logo

బోయినపల్లి ఎంపీపీపై వీగిన అవిశ్వాసం

బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌పై అవిశాస్వం వీగిపోయింది. మండల పరిషత్తు కార్యాలయంలో అవిశ్వాస ప్రతిపాదన సమావేశాన్ని ఎంపీడీవో జయశీల బుధవారం ఏర్పాటు చేయగా వేములవాడ ఆర్డీవో మధుసూదన్‌ హాజరయ్యారు.

Published : 22 Feb 2024 04:46 IST

బోయినపల్లి, న్యూస్‌టుడే: బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌పై అవిశాస్వం వీగిపోయింది. మండల పరిషత్తు కార్యాలయంలో అవిశ్వాస ప్రతిపాదన సమావేశాన్ని ఎంపీడీవో జయశీల బుధవారం ఏర్పాటు చేయగా వేములవాడ ఆర్డీవో మధుసూదన్‌ హాజరయ్యారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు ఒక్కరూ హాజరు కాకపోవడంతో నిర్ణీత గంట సమయం ముగిసిన అనంతరం అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. భారాసకు చెందిన విలాసాగర్‌ ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్‌ ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే సొంత పార్టీ సభ్యులు ఈడుగు రాజేశ్వరి (వరదవెల్లి), కొనుకటి నాగయ్య (నర్సింగాపూర్‌), ఐరెడ్డి గీత (మల్లాపూర్‌), డబ్బు మమత (కోరెం), కంకణాల వనజ (అనంతపల్లి)తోపాటు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్‌ (తడగొండ) జనవరి 27న వేములవాడ ఆర్డీవోకు అవిశ్వాస ప్రతిపాదనపై వినతి పత్రం అందించారు. ఈ నెల 5న ఆర్డీవో ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. కాగా బోయినపల్లి, జగ్గారావుపల్లి, స్తంభంపల్లి ఎంపీటీసీ సభ్యులు సంబ బుచ్చమ్మ, కొంకటి శిరీష, అక్కెనపల్లి ఉపేందర్‌తోపాటు అవిశ్వాస ప్రతిపాదన చేసిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల శ్రీనివాస్‌గౌడ్‌ ఎంపీపీకి మద్దతు తెలుపుతూ శిబిరానికి తరలి వెళ్లారు. వీరితోపాటు కొదురుపాక ఎంపీటీసీ సభ్యురాలు బాలగోని గౌతమి ఎంపీపీ వర్గం వైపు ఉన్నారు. సొంత పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుల మద్దతుతో తనపై అవిశ్వాసం నెగ్గకుండా ఎంపీపీ పావులు కదిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్తంభంపల్లి ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరగా జగ్గారావుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు భారాసకు రాజీనామా చేశారు. ఎంపీపీపై అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించిన అనంతరం బోయినపల్లిలో పలువురు నాయకులు, యువకులు సంబరాలు చేసుకొన్నారు. బస్టాండు ప్రాంతంలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని