logo

నిరీక్షణ ముగిసింది.. సంతోషం విరిసింది

ఒకటా.. రెండా.. 18 ఏళ్లుగా నిరీక్షణ. కడుపు నిండా తిని.. కంటి నిండా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలైందో. దుబాయ్‌ అనే మాట వినిపిస్తే చాలు రామలక్ష్మణుల్లాంటి తమ కుమారులను తలచుకుని రోదించేవారు.

Updated : 22 Feb 2024 06:02 IST

18 ఏళ్ల తర్వాత దుబాయి జైలు నుంచి విముక్తి
ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, న్యూస్‌టుడే, సిరిసిల్ల గ్రామీణం

కటా.. రెండా.. 18 ఏళ్లుగా నిరీక్షణ. కడుపు నిండా తిని.. కంటి నిండా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలైందో. దుబాయ్‌ అనే మాట వినిపిస్తే చాలు రామలక్ష్మణుల్లాంటి తమ కుమారులను తలచుకుని రోదించేవారు. ఎడారి దేశాన జీవితకాలం బయటకు రాలేనంత శిక్ష పడిందని కుమిలిపోయేవారు. ఎన్నో ఏళ్ల నిట్టూర్పులో ఎక్కడో చిన్న ఆశ. తమ వారు ఎన్నటికైనా క్షేమంగా బయటకు వస్తారని నమ్మకం. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వారికి మాటిచ్చారు. ఫలితంగా చాలా ఏళ్ల ప్రయత్నాల తర్వాత దుబాయ్‌ జైలు నుంచి విముక్తి లభించింది. ఎట్టకేలకు విమానాశ్రయంలో కొడుకులను చూడగానే ఆ వృద్ధుల కళ్లు చెమర్చాయి. కుటుంబ సభ్యులను చూసుకొని వలసజీవులు భావోద్వేగానికి గురయ్యారు.

వాచ్‌మెన్‌ హత్య కేసులో దుబాయ్‌ జైలులో 18 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఇద్దరికి ఎట్టకేలకు విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిలు బుధవారం ఇంటికి చేరుకున్నారు. అన్నదమ్ములైన వీరు కోనరావుపేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్‌, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన హన్మంతులతో కలిసి 2004లో ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లారు. 2005లో అక్కడ వీరు పని చేస్తున్న దగ్గర నేపాల్‌కు చెందిన వాచ్‌మెన్‌ దిల్‌ప్రసాద్‌రాయ్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఈ అయిదుగురికి 25 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఈ విషయం తొలుత 2011లో ‘ఈనాడు’ కథనం ద్వారా వెలుగులోకి  వచ్చింది. దీనిపై స్పందించిన అప్పటి మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. జైల్లో ఉన్న వారిని రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేశారు. కేటీఆర్‌ స్వయంగా నేపాల్‌ వెళ్లి వాచ్‌మెన్‌ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల నగదు అందజేశారు. హతుడు దిల్‌ప్రసాద్‌రాయ్‌ భార్య నుంచి క్షమాభిక్ష పత్రంలో సంతకం తీసుకుని న్యాయవాదుల ద్వారా దుబాయ్‌ న్యాయస్థానానికి పంపారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడం, అంతకు ముందున్న నిబంధనలు మరింత కఠినతరం కావడంతో జాప్యం జరుగుతూ వచ్చింది. తర్వాత నిందితుల అనారోగ్య కారణాలను చూపుతూ చేసిన ప్రయత్నం ఫలించింది. అందులో భాగంగా 2023 సెప్టెంబరు 21న కోనరావుపేట మండలానికి చెందిన దుండగుల లక్ష్మణ్‌ విడుదలై ఇంటికి చేరారు. జగిత్యాల జిల్లా మానాలకు చెందిన హన్మంతు ఆదివారం రాగా, బుధవారం పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవిలు ఇంటికొచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులను కలుసుకున్నాక ‘ఈనాడు’ కథనం ద్వారా తమకు సహకారం లభించిందని పేర్కొన్నారు. 2011 నుంచి మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన కృషి ఫలితంగానే విముక్తి కలిగిందని, ఆయన సొంత ఖర్చులతో విమాన టికెట్లు ఏర్పాటు చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మరోసారి గల్ఫ్‌ దేశాలకు వెళ్లమని కార్మికులు చెప్పారు. ఇదే విషయాన్ని కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ప్రస్తావించి, విడుదలైన కార్మికులు మాట్లాడిన వీడియోలను పోస్టు చేశారు. చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి రాష్ట్రానికి వచ్చేందుకు వీసాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీరితో కలిసి రాలేకపోయారు. వెంకటి వచ్చే నెలలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


నేతల పరామర్శ

స్వగ్రామానికి వచ్చిన శివరాత్రి మల్లేశం, రవిలను భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, నాయకులు వెంకట రమణారావు, అగ్గి రాములు, రమేశ్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, నాయకులు వైద్య శివప్రసాద్‌, గ్రామస్థులు పరామర్శించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని