logo

మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యం

ఇంటర్మీడియట్ పరీక్షలు 28 నుంచి మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు,

Published : 23 Feb 2024 04:40 IST

జిల్లా ఇంటర్‌ విద్యాధికారి నారాయణ
న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు, జగిత్యాల పట్టణం 

ఇంటర్మీడియట్ పరీక్షలు 28 నుంచి మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్‌లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు, జిల్లాలో పరీక్షల ఏర్పాట్లు, కేంద్రాల్లో సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా ఇంటర్‌ విద్యాధికారి నారాయణ ‘న్యూస్‌టుడే’ మాట్లాడారు. ఆ వివరాలు.  

ప్రశ్న: జిల్లాలో ఇంటర్‌ పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.?

జవాబు: ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. జిల్లాలో 15 ప్రభుత్వ, 13 ప్రైవేటు, మోడల్‌స్కూల్‌తో కలిపి మొత్తం 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాము. పరీక్షలకు మొత్తం 14,542 మంది విద్యార్థులు హాజరవ్వనుండగా ఇందులో జనరల్‌ 12,400, ఒకేషనల్‌ విద్యార్థులు 2,142 మంది ఉన్నారు.

ప్ర: మాస్‌కాపీయింగ్‌ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?

జ: ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు ప్రభుత్వ కళాశాలల వాళ్లే ఉంటారు. జిల్లాలో రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. వీరితోపాటు డీఈసీ బృందం, పరీక్షల కన్వీనర్‌ ప్రతిరోజూ పరీక్షల నిర్వహణను పరిశీలిస్తూ ఎలాంటి మాస్‌కాపీయింగ్‌ జరగకుండా చూస్తారు. ప్రైవేటు కళాశాలలపై ప్రత్యేక నిఘా ఉంటుంది, అనుమానమున్న ప్రతి కేంద్రాన్ని ప్రత్యేకంగా తనిఖీచేస్తాము. ఇన్విజిలేటర్లుగా విద్యాశాఖవారినే తీసుకుంటాము, వారికి సంబంధంలేనిచోటనే విధులను కేటాయిస్తాము. కాపీయింగ్‌ను ప్రోత్సహించినవారిపై కఠిన చర్యలుంటాయి.

ప్ర: పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు.?

జ: వార్షిక పరీక్షలపై అన్నిరకాల విధులు నిర్వర్తించేవారితో సమావేశాన్ని జరిపి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూస్తాము. విద్యార్థులకు సరిపడా డ్యూయల్‌ డెస్క్‌లు, తాగునీటి సౌకర్యం, వైద్యసహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. ఒక నిమిషం లేటైనా అనుమతి లేదు కాబట్టి విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 45 నిమిషాల ముందుగానే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. దూరప్రాంతాల నుంచి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరడానికి టీఎస్‌ఆర్టీసీ సహకారంతో ఆయా రూట్లలో బస్సు సమయాలు రీషెడ్యూల్‌ చేయబడ్డాయి. ఇంటర్‌బోర్డు అందుబాటులోకి తెచ్చిన సెంటర్‌ లొకేట్ మొబైల్‌ యాప్‌లో పరీక్షకేంద్రం కోడ్‌ను ఎంటర్‌చేసి సెర్చ్‌చేస్తే పరీక్షకేంద్రం రూట్మ్యాప్‌ చూపిస్తుంది.

ప్ర: విద్యార్థులు, తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలు.?

జ: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి భయానికి లోనుకావద్దు. తల్లిదండ్రులు విద్యార్థులకు భరోసా కల్పించాలి. విద్యార్థుల్లో భయం తొలగించేందుకు 14416 లేదా 1800914416 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌చేస్తే నిపుణులు మానసిక ప్రశాంతతను కలిగిస్తారు. హాల్‌టికెట్లను అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్‌ సంతకం కూడా అవసరంలేదు. ప్రైవేటు కళాశాలలకు చెందినవారు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది కలిగిస్తే పరీక్షల కన్వీనర్‌ 79979 94356 కు ఫోన్‌ చేయవచ్చు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లు, ప్రింటెడ్‌ మెటీరియల్‌ను వెంట తీసుకురావద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని