logo

రాజకీయాలకతీతంగా రామగుండం అభివృద్ధి

రాజకీయాలకు అతీతంగా రామగుండం నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ కోరారు. నగరపాలక సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నగరపాలకవర్గ బడ్జెట్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 23 Feb 2024 04:25 IST

ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌

పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే  మక్కాన్‌సింగ్‌, కమిషనర్‌ శ్రీకాంత్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌, కార్పొరేటర్లు

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే: రాజకీయాలకు అతీతంగా రామగుండం నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ కోరారు. నగరపాలక సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నగరపాలకవర్గ బడ్జెట్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం ప్రాంతంలో గత కొంత కాలంగా ఉపరితల బొగ్గుగనులు, మూతపడిన భూగర్భ బొగ్గుగనులు, మూతపడ్డ పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు లేక యువత వలసబాట పట్టడంతో జనాభా తగ్గుతుందన్నారు. ఎన్టీపీసీలో మరో ప్లాంట్‌, జెన్‌కో ప్లాంటు పునరుద్ధరణతో ఈ ప్రాంతానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో రామగుండం ప్రాంతంలోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చానని ఆయన వివరించారు. స్థానిక ప్రభుత్వరంగ సంస్థల సీఎస్సార్‌ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా రామగుండం అభివృద్ధికే కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డి.ఎం.ఎఫ్‌.టి. నిధులు రూ.10 కోట్లతో లక్ష్మీనగర్‌ ప్రాంతాభివృధ్ది, మరో రూ.29 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. టి.యు.ఎఫ్‌.ఐ.డి.సి నుంచి రూ.100 కోట్లు, అమృత్‌ నుంచి రూ.250 కోట్లతో నగరంలో రహదారులు, మురుగు కాలువలు, మురుగు జలాల శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నామన్నారు.  బడ్జెట్‌లో, పాలకవర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌కుమార్‌ కోరారు. వ్యయానికి తగినట్లుగా ఆదాయం లేకపోవడంతో ఆదాయ వనరులను పెంచుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. అందరి సహకారంతో కార్పొరేషన్‌ తమవంతు కృషి చేస్తామని కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ అన్నారు. కాగా కుక్కలు, కోతుల బెడద నివారణలో నగరపాలిక తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్పొరేటర్‌ పెద్దెల్లి తేజస్విని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలన్నారు.

బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదం

రూ.211.22 కోట్ల అంచనా ఆదాయంతో పాలకవర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్‌ను పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. అంచనా వ్యయం రూ.196.42 కోట్లు కాగా రూ.14.79 కోట్ల మిగులును ప్రతిపాదనలకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. డిప్యూటీ కమిషనర్‌ త్రియంబకేశ్వర్‌రావు, కార్యదర్శి రాజు, ఎస్‌ఈ చిన్నారావు, ఈఈ సుచరణ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రాజలింగు, సూపరింటెండెంట్‌ మనోహర్‌, కార్పొరేటర్లు, కో-ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని