logo

వయో పరిమితిపై సింగరేణిలో కదలిక

సింగరేణిలో వయో పరిమితి పెంపుపై కదలిక మొదలైంది. వారసత్వ ఉద్యోగాలకు 35 ఏళ్లుగా నిర్ణయించిన సింగరేణి దానిని 40 ఏళ్లకు సడలించాలన్న డిమాండ్‌పై తాజాగా వివరాల సేకరణకు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 22 Feb 2024 06:04 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని: సింగరేణిలో వయో పరిమితి పెంపుపై కదలిక మొదలైంది. వారసత్వ ఉద్యోగాలకు 35 ఏళ్లుగా నిర్ణయించిన సింగరేణి దానిని 40 ఏళ్లకు సడలించాలన్న డిమాండ్‌పై తాజాగా వివరాల సేకరణకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన వయసు దాటిన వారు చాలా మంది సింగరేణిలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ ద్వారా వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్న సింగరేణి 35 సంవత్సరాల లోపు ఉన్న వారినే నియమిస్తుంది. కొంతమంది కార్మికుల వైద్య పరీక్షల సమయం తర్వాత వివిధ కారణాలతో ఆలస్యం కావడంతో వయో పరిమితి 35 ఏళ్లు దాటింది. కొవిడ్‌ సమయంలోనూ నియామకాలు లేకపోవడం ప్రభావాన్ని చూపింది. సింగరేణి వ్యాప్తంగా సుమారు 500 మంది వరకు వయో పరిమితి దాటిపోయి వారసత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు యాజమాన్యానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో వారి వివరాలను యాజమాన్యం సేకరిస్తోంది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగం రాదని ఏకమొత్తంగా రూ.25 లక్షలు తీసుకున్నారు. మరి కొంతమంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు.

త్వరలో నిర్ణయం?

వారసుల ఉద్యోగ వయో పరిమితి 40 ఏళ్లకు పెంచుతూ సంస్థ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. వయో పరిమితిపై కదలిక మొదలు కావడంతో వారసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వారసుడి ఉద్యోగ నియామకం నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ప్రక్రియ త్వరగా పూర్తయితే సమస్యలు తీరే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని