logo

అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన ముగ్గురి అరెస్ట్‌

అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా కొనుగోలుదారుడిని చంపుతామంటూ భయభ్రాంతులకు గురి చేసిన ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తిమ్మాపూర్‌ సీఐ స్వామి, ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు తెలిపారు.

Updated : 23 Feb 2024 06:03 IST

తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే : అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడమే కాకుండా కొనుగోలుదారుడిని చంపుతామంటూ భయభ్రాంతులకు గురి చేసిన ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు తిమ్మాపూర్‌ సీˆఐ స్వామి, ఎల్‌ఎండీ ఎస్సై చేరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం ఇందిరానగర్‌  గ్రామంలో సర్వే నంబర్‌ 752//బి లో నాలుగు ప్లాట్ల స్థలం 600ల చదరపు గజాలు కరీంనగర్‌ కార్ఖానా గడ్డకు చెందిన నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆయన జీపీఏ అయిన మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ల పేరిట ఉందని, తిమ్మాపూర్‌కు చెందిన శ్రీరామోజు శ్రీనివాస్‌ కరీంనగర్‌కు చెందిన రంగు వెంకటాచారిని నమ్మించారు. దీంతో వెంకటాచారి 2012లో ఆ భూమిని రూ.10,95,000లకు కొనుగోలు చేశారు. 2022లో మోకా మీదకు వెళ్లిన వెంకటాచారికి ఆ భూమిని 2008లోనే నజీర్‌ అహ్మద్‌ వేరే వ్యక్తికి అమ్మారని, ఆయన మరో వ్యక్తికి అమ్మేసినట్లు తెలిసింది. దీంతో తనను మోసం చేసి డబుల్‌ రిజ్రిస్టేషన్‌ చేశారని గుర్తించిన రంగు వెంకటాచారి వెంటనే వారిని నిలదీసినా లాభం లేకపోయింది. గట్టిగా నిలదీస్తే చంపుతామని బెదిరించడంతో ఊరుకున్నారు. తనకు, తన కుటుంబానికి ఆ ముగ్గురి నుంచి ప్రాణహాని ఉందని గత నెల 24న ఎల్‌ఎండీ ఠాణాలో వెంకటాచారి ఫిర్యాదు చేశారు. విచారణలో వాస్తవాలు గుర్తించి నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌, మహమ్మద్‌ సిరాజుద్దీన్‌, శ్రీరామోజు శ్రీనివాస్‌లను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు  సీఐ, ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని