logo

సర్కారు స్థలాల పరిస్థితేంటి?

కరీంనగర్‌లో భూ కబ్జాలకు పాల్పడిన కొందరు కటకటాల పాలవుతుండటంతో దందాల్లో పాలు పంచుకున్నవారిలో కలవరం మొదలైంది.. ప్రైవేటు స్థలాలను ఆక్రమించిన వారిపై కరీంనగర్‌ సీపీ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు..

Updated : 23 Feb 2024 06:05 IST

ఇష్టారాజ్యంగా కబ్జాలు

కరీంనగర్‌ శివారు బొమ్మకల్‌ వద్ద ప్రభుత్వ జాగాలో హెచ్చరిక బోర్డు

ఈనాడు, కరీంనగర్‌: కరీంనగర్‌లో భూ కబ్జాలకు పాల్పడిన కొందరు కటకటాల పాలవుతుండటంతో దందాల్లో పాలు పంచుకున్నవారిలో కలవరం మొదలైంది.. ప్రైవేటు స్థలాలను ఆక్రమించిన వారిపై కరీంనగర్‌ సీపీ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు.. అమాయక ప్రజలను బెదిరించిన.. మోసగించిన వారి భరతం పడుతున్నారు.. ఈ క్రమంలో కొందరు కబ్జాదారులు తాము ఆక్రమించిన భూములను వెనక్కి ఇస్తామని బాధితులను బుజ్జగిస్తున్నారు.. ఈ సమయంలో కరీంనగర్‌తోపాటు చుట్టుపక్కల కొన్నేళ్లుగా కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూముల పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.. కరీంనగర్‌ కమిషనరేట్‌కు అందుతున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ప్రైవేటు భూముల వ్యవహారంలో దళారుల దందాలు, ఆగడాలపైనే ఫిర్యాదులున్నాయి. కొన్ని మాత్రమే ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు ప్రథమ ప్రాధాన్యంగా భూమి సొంతదారులకు ఎదురైన కష్టాలను గుర్తిస్తూ వారికి న్యాయం చేయడంపై దృష్టి పెట్టారు. గట్టి ఆధారాలను సేకరిస్తూ కబ్జారాయుళ్లను కటకటాల్లోకి పంపుతున్నారు. ఇదే విధంగా ప్రభుత్వ భూముల కబ్జాలపైనా పోలీసు, రెవెన్యూ అధికారులు దృష్టిపెడితే విలువైన సర్కారు స్థలాలు కబ్జా కోరల నుంచి బయటపడే అవకాశముంది.

అందినకాడికి ఫలహారంలా...

కరీంనగర్‌ చుట్టూ ఉన్న బొమ్మకల్‌, సీతారాంపూర్‌, తీగలగుట్టపల్లి, రేకుర్తి, చింతకుంట, మల్కాపూర్‌, ఆరెపల్లి, లక్ష్మీపూర్‌ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్‌, చెరువు శిఖం భూముల్లో చాలావరకు కబ్జారాయుళ్లు పాగా వేశారు. ఉన్నతాధికారుల ఉదాసీనత వారికి కలిసి వచ్చింది. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూములు. రికార్డుల పరంగా పదిలంగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి రూపురేఖలు ఊహించని విధంగా మారిపోయాయి. రెవెన్యూ శాఖలోని కొంతమంది అధికారులు, సిబ్బందితో చేతులు కలిపి నాయకులు ఆ భూములను ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. 8 గ్రామాల్లో ఇరవై ఏళ్ల కింద రికార్డుల పరంగా దాదాపుగా 1804.26 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు సహ చట్టం ద్వారా వివరాలు సేకరించగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందులో పావు వంతు భూమి కూడా సర్కారు అధీనంలో లేనట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల పరిధిలోని ఆయా సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి కనీసం చూద్దామన్నా.. కనిపించని పరిస్థితి నెలకొంది. అయిదారు గ్రామాల్లోని కొన్ని సర్వే నంబర్లలో గుంటల విస్తీర్ణంలో ఉన్న భూములు చాలాచోట్ల మాయమయినట్లు గతంలోనే రెవెన్యూ అధికారులు గుర్తించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి సమన్వయంతో సాగి.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ భూమి రికార్డుల్లో మాత్రమే చూపించాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని