logo

లఖ్‌పతి దీదీలు 20 శాతం

జీవనోపాధుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా ప్రతి మహిళ రూ.లక్ష ఆదాయం ఆర్జించేలా అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం అందించడంతోపాటు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తోంది.

Published : 23 Feb 2024 04:49 IST

1,15,496 మంది మహిళలకు రూ.లక్షకు పైగా సంపాదన
జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ సర్వేలో వెల్లడి
న్యూస్‌టుడే, హుజూరాబాద్‌

డెయిరీ యూనిట్‌తో ఏటా రూ.లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లికి చెందిన తాటిపల్లి పద్మ

జీవనోపాధుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా ప్రతి మహిళ రూ.లక్ష ఆదాయం ఆర్జించేలా అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం అందించడంతోపాటు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులు తీసుకున్న రుణాలు.. వారు ఎదుగుతున్న తీరు తెలుసుకోవడానికి ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ఉమ్మడి జిల్లాలోని రుణ గ్రహీతల్లో 20 శాతానికి పైగా మహిళలు ఖర్చులు పోనూ ఏడాదికి రూ.లక్షకు పైగా ఆర్జిస్తున్నట్లు లఖ్‌పతి దీదీల లెక్క తేల్చింది.

5.69 లక్షల మంది మహిళలపై సర్వే

నాలుగు జిల్లాల్లో మొత్తం 5,69,912 మంది స్వయం సహాయక సంఘాల మహిళలుండగా.. ఇందులో 5,59,130 (98 శాతం)మందిని సర్వే చేశారు. ఇందులో ఏటా రూ.25వేల లోపు ఆదాయం ఉన్న మహిళలు 29,244 (5 శాతం) మంది, రూ.26 వేల నుంచి రూ.60వేల లోపు ఆదాయం పొందుతున్న మహిళలు 1,92,341 (34 శాతం) మంది, రూ.61వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్న మహిళలు 2,22,049 (39 శాతం) మంది ఉన్నారు. ఇక రూ.లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న మహిళలు 1,15,496 (20 శాతం) మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. రూ.లక్షకు పైగా ఆదాయం కలిగిన వారిలో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో 43,343 మంది ఉండగా తక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21,426 మంది ఉన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో లఖ్‌పత్‌లుగా ఎదిగిన పొదుపు సంఘాలను గుర్తించి రుణ సదుపాయాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇక రూ.25వేల లోపు, రూ.26-60 వేల వార్షిక ఆదాయం మాత్రమే ఉన్న మహిళలు ఎందుకు వెనుకబడ్డారు, వారి ఆలోచన ధోరణి, ఆర్థిక ప్రణాళికలు ఏమిటి అనే అంశాలను పరిశీలించనున్నట్లు తెలిసింది. వారు ఆర్థికంగా ఎదిగేలా కచ్చితమైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిసింది. మహిళల ఆర్థిక అభ్యున్నతికి భవిష్యత్తులో అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సర్వే గణాంకాలు ఎంతో దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు.


పొదుపు రుణాలతో స్వయం ఉపాధి

నాలుగు జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలకు ఏటా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి తదితర పథకాల కింద రూ.కోట్ల రుణాలు అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2019-20లో రూ.699.45 కోట్లు, 2020-21 రూ.1,397.88 కోట్ల రుణాలిచ్చారు. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరంలో రుణాల కేటాయింపు పెంచుతూ వచ్చారు. 2021-22లో రూ.1,626.22 కోట్లు, 2022-23లో రూ.2,455.07 కోట్లు, 2023-24లో రూ.2,116.87 కోట్ల రుణాలివ్వగా మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారా? లేదా? అనే విషయమై క్షేత్రస్థాయిలో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం సర్వే నిర్వహించింది. 2011 నుంచి ఇప్పటి వరకు పొదుపు సంఘాల్లో చేరి రుణాలు తీసుకుంటున్న మహిళల ఆర్థిక ఎదుగుదల, నిధుల వినియోగం, స్వయం ఉపాధి తదితర వివరాలను సేకరించారు. పొదుపు సంఘాల్లో చేరకముందు, చేరిన తర్వాత వచ్చిన మార్పులు, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటున్న తీరు, ఏటా వారి సంపాదన తదితర వివరాలను సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని