logo

వాహనదారులకు మెరుగైన సేవలు

‘ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయడం, వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతా. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడంతోపాటు కార్యాలయంలో సమూల మార్పులు చేస్తా’నని కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్‌ పెద్దింటి పురుషోత్తం స్పష్టం చేశారు.

Published : 22 Feb 2024 05:02 IST

ఉమ్మడి జిల్లా డీటీసీ పురుషోత్తం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం

‘ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయడం, వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతా. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడంతోపాటు కార్యాలయంలో సమూల మార్పులు చేస్తా’నని కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్‌ పెద్దింటి పురుషోత్తం స్పష్టం చేశారు. 2003 నుంచి 2015 వరకు ఎంవీఐగా షాపూర్‌, అలంపూర్‌ చెక్‌పోస్ట్‌లలో విధులు నిర్వహించారు. 2015-2018 వరకు మేడ్చల్‌, సౌత్‌జోన్‌ ఆర్టీవోగా, జిల్లా ఉప రవాణా కమిషనర్‌గా 2019లో వరంగల్‌కు పని చేశారు. ఇటీవల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది.

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్‌ ట్రాక్‌ నిరుపయోగంగా ఉంది.?

ట్రాక్‌ను పరిశీలిస్తా. అందుబాటులోకి తేవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎన్ని నిధులు అవసరం అవుతాయో చర్చిస్తాం.  

ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు.?

మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం రహదారి నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఆటోలు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా ముందు, వెనక భాగంలో రేడియం స్టిక్కర్లను అతికించాలి. ఆర్‌అండ్‌బీ శాఖ సైతం రహదారులపై సైన్‌ బోర్డులు విరివిగా ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనదారుడు లైసెన్స్‌, వాహన పత్రాలు కల్గి ఉండాలి. ఇవి ఉంటేనే ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం  సకాలంలో అందుతుంది.

కార్యాలయపరంగా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఏమైనా మార్పులకు అవకాశముందా.?

కార్యాలయంలో ప్రక్షాళన తప్పనిసరిగా ఉంటుంది. వాహనదారుల సేవలు, ధ్రువపత్రాలు సరిగా చూస్తున్నారా లేదా? కౌంటర్లను పరిశీలిస్తాను. అవసరమైన మార్పులు చేస్తాను. ఆర్టీఏ కార్యాలయ నిర్వహణలో ఏవో పాత్ర కీలకంగా ఉంటుంది. అధికారి, సిబ్బంది ఎవరైనా సరే తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి.

ప్రశ్న : డీటీసీగా మీ ముందున్న  లక్ష్యాలను వివరించండి.

జవాబు : ప్రభుత్వం నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలి. త్వరలోనే జిల్లా రవాణా శాఖ అధికారులు, ఇన్‌స్పెక్టర్లతో సమావేశం నిర్వహిస్తాం. వాహనదారులు త్రైమాసిక పన్నులు సకాలంలో స్వచ్ఛందంగా చెల్లించాలి. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. పన్ను చెల్లించకుండా రోడ్డుపై తిరిగితే వాహనాన్ని సీజ్‌ చేయడంతోపాటు 200 శాతం జరిమానా విధిస్తాం.  

అనేక వాహనాలు ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?

వాహనాల పూర్తి సమాచారం ఆన్‌లైన్‌లో ఉంటుంది. ముందుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాల జాబితాను తయారు  చేస్తాం. ఎన్ని వాహనాలు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కల్గి ఉన్నాయి, త్రైమాసిక పన్నులు చెల్లించాయో పూర్తి వివరాలతో కూడిన జాబితాను రూపొందిస్తాం. ఫిట్‌నెస్‌ చేయించని వాహనాల యజమానులకు నోటీసులు పంపిస్తాం. సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తాం.

సమ్మక్క-సారలక్క జాతర నేపథ్యంలో వాహనదారులకు ఇచ్చే సలహాలు ఏమిటి?

వన దేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. పరిమితికి మించి వాహనాల్లో తరలించొద్దు. వాహనాలు కండీషన్‌గా ఉండటంతోపాటు రేడియం స్టిక్కర్లు అతికించి ఉండాలి. అతివేగం, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపరాదు. రహదారి నిబంధనలు పాటిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని