logo

పాలక మండలి.. ఇకనైనా ఏర్పడాలి!

దక్షిణ కాశీగా విలసిల్లుతున్న వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Published : 22 Feb 2024 05:04 IST

ట్రస్టు బోర్డు నియమిస్తే రాజన్న ఆలయ అభివృద్ధి
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

క్షిణ కాశీగా విలసిల్లుతున్న వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల వసతులు, ధూపదీప నైవేద్యాలు అందుతున్న తీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అందులోనే పాలక మండళ్లు లేని ఆలయాల్లో వెంటనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, విప్‌ ఆది శ్రీనివాస్‌ రెండు సార్లు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు చివరిసారిగా రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా 2014 వరకు పని చేశారు. ఆ తరవాత నుంచి ఉత్సవాల సమయంలో మాత్రమే తాత్కాలిక ఆలయ పునరుద్ధరణ కమిటీలు, ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 2022 నవంబరులో దేవాదాయశాఖ కమిషనర్‌ ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిసెంబరు 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఆసక్తి ఉన్న అర్హులైన వారు ట్రస్టు బోర్డు సభ్యులుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికోసం పలువురు ఉత్సాహం చూపించారు. అయితే ఈ ప్రక్రియ అక్కడితోనే నిలిచిపోయింది.

ఈసారి తాత్కాలిక కమిటీతోనే

వేములవాడ ఆలయం పెద్దది కావడంతో కమిటీ ఏర్పాటుకు సమయం పట్టే అవకాశం ఉందని ఈవో కృష్ణప్రసాద్‌ వెల్లడించారు. అయితే శివరాత్రి రాబోతున్న తరుణంలో పనుల వేగవంతానికి, జాతర నిర్వహణకు గతంలో మాదిరిగానే తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం పూర్తవడం గానీ, లేకుంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయడం గానీ చేయాల్సి ఉంటుంది. వీటీఏడీఏలో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ తరవాత కొత్తగా నియమితులయ్యే ట్రస్టు బోర్డు వారే సభ్యులుగా చలామణి అవుతారు. ఈ ప్రక్రియంతా పూర్తవడానికి సమయం పడుతుంది. అంతవరకు వేచిచూడక తప్పదని దేవాదాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో చారిత్రక నేపథ్యమున్న రాజన్న ఆలయానికి కమిటీ ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యాల కల్పనలో వేగం పెరిగే అవకాశం ఉంది.


వీటీఏడీఏతో మారిన స్వరూపం

రాజన్న ఆలయ అభివృద్ధికి వీటీఏడీఏ (వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ)ను 2016 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పరిధిలోకి అయిదు గ్రామాలతోపాటు ఉపాలయాలు, నాంపల్లి గుట్టను కూడా చేర్చారు. దీనికోసం ఏటా రూ.వంద కోట్లు కేటాయిస్తూ గత ప్రభుత్వం ప్రణాళికలు, ఆలయ అభివృద్ధి నమూనాలను రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని వైస్‌ ఛైర్మన్‌గా నియమించారు. ఈ సంస్థ హైదరాబాద్‌ నుంచి కార్యకలాపాలు కొనసాగించగా గతేడాది ఆగస్టులో వేములవాడకు తరలించారు. దీంతో ఆలయ కమిటీ ఊసేలేకుండా పోయింది. అయితే ఈ కమిటీ అనుకున్నంత మేర పని చేయకపోవడం, గుడికి విడుదల కావాల్సిన నిధులు, చేయాల్సిన పనులు పెండింగ్‌లో పడిపోయాయి. ఇటీవలే వీటీఏడీఏ ఛైర్మన్‌ హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఆలయానికి హెచ్‌ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్లు విడుదల చేయించారు. దీంతో పెండింగ్‌లో ఉన్న బద్ది పోచమ్మ ఆలయ ప్రహరీ, శివార్చన వేదిక నిర్మాణం పనులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని