logo

అమ్మలను స్మరిస్తూ.. తరిస్తూ..

మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. భక్తిభావంతో పులకించిపోతోంది. జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది.. అటు జంపన్నవాగులో స్నానాలు, ఇటు అమ్మల దర్శనానికి బారులు.. తొలిరోజు బుధవారం ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

Published : 22 Feb 2024 05:10 IST

మేడారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.. భక్తిభావంతో పులకించిపోతోంది. జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది.. అటు జంపన్నవాగులో స్నానాలు, ఇటు అమ్మల దర్శనానికి బారులు.. తొలిరోజు బుధవారం ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్నలు భక్తులకు  ఆశీస్సులు అందిస్తున్నారు. 

అంకెల్లో వివరాలు..

  • బుధవారం జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించినవారు :  20 లక్షలు
  • అమ్మవార్లను దర్శనం చేసుకున్న వారు : దాదాపు 25 లక్షలు
  • తరలివచ్చిన వాహనాలు : దాదాపు 2 లక్షలు..  40 పార్కింగ్‌ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి.
  • గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలు: 100కు పైగా
  • పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది : 4 వేలు

సంక్షిప్తంగా..

  • అమ్మవార్ల దర్శనానికి లక్షలాదిగా తరలివస్తున్నారు. రేయింబవళ్లు దర్శనాలు కొనసాగుతున్నాయి.
  • ఇండియన్‌ అగ్రిటెక్‌ సంస్థ లక్ష నీటి సీసాలు స్వచ్ఛందంగా భక్తులకు అందజేసింది. మేడారంలో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించారు.
  • మేడారంలో పర్యావరణం దెబ్బతినకుండా కాలుష్య నియంత్రణ మండలి వ్యర్థాలు, చెత్త నిర్వహణ, ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
  • కేంద్ర జౌళీశాఖ  హరిత హోటల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన కళలు, చేతి వృత్తుల ప్రదర్శనను మంత్రి సీతక్క ప్రారంభించారు. ః పెద్ద సంఖ్యలో చిన్నారులు, పెద్దలు తప్పిపోతున్నారు. వీరిని గుర్తించేందుకు తప్పిపోయిన వ్యక్తుల గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మేడారానికి ఆర్టీసీ బస్సుల్లో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 18 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 2,17,315 మంది ప్రయాణం చేశారు. బుధవారం ఒక్కరోజే  2400 బస్సుల్లో 1,08,266 మంది తరలివచ్చారు.


ఇంటిల్లిపాది కలిసి వచ్చినా ఎక్కడ తప్పిపోతారో తెలియని పరిస్థితి. దీంతో స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్రకు జెండాలు, ఇతరత్రా గుర్తులను ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నారు. ఈ సంకేతాల ఆధారంగా తమ వారివద్దకు చేరుకుంటున్నారు.

మేడారం (డోర్నకల్‌)


జాతరలో జాలీగా తిరిగేద్దాం

అమ్మవార్ల దర్శనం అనంతరం జాతరలో సరదాగా చూడడానికి దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం..  

  • రెడ్డిగూడెం సమీపంలో గిరిజన మ్యూజియం ఉంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలతో కూడిన చిత్రాలు, వినియోగించిన వస్తువులు చూడొచ్చు. సమ్మక్క జీవిత చరిత్రను బొమ్మల్లో తీర్చిదిద్దారు.  
  • గిరిజన మ్యూజియం ఆవరణలో ఆంపీ థియేటర్‌ ఉంది. ఆదివాసీ నృత్యాలు, నాటకాలు ప్రదర్శిస్తారు. అనేక రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరుస్తాయి.
  • హరిత హోటల్‌లో రుచికరమైన వంటలు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ వసతి కోసం 24 గదులు, 25 ఆధునిక టెంట్లున్నాయి. ప్రముఖుల బస కోసం స్విస్‌ కాటేజీలు, గుజరాత్‌ దర్బార్‌ గుడారాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  
  • మేడారం పరిసరాల్లోని సమ్మక్క గుడి గురించి చాలా మందికి తెలియదు. గద్దెలకు కాస్త దూరంలో పూజారుల నివాసాల మధ్య ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
  • సమ్మక్కను చిలకలగుట్టపై నుంచే గద్దెలకు తీసుకొస్తారు. ఈ గుట్ట ప్రకృతి రమణీయంగా ఉంటుంది. సమీపంలో సమ్మక్క జలపాతం ఉంటుంది. గుట్ట చుట్టూ ప్రహరీకి అందమైన బొమ్మలు చూడముచ్చటగా ఉంటాయి.
  • అమ్మవార్ల గద్దెలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న  కన్నెపల్లిలో సారలమ్మ ఆలయం కొలువై ఉంది. పచ్చని పొలాల మధ్య ప్రకృతి రమణీయతతో అలరారుతోంది.

ఈనాడు వరంగల్‌, ఈనాడు డిజిటల్‌, భూపాలపల్లి, న్యూస్‌టుడే, హనుమకొండ చౌరస్తా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని