురాములు (60) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. జమ్మికుంటలోని కోరపల్లి రోడ్డువైపు కుటుంబీకులతో నివాసం ఉంటున్నాడు. బుధవారం పెద్దంపల్లిలోని బంధువు వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో జమ్మికుంటకు చెందిన పత్తి మిల్లు హమాలీ నర్సయ్య సైకిల్‌పై సమ్మక్క, సారలమ్మను కొలిచేందుకు కొబ్బరికాయల కోసం వెళ్తుండగా ద్విచక్రవాహనం సైకిల్‌ను ఢీకొంది. ఈ ఘటనలో పరశురాములు మృతి చెందాడు. నర్సయ్య కాళ్లకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. నర్సయ్య కుమారుడు రాకేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ రవి తెలిపారు.


బావిలో దూకి వృద్ధుడి బలవన్మరణం

మానకొండూర్‌, న్యూస్‌టుడే : అనారోగ్య బాధలు తాళలేక ఓ వృద్ధుడు బావిలో దూకి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ రాజ్‌కుమార్‌ కథనం మేరకు.. చెంజర్లకు చెందిన పప్పు నర్సయ్య (90) కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన వృద్ధుడు ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


విద్యుదాఘాతంతో భవన కార్మికుడి మృతి

గంగాధర, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో భవన కార్మికుడు మృతి చెందిన ఘటన గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై అభిలాష్‌ కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన చీమలవన్నె బాలగురువయ్య (26).. బత్తుల రమణ అనే మేస్త్రీ ద్వారా భవన నిర్మాణ పనులు చేసేవారు. ఈ క్రమంలో గర్శకుర్తిలో ఓ భవనం పైఅంతస్తులో గోడ నిర్మాణ పనులు చేస్తుండగా బాలగురువయ్య పక్కనే ఉన్న విద్యుత్తు తీగలకు తగిలి గాయాలపాలయ్యారు. కరీంనగర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు. ఈ మేరకు మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.  


గప్‌చుప్‌ బండి నిర్వాహకుడు..

కరీంనగర్‌ నేరవార్తలు: నగరంలోని శాస్త్రిరోడ్డులో నివాసం ఉంటున్న గప్‌చుప్‌ బండి నిర్వాహకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఒకటో ఠాణా సీఐ సరిలాల్‌ కథనం ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన బిందేశ్వర్‌ పాశ్వాన్‌ బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా కరీంనగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. అతడి పెద్ద కుమారుడు వివేక్‌ పాశ్వాన్‌ (21) తండ్రికి తోడుగా ఉంటూ గప్‌చుప్‌ బండి నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఇంటికి చేరుకొని బండిని నీటితో కడుగుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. 


అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం

చొప్పదండి, న్యూస్‌టుడే: అప్పుల బాధ తాళలేక ఒకరు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. వీణవంక మండలం కనపర్తికి చెందిన ముదుగంటి రఘుపతిరెడ్డి(40) నాలుగేళ్లుగా చొప్పదండిలో అద్దెఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు విత్తన కంపెనీలో పనిచేస్తున్నాడు. అప్పులు అధికం అవడంతో సోమవారం రాత్రి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుర్తించి చికిత్స చేయిస్తున్నారు. రఘుపతిరెడ్డికి భార్య మానస, ఇద్దరు కుమార్తెలున్నారు.


అక్షర చిట్ఫండ్‌ నిర్వాహకుల అరెస్టు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే : చిట్టీ కాలం పూర్తయినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో అక్షర చిట్ఫండ్‌ సంస్థ ఛైర్మన్‌, ఇద్దరు డైరెక్టర్లను అరెస్టు చేశామని కరీంనగర్‌ ఒకటో ఠాణా సీఐ సరిలాల్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కరీంనగర్‌ సీతారాంపూర్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీరాం వెంకట్రెడ్డి కరీంనగర్‌లోని అక్షర చిట్ఫండ్‌లో రూ.7 లక్షల చిట్టీ వేశారు. 2022 డిసెంబరుతో చిట్టీ కాలం ముగిసినా నిర్వాహకులు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో బాధితుడు ఈ నెల 20న ఒకటో ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హనుమకొండ వడ్డేపల్లికి చెందిన సంస్థ ఛైర్మన్‌ పేరాల శ్రీనివాసరావు, డైరెక్టర్లు సూరినేని కొండల్‌రావు, ఉప్పల రాజేందర్‌లను బుధవారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరో ముగ్గురు డైరెక్టర్లు పేరాల శ్రీవిద్య, అలువల వరప్రసాద్‌, గోనె రమేశ్‌లపైనా కేసు నమోదు కాగా వారు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.


చికిత్స పొందుతూ మృతి

కరీంనగర్‌ నేరవార్తలు: ఓ వ్యక్తి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఔట్పోస్టు హెడ్‌కానిస్టేబుల్‌ ప్రభాకర్‌ తెలిపారు. ఈ నెల 20న పి.సుబ్బారావు (57) గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని