logo

వేసవి ముప్పు తప్పేనా?

ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పూర్తిస్థాయిలో అమలు కాక లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రాయికల్‌ పురపాలికలతో పాటు 15 మండలాల్లోని 346 ఆవాస ప్రాంతాలకు భగీరథ నీరు సరఫరా చేసేందుకు ఇబ్రహీంపట్నం మండలం డబ్బా వద్ద నీటి శుద్ధికేంద్రం నిర్మించారు.

Published : 22 Feb 2024 04:58 IST

మోటార్ల మొరాయింపుతో సరిపోని భగీరథ నీరు
న్యూస్‌టుడే, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం

ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పూర్తిస్థాయిలో అమలు కాక లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రాయికల్‌ పురపాలికలతో పాటు 15 మండలాల్లోని 346 ఆవాస ప్రాంతాలకు భగీరథ నీరు సరఫరా చేసేందుకు ఇబ్రహీంపట్నం మండలం డబ్బా వద్ద నీటి శుద్ధికేంద్రం నిర్మించారు. మోటార్ల మొరాయింపు, అంతర్గత పైపులైన్ల లీకేజీలు, అసంపూర్తి పనులతో సరిపడా నీరు పట్టణాలు, పల్లెలకు చేరక, ట్యాంకులు నిండక ప్రజలు సతమతమవుతున్నారు. జిల్లాలో కొన్నినెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది.

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామసాగర్‌ జలాశయం నుంచి బాల్కొండ మండలం జలాల్‌పూర్‌ వద్ద నిర్మించిన ఇన్‌టెక్‌వెల్‌కు జలాలు చేరుతుండగా, అక్కడి నుంచి ఆరు మోటార్లతో 35 కిలోమీటర్ల మేర నిర్మించిన పైపులైన్‌ ద్వారా డబ్బా నీటి శుద్ధి కేంద్రానికి తరలిస్తారు. జిల్లాలోని ఏడున్నర లక్షల మంది జనాభాకు నీటిని అందించేలా ప్రణాళిక రూపొందించారు. సంపులు, ట్యాంకుల నుంచి పట్టణాలు, గ్రామాల్లోని అంతర్గత పైపులైన్ల ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా భగీరథ నీరు అందించాల్సి ఉంది. కొన్ని గ్రామాలకు నేటికీ భగీరథ జలాలు చేరలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జలాల్‌పూర్‌ వద్ద నిత్యం నాలుగు మోటార్లు నడిపించడం ద్వారా గ్రిడ్‌కు సంవత్సరానికి అవసరమైన 1.25 టీఎంసీల నీరు అందుతుంది. కానీ ఆరింటిలో మూడు మోటార్లు మరమ్మతుకు గురవడంతో మూడు మాత్రమే నడుస్తున్నాయి. జనాభాకు అనుగుణంగా సరిపడా నీరు రాక పురపాలికలకు రోజు, గ్రామీణ ప్రాంతాలకు రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితేమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు మోటార్లలో ఒకటి హైదరాబాద్‌లో, రెండు అహ్మదాబాద్‌లో మరమ్మతు చేయిస్తుండగా, అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అసంపూర్తి పనులు, లీకేజీలతో సతమతం

భగీరథ నీరు అన్ని గ్రామాలకు అందుతుందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంటోంది. కొన్ని గ్రామాలకు గ్రిడ్‌ నుంచి ట్యాంకులకు నీరు చేరడం లేదు. మరికొన్ని గ్రామాల్లో ఇంట్రా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చాలా చోట్ల నీటి ఒత్తిడికి పైపులు లీకవుతున్నాయి. ప్రధాన పైపులైన్‌ లీకేజీ ఏర్పడినపుడల్లా నాలుగైదు రోజులు నీటి సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండగా, అంతర్గత పైపులైన్ల లీకేజీలను పట్టించుకోవడం లేదు. దీంతో నీరు కలుషితమవుతుందన్న ఆరోపణలున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వేసవిలో తాగునీటి సమస్యలు తీవ్రం కానున్నాయి. సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాల కారణంగా గ్రామాల్లో పాత నీటి పథకాలను వినియోగిస్తున్నారు. బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. దీని వల్ల విద్యుత్తు బిల్లులు భారం పంచాయతీలపై పడుతోంది. జిల్లాలో వీధి దీపాలు, నీటి పథకాలకు సంబంధించి నెలకు రూ.1.60 కోట్ల విద్యుత్తు బిల్లులు వస్తున్నట్లు తెలుస్తోంది. మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు సమన్వయంతో వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.


ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

- శేఖర్‌రెడ్డి, మిషన్‌ భగీరథ ఈఈ

ఎస్సారెస్పీ నుంచి గ్రిడ్‌కు సరఫరా చేసే నాలుగు మోటార్లలో ఒకటి మొరాయిస్తుంది. మోటారుకు మరమ్మతు చేయిస్తున్నాము త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. వేసవిలో ప్రజలకు నీటి ఇబ్బందులు తతెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాము. గత వేసవిలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. ఈ వేసవిలో కూడా అప్రమత్తంగా ఉన్నాము.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని