logo

ఆర్‌అండ్‌బీ శాఖలో కలకలం

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన తీగల వంతెన.. అతిథిగృహం పనులపై  మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు జిల్లా పాలనాధికారి విచారణకు ఆదేశించడంతో ఆ శాఖ అధికారుల్లో  కలకలం రేపుతోంది.

Published : 22 Feb 2024 05:19 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన తీగల వంతెన.. అతిథిగృహం పనులపై  మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు జిల్లా పాలనాధికారి విచారణకు ఆదేశించడంతో ఆ శాఖ అధికారుల్లో  కలకలం రేపుతోంది. ఇప్పటికే విశ్రాంతి అతిథిగృహం పనులపై విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతుండగా  మరో విచారణకు ఆదేశాలు రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో పనులు.. కొత్త ప్రభుత్వంలో విచారణలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని గత ప్రభుత్వ నేతలు నిబంధనలకు నీళ్లు వదిలారంటూ, ప్రస్తుత ప్రభుత్వ నేతలు విచారణలకు ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద ఈ రెండు పనులపై విచారణ ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

తీగల వంతెనపై ..

తీగల వంతెన ప్రారంభించిన కొత్తల్లోనే తారు దెబ్బతినడం, రోడ్డు గుంతలు పడటంతో గందరగోళానికి గురి చేసింది. రూ.224 కోట్లతో తీగల వంతెన పనులు చేపట్టారు. రూ.181 కోట్లు వంతెనకు, రూ.40 కోట్లు అప్రోచ్‌ రోడ్లకు ఖర్చు చేశారు. మూడు ఐలాండ్‌ల నిర్మాణం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చేపట్టారు. తీగల వంతెన పనులను టాటా గులె మార్క్‌ సంస్థ పూర్తి చేసి బిల్లులు పొందింది. తపస్వి సంస్థ డిజిటల్‌ లైటింగ్‌ పనులు పూర్తి చేసింది. అప్రోచ్‌ రోడ్‌ పనులను స్థానిక గుత్తేదారులు నిర్మించారు. ఈ పనులకు రూ.5 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణ చేస్తుండటంతో గుత్తేదారులు, అధికారులు ఎక్కడికి దారి తీస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు. విచారణ కమిటీ ఆదేశాల మేరకు పూర్తి వివరాల రికార్డు కమిటీకి అందజేశారని, పనుల్లో  ఎలాంటి అవకతవకలు లేవని ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన ఒక అధికారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


అతిథిగృహంపై విజి‘లెన్స్‌’

రూ.13 కోట్ల వ్యయంతో కరీంనగర్‌లోని పాత ఆర్‌అండ్‌బీ అతిథిగృహం స్థానంలో అధునాతన హంగులతో కొత్త భవనాన్ని నిర్మించారు. గతేడాది జనవరిలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. వాస్తవంగా 2018లో ఈ భవన నిర్మాణానికి రూ.7.25 కోట్లతో పనులు చేపట్టేందుకు సాంకేతిక మంజూరు లభించింది. 2019లో సీఎం హామీ నిధుల కింద రూ.4.25 కోట్లు విడుదలయ్యాయి. పనులు చేపట్టగా నిధులు సరిపోకపోవడంతో మినరల్‌ సెస్‌ నిధులు రూ.కోటి విడుదలకు అప్పటి కలెక్టర్‌ హామీ ఇచ్చారు. పనుల్లో భాగంగా రూ.4.25 కోట్లు చెల్లించారు. మిగిలినవి అప్పటి ముఖ్య నేతల ఒత్తిడి మేరకు చకచకా చేపట్టారు. ఈ నిధులతో కూడా భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో రూ.7.75 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. టెండర్‌ ఆమోదం, సాంకేతిక మంజూరు రాగా ఈలోగా ప్రభుత్వాలు మారాయి. కొత్త ప్రభుత్వంలో కొందరు నాయకుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్‌ విచారణ జరుపుతోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇటీవల సమీక్ష సమావేశంలో ఈ పనులపై విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా పాలనాధికారి నలుగురు అధికారులతో కూడిన కమిటీ వేయడం, విచారణ ప్రక్రియ సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని