logo

ఆవిష్కరణలకు గుర్తింపు

ఇన్‌స్పైర్‌ మనక్‌-2022-23లో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. జగిత్యాల జిల్లాలోని 218 పాఠశాలలకు చెందిన 530 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలతో దరఖాస్తు చేయగా ఇందులో 79 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.

Published : 23 Feb 2024 04:37 IST

రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌ మనక్‌కు అయిదుగురి ఎంపిక
న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు, జగిత్యాల పట్టణం

న్‌స్పైర్‌ మనక్‌-2022-23లో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. జగిత్యాల జిల్లాలోని 218 పాఠశాలలకు చెందిన 530 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలతో దరఖాస్తు చేయగా ఇందులో 79 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అనంతరం జిల్లా స్థాయిలో ఇద్దరు ఇంటర్నల్‌ జ్యూరీ సభ్యులు, ఒక ఎక్స్‌టర్నల్‌ జ్యూరీ సభ్యుడు కలిపి ఆన్‌లైన్‌ ద్వారా అయిదుగురు విద్యార్థుల ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వీరిని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ బి.జగన్మోహన్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి బాజోజి శ్రీనివాస్‌, సైన్స్‌పోరం ప్రతినిధులు, గైడ్‌టీచర్లు, హెచ్‌ఎంలు అభినందించారు.  


ఆల్కహాల్‌ బ్రీత్‌ అనలైజర్‌

ఇబ్రహీంపట్నం జడ్పీ హైస్కూలుకు చెందిన బండి రుత్విక్‌ ఆల్కహాల్‌ బ్రీత్‌ అనలైజర్‌ను రూపొండించాడు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్‌ సిస్టం అనే సూత్రంపై ఆధారపడి ఆల్కహాల్‌ బ్రీత్‌ అనలైజర్‌ పనిచేస్తుంది. ఇందులో ఆల్కహాల్‌ నిర్దిష్ఠ అవధి ఉంటుంది. ఈ యంత్రాన్ని వాహనాలకు అమర్చినపుడు డ్రైవర్‌ ఆల్కహాల్‌ సేవించి వాహనం నడపాలని ప్రయత్నించినపుడు సెన్సార్‌ గుర్తించి ఇంజిన్‌ స్టార్ట్‌ కాకుండా హెచ్చరిస్తుంది. దీంతో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నపుడు జరిగే ప్రమాదాలను నివారించవచ్చు.


అడ్జెస్ట్‌మెంట్ పోడియం

ఇబ్రహీంపట్నం మండలం గోధూరు జడ్పీహైస్కూలుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బండి నవ్యశ్రీ అడ్జెస్ట్‌మెంట్ పోడియంను రూపొందించారు. పాఠశాలల్లో అన్నిరకాల కార్యక్రమాల్లో 6-10 తరగతుల విద్యార్థులు పాల్గొంటారు. విద్యార్థులు రకరకాల ఎత్తులో ఉండటంవల్ల పొడియంపైనుంచి మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది. దీనికిగాను అన్నిరకాల ఎత్తున్న విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా అడ్జెస్ట్‌మెంట్ పోడియంను రూపొందించారు. తమ ఎత్తుకు అనువైన పోడియం ఉండటంతో విద్యార్థులు ఉత్సాహంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే వీలుంది.


ఎరువుల పంపిణీ యంత్రం

కొడిమ్యాల మండలం రాంసాగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి లైసెట్టి విజయ్‌ ఎరువుల పంపిణీ పరికరాన్ని రూపొందించారు. చేతితో ఎరువులు చల్లితే ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువగా పడి మొక్కల ఎదుగుదలలో హెచ్చుతగ్గులుంటాయి. విజయ్‌ రూపొందించిన పరికరం ద్వారా ఎరువులను చల్లినపుడు అంతటా ఏకరీతిన పడతాయి. జీపీఎస్‌, గైడెడ్‌ సిస్టంద్వారానూ పనిచేసే ఈ పరికరంతో గుళికలు, పొడి, ద్రవరూప ఎరువులను కూడా చల్లవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణంలో చల్లబడే ఈ యంత్రం వాడకంతో ఎరువుల సమతుల్యత కాపాడి దిగుబడులు కూడా పెరిగే అవకాశముంది.


మామిడికాయలు తెంపే పరికరం

ఎక్కువ ఎత్తున్న మామిడి చెట్లపైనుంచి కాయలను తెంపటం రైతులకు ఇబ్బందిగా, శ్రమతో కూడుకున్నదిగా ఉంటుంది. దీనికిగాను లాంగ్‌పైప్‌స్టిక్‌, జాలీ, కట్టర్‌ తదితరాల సాయంతో మామిడి కాయలను తెంపే పరికరాన్ని రూపొందించాడు కోరుట్లలోని బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన బొడ్డు హర్షవర్ధన్‌. బ్యాటరీసాయంతో నడిచే ఈ పరికరంతో చెట్టెక్కే అవసరం లేకుండానే కిందనుంచే చిటారు కొమ్మనగల కాయలను కూడా సుళువుగా తెంపవచ్చు. కాయలను కిందపడకుండా తెంపటంతో పగలకుండా నాణ్యతతో కూడిఉండి మంచి ధర పలుకుతాయి.


సీనియర్‌ సిటిజన్స్‌ డైనింగ్‌ టేబుల్‌

పెగడపల్లి మండలం సుద్దపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కట్ల దినేశ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ ఫ్రెండ్లీ మల్టీపర్పస్‌ డైనింగ్‌ టేబుల్‌ను రూపొందించాడు. నొప్పులతో దూరం నడవలేని వారు, నిరంతరం సేవలకు సహాయకులు అందుబాటులో లేనివారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. స్టాండుపై కూర్చునే వీలుండటం, వాకర్‌ మాదిరిగా పట్టుకుని నడవటం, ఆహారం, మందులు, మంచినీటి వంటివి ఈ స్టాండుపైనే అమర్చుకునే వీలుండటం, భోజనం చేసేందుకు అనువుగా ఉండటంతో వృద్ధులు, నడవలేని వారికి ఈ డైనింగ్‌ టేబుల్‌ ఉపకరించే వీలుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు