logo

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

‘గత అనుభవాల దృష్ట్యా విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం.. తరగతులకు గైర్హాజరు కాకుండా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడాం..

Published : 22 Feb 2024 04:49 IST

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా నోడల్‌ అధికారి కల్పన
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

‘గత అనుభవాల దృష్ట్యా విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రతి విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం.. తరగతులకు గైర్హాజరు కాకుండా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడాం.. విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని తొలగిస్తున్నాం.. మాస్‌ కాపీయింగ్‌కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. స్వేచ్ఛాయుత వాతారణంలో పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం..’ అని ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి కల్పన తెలిపారు. ఈ నెల 28న ప్రారంభమయ్యే ఇంటర్‌ పరీక్షలు మార్చి 18 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆమె పలు అంశాలు వెల్లడించారు.

ప్ర: మాస్‌కాపీయింగ్‌ నియంత్రణకు తీసుకునే చర్యలేమిటి?

జ: జిల్లాలో చూసి రాతలు, ఇతర అవకతవకలు లేకుండా ప్రతి కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంట్‌ అధికారి ఉంటారు. జిల్లాలో నలుగురు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, ఇద్దరు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, నోడల్‌ అధికారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బృందాలు పర్యవేక్షిస్తాయి. అనుమానిత కేంద్రాలపై నిఘా పెంచుతున్నాం. పక్కా భవనాలు, ప్రహరీ వసతి ఉన్న కళాశాలల్లోనే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.

ప్ర: ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్‌ ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి?

జ:  ఫీజుల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని జిల్లాలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు సూచించాం. వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. విద్యార్థులు హాల్‌టికెట్‌లను అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపల్‌ సంతకం అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా కార్యాలయంలోని 86882-12478 కంట్రోల్‌ నంబరును సంప్రదించవచ్చు.

ప్రశ్న: జిల్లాలో పరీక్షల నిర్వహణకు ఎలా సన్నద్ధమయ్యారు?

జవాబు: జిల్లాలో 45 ప్రభుత్వ, 13 కళాశాలల్లో కలిపి మొత్తం 11,104 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకోసం 24 కేంద్రాలను ఏర్పాటు చేశాం. సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. విద్యార్థులకు రవాణా కష్టాలు లేకుండా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడిపించనుంది.

ప్ర: ఈసారి కూడా ‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధన అమలులో ఉంటుందా?

జ: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం. ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నా పత్రాలను తెరవడంతో పాటు పరీక్ష ముగిసిన తర్వాత సీల్‌ చేస్తాం. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరిసర ప్రాంతాల్లోని జిరాక్సు కేంద్రాలను మూసివేయించనున్నాం.

ప్ర: పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకున్నారా?

జ: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రతి కళాశాలలో ఒక అధ్యాపకుడితో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహింపజేశాం. పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు వీరు చైతన్యం కల్పిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురైతే టెలీమానస్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 14418 లేదా 1800914416ను సంప్రదిస్తే కౌన్సెలింగ్‌ చేస్తారు. విద్యార్థులు స్వేచ్ఛగా, సానుకూల దృక్పథంతో పరీక్ష రాయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు