logo

రూ. కోట్ల వ్యయం.. నిర్వహణ అస్తవ్యస్తం

రామగుండం నగరపాలక ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగానే ఉంది. రహదారులపై చెత్త, కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతునే ఉన్నారు.

Updated : 23 Feb 2024 06:05 IST

నిరుపయోగంగా చెత్త నిర్వహణ కేంద్రం

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం: రామగుండం నగరపాలక ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగానే ఉంది. రహదారులపై చెత్త, కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతునే ఉన్నారు. ఇంటింటా చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు చెత్తను రహదారులపైనే పడేయాల్సి వస్తుంది. తడి, పొడి చెత్త నిర్వహణ అటకెక్కింది. మురుగునీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడంతో నగరంలోంచి వెలువడే వ్యర్థాలు నేరుగా గోదావరినదిలో కలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు గోదావరి ఒడ్డున సమ్మక్క జాతర స్థలాన్ని డంపింగ్‌ యార్డుగా వినియోగించారు. నగర విస్తీర్ణానికి సరిపడేలా పారిశుద్ధ్య కార్మికులు, పర్యవేక్షకులున్నప్పటికీ ఆశించిన మేరకు పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పడడం లేదు. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫలితాల్లో గతంలోకంటే వెనకబడిపోవడమే ఇందుకు నిదర్శనం.

పర్యవేక్షణ లోపమే ప్రధానం

పారిశుద్ధ్య నిర్వహణలో బల్దియా విఫలమవుతోంది. పారిశుద్ద్య పనులను పర్యవేక్షించేందుకు ముగ్గురు పర్యవేక్షకులు, మరో 16 మంది సహాయ పర్యవేక్షకులు, వీరికి సహాయకులుగా మరో 12 మంది ఉన్నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పారిశుద్ధ్య విభాగంలో 40 మందికి పైగా పర్మినెంటు కార్మికులుండగా స్వీపర్‌ నుంచి మొదలుకొని సహాయ పర్యవేక్షకుల వరకు మొత్తం 448 ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేయాల్సిన సుమారు 40 మంది కార్మికులు నగరపాలక కార్యాలయంలో, కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల ఇళ్లల్లో పనిచేస్తుండటం గమనార్హం. దోమల నివారణలో కీలకమైన ఫాగింగ్‌ కార్మికులు నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నారు. నిరంతరంగా మురుగు కాలువలను శుభ్రం చేయాల్సిన డ్రెయిన్‌ క్లీనర్లు ఆయా పనులను విస్మరించి ఇతర పనులు చేస్తున్నారు. భూగర్భ, ఉపరితల మురుగు కాలువలను శుభ్రం చేసేందుకు 59 మంది డ్రెయిన్‌ క్లీనర్లు ఉండగా అదనంగా మరో 84 మందిని డ్రెయిన్‌ క్లీనర్లుగా నియమించినా భూగర్భ, ఉపరితల మురుగు కాలువల నిర్వహణే సక్రమంగా లేదు.

ఖర్చు పెరుగుతున్నా....

పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో ఏటా సుమారుగా రూ.20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా ఆశించిన మేరకు పురోగతి కనిపించడం లేదు. ఆయా విభాగాల్లోని కొందరు చేతివాటంతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతం వరకు పారిశుద్ధ్య విభాగంలో రూ.14.74 కోట్లు ఖర్చు చేసినట్లుగా నివేదికలు చెబుతుండగా మార్చి మాసాంతం వరకు మరో రూ.4 కోట్లకు పైగా వ్యయం కానుంది. వినియోగంలో లేని చెత్త తరలింపు, కేంద్రాల నిర్వహణకు గత ఆర్థిక సంవత్సరం రూ.29.52 లక్షలు ఖర్చు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.24.39 లక్షలు ఖర్చు చేశారట. బ్లీచింగ్‌ పౌడర్‌, చీపుర్లు, రసాయనాలు, డీజిల్‌ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 కోట్లు డీజిల్‌ బిల్లులు చెల్లించగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1.8 కోట్లు చెల్లించారు. వాహనాల మరమ్మతులకు మరో రూ.34.36 కోట్లు ఖర్చు చేశారు. చెత్త తరలింపులో కీలకమైన వాహనాల నిర్వహణ గాడి తప్పడంతో తరచూ మొరాయిస్తూనే ఉన్నాయి. రూ.కోట్లు వెచ్చించి చెత్త నిర్వహణలో అత్యాధునికమైన వాహనాలను కొనుగోలు చేసిన నగరపాలిక వినియోగాన్ని విస్మరించింది.

రామగుండం నగరపాలిక స్వరూపం
డివిజన్లు: 50
విస్తీర్ణం: 93.87 చదరపు కిలోమీటర్లు
జనాభా(2011 ప్రకారంగా): 2,29,644

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు