logo

కాదేదీ కబ్జాకు అనర్హం

ప్రభుత్వ భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా పర్వం కొనసాగుతోంది. పట్టించుకునేవారు లేక వైకుంఠధామాలను, సమాధులను సైతం వదలకుండా వాటిని ఆనుకొనే హద్దు రాళ్లి పాతి ఆక్రమిస్తున్నారు.

Updated : 22 Feb 2024 06:04 IST

వైకుంఠధామాలు, సమాధుల పక్కన ప్రభుత్వ భూముల ఆక్రమణ
ఆహారశుద్ధి పరిశ్రమ ప్రతిపాదనతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
ఈనాడు, పెద్దపల్లి

ప్రభుత్వ భూములపై ఆక్రమణదారుల కన్ను పడింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా పర్వం కొనసాగుతోంది. పట్టించుకునేవారు లేక వైకుంఠధామాలను, సమాధులను సైతం వదలకుండా వాటిని ఆనుకొనే హద్దు రాళ్లి పాతి ఆక్రమిస్తున్నారు. ఎలిగేడు మండల పరిధిలోని వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులకు పట్టడం లేదు.
ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవుపల్లి, ముప్పిరితోట గ్రామాల పరిధిలో అయిదేళ్ల కిందటి వరకు 1300 ఎకరాల మేర పరం పోగు భూములుండేవి. ప్రస్తుతం కబ్జారాయుళ్ల కబంధ హస్తాల్లో చిక్కుకొని అంతకంతకూ కుచించుకుపోతున్నాయి. 18 ఏళ్ల కిందట వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రెండు గ్రామాల శివార్లలో దాదాపు 70 మందికి ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇదే అదనుగా కొందరు నాయకులు పలుకుబడితో వాటి పక్కనే హద్దు రాళ్లు పాతి చుట్టూ గోడలు కట్టి ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత పదేళ్లుగా అడపదడపా కబ్జాల పర్వం కొనసాగుతూనే వస్తోంది. వైకుంఠధామాలు, సమాధులను ఆనుకొని దర్జాగా హద్దు రాళ్లు పాతేస్తున్నారు.

ప్రజా అవసరాలకు ప్రయాస

జిల్లాలో ఆహారశుద్ధి(ఫుడ్‌ ప్రాసెసింగ్‌) పరిశ్రమ ఏర్పాటు కోసం గతేడాది అప్పటి కలెక్టర్‌ సర్వే సంగీత, రెవెన్యూ, పరిశ్రమల శాఖలు, రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ)లతో పాటు వివిధ శాఖల అధికారులు ఎలిగేడు మండలంలో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. పరిశ్రమ ఏర్పాటుకు వందలాది ఎకరాలు అవసరం ఉండటంతో ర్యాకల్‌దేవుపల్లి, ముప్పిరితోట గ్రామాల పరిధిలోని పరంపోగు భూములను ఎంపిక చేశారు. వాస్తవానికి రెండు గ్రామాల పరిధిలో మొత్తం 1,300 ఎకరాల ప్రభుత్వ భూములుండగా కేవలం 100 ఎకరాల ఎంపిక కోసం రెవెన్యూ శాఖ అధికారులకు ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది. ప్రభుత్వ భూముల చుట్టూ పలుకుబడితో కొందరు చేసిన కబ్జాలు, అక్రమ పట్టాల కారణంగా ఆహారశుద్ధి పరిశ్రమకు భూముల ఎంపికకు సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఎంత కబ్జాకు గురైంది? అనే వివరాలు కూడా రెవెన్యూ శాఖ వద్ద లేకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ర్యాకల్‌దేవులపల్లి, ముప్పిరితోట గ్రామాల్లో మొత్తం 101.22 ఎకరాలను గుర్తించి ఆహారశుద్ధి పరిశ్రమకు ప్రతిపాదించారు. అలా గుర్తించిందే తడవుగా రాత్రికి రాత్రే హద్దురాళ్లు వెలిశాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆక్రమణదారులను అడ్డుకుంటే వారిపైనే భౌతిక దాడులకు పాల్పడిన సందర్భాలున్నాయి. ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల భూములకు డిమాండ్‌ వస్తుందని ఆక్రమణలు పెరిగిపోయాయి.


మరోసారి సర్వే నిర్వహిస్తాం

-స్వర్ణ, ఎలిగేడు తహసీల్దారు

ఆహారశుద్ధి పరిశ్రమ కోసం ర్యాకల్‌దేవుపల్లిలో సర్వే నంబరు 167లో 85.28 ఎకరాలు, ముప్పిరితోటలోని సర్వే నంబరు 295లో 15.34 ఎకరాలు కలిపి మొత్తం 101.22 ఎకరాలు గుర్తించాం. ఈ మేరకు టీఎస్‌ఐఐసీకి, ప్రభుత్వానికి నివేదించాం. ఇక్కడి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వివరాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో కొందరు అక్రమంగా నిర్మించిన కట్టడాలు కూల్చివేశాం. హద్దురాళ్లు, స్తంభాలను తొలగించాం. మరోమారు సర్వే నిర్వహించి ఆక్రమణలుంటే తొలగిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని