logo

కంకర వేశారు.. తారు మరిచారు

గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు మూడేళ్లు అవుతున్నా పూర్తి చేయడం లేదు.

Published : 22 Feb 2024 04:45 IST

ప్రమాదాలకు నిలయంగా రహదారి
న్యూస్‌టుడే, కోనరావుపేట

గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు మూడేళ్లు అవుతున్నా పూర్తి చేయడం లేదు. కొంత మేరకు కంకర పోసి వదిలేశారు. మరికొంత భాగం తవ్వి వదిలేశారు. దీంతో స్థానికులకు రవాణా కష్టాలు పెరిగి ఇబ్బంది పడుతున్నారు.

కోనరావుపేట మండలం ధర్మారం, వేములవాడ అర్బన్‌ మండలం చంద్రగిరి మధ్య 6.52 కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద రూ.2.66 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న గుత్తేదారు 2021 నవంబర్‌లో ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండేళ్లు గడిచినప్పటికీ  గుత్తేదారు నిర్లక్ష్యం వీడటం లేదు. చంద్రగిరి నుంచి రామన్నపేట వరకు సుమారు మూడు కిలో మీటర్ల మేర గుత్తేదారు ఏడాది క్రితం కంకర వేశారు. రామన్నపేట నుంచి నాగారం వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి తవ్వి పోశారు. నాగారం-ధర్మారం వరకు అసలు పనులే చేపట్టలేదు. దీంతో వాహనదారులు కంకర, మట్టి రోడ్డుపై వెళ్లడం కష్టంగా మారింది. తారు రోడ్డు నిర్మాణంతో సౌకర్యంగా మారుతుందని ఆశించిన జనాలకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టాయి. పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని అధికారులు, పాలకులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తారు రోడ్డు పూర్తికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


వాహనాలు బోల్తా

- న్యాలకొండ భూంరెడ్డి, రైతు, రామన్నపేట

ఏడాది క్రితం గుత్తేదారు కంకర వేసి వదిలేశారు. పాదచారులు సైతం నడవటానికి వీలు లేకుండా పోయింది. నిత్యం వందల సంఖ్యలో రైతులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో ఇప్పటికే మూడు పర్యాయాలు కారు, ద్విచక్ర వాహనదారులు బోల్తా పడగా పలువురికి గాయాలయ్యాయి. రైతులు, వాహనదారుల కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుత్తేదారు తారు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి.


త్వరలోనే పనులు చేపట్టేలా చర్యలు

- మనోహర్‌, ఏఈ, పీఆర్‌, కోనరావుపేట

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నాగారం వరకే తారు రోడ్డు నిర్మాణానికి సరిపోతున్నాయి. నాగారం-ధర్మారం గ్రామాల మధ్య మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. కంకర వేసిన రోడ్డుపై తారు వేయాలని గుత్తేదారుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. బిల్లులు, ఇసుక సమస్యతో తారు నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగింది. తారు రోడ్డు పూర్తయితే ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని