logo

ముందస్తు అప్రమత్తం.. ప్రమాదాలు దూరం

వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. విద్యుత్తు వినియోగంతో పాటు దీపాలు వెలిగించే సమయాల్లో సైతం జాగ్రత్తలు తీసుకోవాలి.

Published : 23 Feb 2024 04:17 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

మంటలను ఆర్పే విధానంపై ప్రదర్శన ఇస్తున్న అగ్నిమాపక సిబ్బంది (పాతచిత్రం)

 • రీంనగర్‌లో కూలీనులు చేసుకుంటూ జీవించే వారి నివాసాలు మంగళవారం బుగ్గిపాలయ్యాయి. 21 గుడారాలు అగ్నికి ఆహుతయ్యాయి. రూ.40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. 30 కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్న సిలిండర్లు పేలి మరింత బీభత్సం సృష్టించాయి. ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

 • పెద్దపల్లి హనుమాన్‌నగర్‌లోని పెంకుటింట్లో బుధవారం దేవుడికి దీపం వెలిగించిన అనంతరం కుటుంబ సభ్యులు జాతరకు వెళ్లారు. మంటలు ఇంటి మొత్తానికి వ్యాపించడంతో రెండు కుటుంబాలకు చెందిన సుమారు రూ.6 లక్షల సొత్తు కాలిపోయింది.

వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటిని నివారించడం మన చేతుల్లోనే ఉంది. విద్యుత్తు వినియోగంతో పాటు దీపాలు వెలిగించే సమయాల్లో సైతం జాగ్రత్తలు తీసుకోవాలి. వంట చేసే సమయంలో నిర్లక్ష్యం వల్ల సైతం ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఒక్కోసారి ఒకరి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించి భారీ మొత్తంలో నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. గ్రామాల్లో గడ్డివాములపై, అడవుల్లో నిర్లక్ష్యంగా సిగరెట్‌ పీకలను పడేసినా ప్రమాదమే. గ్యాస్‌ సిలిండర్‌ నుంచి విద్యుత్తు వినియోగం వరకు ప్రతి విషయంలోనూ వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండటం ద్వారా అగ్ని ప్రమాదాలను సాధ్యమైనంత వరకు నివారించే అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో గడచిన నాలుగేళ్లలో 5,697 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. రూ.70.88 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

పెరుగుతున్న ప్రాణ, ఆస్తినష్టం

అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వేసవి కాలంలోనే జరుగుతుంటాయి. దీనివల్ల భారీ ఆస్తి నష్టంతో పాటు కొన్ని సంఘటనల్లో ప్రాణనష్టం సంభవిస్తోంది. తుపాను, వరదల సమయంలో జరిగే ప్రాణనష్టం కంటే అగ్ని ప్రమాదాల్లో మరణాలు అధికంగా ఉంటున్నాయి. పొగ, మంటల వల్ల వెలువడే విష వాయువుల కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిని ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. అగ్ని ప్రమాదాల్లో 80 శాతం మరణాలు విషవాయువులు పీల్చడం వల్ల నమోదవుతున్నవే. కర్మాగారాలు, గిడ్డంగులు, సామూహిక భవనాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లో అగ్గి రాజుకోవడం వల్ల వణ్యప్రాణుల మనుగడ, అడవుల పెంపకం ప్రశ్నార్థకంగా మారుతోంది.


జాగ్రత్తలు పాటిస్తే మేలు

 • పాఠశాలలు, షాపింగ్‌మాల్స్‌, ఆసుపత్రుల్లో ఫైర్‌ ఆలారం, స్మోక్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి.
 • సెల్లార్‌లలో ఆటోమేటిక్‌ స్పింక్లర్లను ఉపయోగించాలి.
 • పాఠశాలలు, ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సులువుగా తప్పించుకోడానికి మార్గాలు ఏర్పాటు చేయాలి. బయటకు వెళ్లేందుకు తలుపులు, మెట్ల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి.
 • ఐఎస్‌ఐ మార్కు కలిగిన వైరింగ్‌ సామగ్రిని భవనాలకు వినియోగించాలి.
 • పాఠశాలలు, ఆసుపత్రుల భవనాల పైకప్పుపై గడ్డి, తాటాకులు ఏర్పాటు చేయకూడదు.
 • విద్యుత్తుషార్ట్‌ సర్క్యుట్‌ జరగకుండా సర్క్యూట్‌ బ్రేకర్‌లను అమర్చుకోవాలి.
 • వంట గదిలో గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలి.
 • కాలంచెల్లిని గ్యాస్‌పైపులు వాడకూడదు. వంట పూర్తికాగానే రెగ్యులేటర్‌ వాల్‌ ఆపివేయాలి. గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వస్తే సంబంధిన కంపెనీ వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి.
 • ఒంటికి నిప్పంటుకుంటే పరుగెత్తకుండా నేలపై పడుకుని దొర్లాలి.
 • పొగతో నిండిన గదిలో ముక్కుకు తడిగుడ్డ పెట్టుకుని మోకాళ్లపై పాకుతు ముందుకు వెళ్లాలి.
 • గడ్డివాములు నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. ఒకే చోట కాకుండా చిన్న చిన్న గడ్డివాములు ఏర్పాటు చేసుకోవాలి.
 • ఇళ్లలో చిన్న పిల్లలకు అగ్గిపెట్టెలు ఇవ్వకూడదు. మండే వస్తువులు, పేలుడు పదార్థాలు అందుబాటులో ఉంచకూడదు.
 • కాల్చిన సిగరెట్లు, బీడీలు, చుట్ట ఆర్పకుండా బయట పడేయకూడదు.
 • ఎక్కువ రోజులు ఊరికి వెళ్లాల్సి వస్తే ఇంట్లో విద్యుత్తు మేయిన్‌ ఆఫ్‌ చేయాలి.
 • అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 101, 100 టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారం అందించాలి.

కారణాలు ఇవే

 • బాణసంచా దుకాణాల వద్ద కాల్చిన సిగరేట్‌, బీడీ పీకలను నిర్లక్ష్యంగా వేయడం.
 • గ్యాస్‌, కిరోసిన్‌ స్టౌవ్‌లపై వంట చేసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం.
 • విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌, అతిగా వేడి అయ్యే విద్యుత్తు ఉపకరణాలు, నాణ్యత లేని విద్యుత్తు ఉపకరణాలు వాడటం.
 • రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలకు నిప్పు పెట్టడం.
 • ఎండుగడ్డిని వాహనాల్లో తీసుకువెళ్లే సమయంలో అధిక ఎత్తులో పేర్చి తరలించడం వల్ల విద్యుత్తు తీగలకు తగిలి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
 • ఎండాకాలంలో అడవుల్లో చెట్ల ఆకులు రాలిఉంటాయి. గడ్డిసైతం ఎండిపోయి ఉంటుంది. ఎవరైనా నిప్పువేస్తే భారీగా అడవులు తగలబడిపోతాయి.
 • వాహనాల ఇంజిన్‌లో లోపాలు తలెత్తడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడం.

అవగాహన పెంచుకోవాలి
-సత్యనారాయణ, అగ్నిమాపక అధికారి

వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. వంట చేసే సమయంలో మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్తు వినియోగంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇంటి పరిసరాల్లో చెత్త, వృథా వస్తువులు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అగ్ని ప్రమాదం సంభవిస్తే నివారణ మార్గాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని