logo

భూ దందాలకు అధికారుల దన్ను!

కరీంనగర్‌ భూ కబ్జాల వ్యవహారంలో ఒక్కొక్కరి చిట్టా వెలుగులోకి వస్తోంది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారి బండారం బయటపడుతోంది. ముఖ్యంగా వందల సంఖ్యలో భూ బాధితులకు జరిగిన అన్యాయంలో కొందరు అధికారుల పాత్రా స్పష్టమవుతోంది.

Published : 22 Feb 2024 05:11 IST

విచారణలో వెల్లడవుతున్న అక్రమాలు
ఈనాడు, కరీంనగర్‌

రీంనగర్‌ భూ కబ్జాల వ్యవహారంలో ఒక్కొక్కరి చిట్టా వెలుగులోకి వస్తోంది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారి బండారం బయటపడుతోంది. ముఖ్యంగా వందల సంఖ్యలో భూ బాధితులకు జరిగిన అన్యాయంలో కొందరు అధికారుల పాత్రా స్పష్టమవుతోంది.. కబ్జాదారులతో చేతులు కలిపి అక్రమాలకు దన్నుగా నిలిచిన వైనం పోలీసుల దృష్టికి వస్తోంది.. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో గతంలో పనిచేసిన కొందరి సహకారంతో అక్రమార్కులు విలువైన భూములను ఇష్టానుసారం కబ్జా చేశారు.. భూ మాఫియాకు వివిధ స్థాయిల్లోని అధికారులు సహకారం అందించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.. కాసుల కక్కుర్తిలో అందినకాడికి దండుకున్నది కొందరైతే.. స్థిరాస్తి వ్యాపారులు, దళారులకు సహకరించేందుకు రికార్డులను తారుమారు చేసి ఆస్తులను కూడగట్టుకుంది ఇంకొందరు. న్యాయం కోసం ఠాణా మెట్లెక్కిన వారిపై జులుం చూపించింది మరికొందరు. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉండి అక్రమాల పీచమణచాల్సినవారే.. దందారాయుళ్ల పంచన చేరి బాధితులకు అన్యాయం చేశారు.. ప్రస్తుతం పోలీసులు పక్కాగా విచారణ చేస్తూ కేసులు నమోదు చేస్తుండటంతో అటు కబ్జారాయుళ్లతోపాటు ఇటు వారికి సహకరించిన అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇక్కడిక్కడే పోస్టింగ్‌లు..

కరీంనగర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పని చేసిన అనుభవాన్ని కొందరు అధికారులు తమ స్వార్థం కోసం.. అక్రమార్కుల మేలు కోసం ఉపయోగించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఇలా పని చేసినవారు అక్రమార్కులకు వంత పాడటంలో ముందున్నారు. ధరణి పోర్టల్‌ రాకముందు పహాణీలు మాన్యువల్‌గా ఇచ్చే సమయంలో కరీంనగర్‌తోపాటు పక్కనే ఉన్న కొత్తపల్లి, కరీంనగర్‌ గ్రామీణ మండలాల్లోని భూముల విషయంలో వీఆర్వో మొదలు జిల్లా స్థాయి అధికారుల వరకు రికార్డులు తారుమారు చేశారనే అభియోగాల్ని ఎదుర్కొన్నారు. ఇదే తరహాలో పోలీసు శాఖలోనూ కొందరు బాధితుల పక్షాన నిలవకుండా ఆక్రమణదారులకు మేలు చేశారు. ఒకవేళ బాధితుడు కింది స్థాయి అధికారిపై ఫిర్యాదు చేసినా.. పైస్థాయి సార్లకు కూడా అందులో వాటా ఉండటంతో వారిని వెనకేసుకొచ్చేవారు. విచారణలు, చర్యల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించేవారు. గతంలో పనిచేసి వెళ్లిన వారు కూడా పాత తేదీల్లో రికార్డులు మార్చిన సందర్భాలు ఇటీవల కేసుల్లో బయటపడతుండటం అధికార వ్యవస్థ అక్రమార్కులకు ఏ స్థాయిలో సాయపడిందో అర్థమవుతోంది.

ఎవరెవరని గుర్తిస్తున్న సీపీ!

భూమి పత్రాల ఫోర్జరీ, బెదిరింపు వ్యవహారంలో గతంలో పని చేసిన తహసీల్దార్‌పై కేసు నమోదు చేసిన సంఘటన సంచలనంగా మారింది. కమిషనరేట్‌కు ఇప్పటి వరకు 800 మందికి పైగా బాధితులు ఫిర్యాదులను అందించగా ప్రతి కేసును సీపీ అభిషేక్‌ మహంతి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏసీపీ, సీఐలు విచారణ అనంతరం వాస్తవాల్ని సీపీ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎక్కువ కేసుల్లో రెవెన్యూ సిబ్బంది వ్యవహారాలు వెలుగులోకి వస్తుండటంతో వారి పేర్లను ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. ఎక్కువ కేసులు నిర్ణీత సమయంలోనే జరగడం.. ఆ సమయంలో రెవెన్యూ, పోలీసు విభాగాల్లో ఉన్న అధికారులు ఏళ్లపాటు కొనసాగడం విచారణలో గుర్తిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసి వారు చేసిన తప్పిదాలపై ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితాలో కరీంనగర్‌ గ్రామీణ మండలంలో పని చేసిన అయిదారుగురు రెవెన్యూ సిబ్బంది పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఓ ఎస్సై తనకున్న పలుకుబడితో భూ పంచాయతీ ఏ ఠాణాకు వెళ్లినా అక్కడున్న పోలీసులను మభ్యపెట్టి బాధితులకు మేలు జరగకుండా దందా చేసేవారికి కొమ్ముకాశారని గుర్తించారు. ఇలా ఈ ఎస్సై మాత్రమే కాకుండా మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారంపై సీపీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై శాఖాపరమైన చర్యల్ని తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని