logo

ఆధునిక వైద్యం.. అత్యుత్తమ సేవలు

ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాలంటే రోగులు భయపడేవారు. సరైన వైద్య సేవలు అందని పరిస్థితే ఇందుకు కారణం. అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి రావడం రోగులకు వరంగా మారింది.

Updated : 23 Feb 2024 06:00 IST

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి ఏటా పురస్కారాలు

సేవలకు గుర్తింపుగా వచ్చిన అవార్డులు

న్యూస్‌టుడే, వేములవాడ: ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాలంటే రోగులు భయపడేవారు. సరైన వైద్య సేవలు అందని పరిస్థితే ఇందుకు కారణం. అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి రావడం రోగులకు వరంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటులో ఖరీదైన వైద్యం పొందలేని వారికి ప్రభుత్వ ఆసుపత్రి కొండంత అండగా నిలుస్తోంది. ఆసుపత్రిలో సేవలకు గుర్తింపుగా ఏటా అవార్డులు అందుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు వేములవాడలోని ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది. ఆసుపత్రి ప్రారంభించిన అనతి కాలంలోనే గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది. వీటితోపాటు వచ్చిన నిధుల్లో 25 శాతం వైద్య సిబ్బందికి, మిగతా 75 శాతం ఆసుపత్రి అభివృద్ధికి వినియోగిస్తున్నారు.

సేవలు ఇవీ...

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి వేములవాడ పట్టణంతో పాటు వేములవాడ, వేములవాడ గ్రామీణం, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయినపల్లి మండలాల నుంచి నిత్యం రోగులు వస్తుంటారు. అన్ని సౌకర్యాలతో ఆధునిక హంగులతో ఆసుపత్రిని నిర్మించారు. నెలకు దాదాపు పది వేల మంది రోగులు వస్తుంటారు. ఇందులో దాదాపు 18 మంది వైద్య నిపుణులు, మహిళా వైద్యులు, మరో 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మోకీళ్ల మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. సాధారణ కాన్పులు ఎక్కువ సంఖ్యలో అయ్యే విధంగా గర్భిణులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ప్రత్యేక వ్యాయామం చేయించి ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ మాతాశిశు సంరక్షణ కేంద్రం ద్వారా గర్భిణులకు సేవలందిసున్నారు. స్కానింగ్‌, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, సీటీస్కాన్‌ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. డయాలసిస్‌ కేంద్రం చుట్టు పక్కల మండలాల రోగులకు ఎంతో ఉపయోగపడుతుంది.


సమష్టి కృషితోనే...
- ఆర్‌.మహేశ్‌రావు, ప్రాంతీయ ఆసుపత్రి, సూపరింటెండెంట్‌, వేములవాడ

ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంతా సమష్టిగా పని చేయడంతోనే ఆసుపత్రికి అవార్డులు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మొదట ప్రాధాన్యం ఇస్తున్నాం. అవార్డులు రావడంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై మరింత బాధ్యత పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని