logo

సమ్మక్క ఆగమనం.. పులకించిన భక్తజనం

వన దేవతలకు ఎత్తు బంగారం.. తల్లీ బిడ్డలకు ఓడిబియ్యం.. మదినిండా భక్తి పారవశ్యం.. సమ్మక్క-సారలమ్మల నామస్మరణలతో కరీంనగర్‌ రేకుర్తి ప్రాంగణం మార్మోగింది. గురువారం సమ్మక్క ఆగమనంతో భక్తులు పోటెత్తారు.

Published : 23 Feb 2024 06:05 IST

రేకుర్తిలో బారులుదీరిన భక్తులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ కొత్తపల్లి: వన దేవతలకు ఎత్తు బంగారం.. తల్లీ బిడ్డలకు ఓడిబియ్యం.. మదినిండా భక్తి పారవశ్యం.. సమ్మక్క-సారలమ్మల నామస్మరణలతో కరీంనగర్‌ రేకుర్తి ప్రాంగణం మార్మోగింది. గురువారం సమ్మక్క ఆగమనంతో భక్తులు పోటెత్తారు. సమక్క-సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఉదయం నుంచి రేకుర్తి జాతర ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కొంతమంది బయటి నుంచి మొక్కులు చెల్లించి వెనుదిరిగారు. సాయంత్రం 7.20 గంటలకు మేడారం కోయ పూజారి విఘ్నేష్‌ ఎరుకలి గుట్టపై నుంచి సమ్మక్కను భక్తుల సందోహం, శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు వాయిద్యాలు, ప్రత్యేక రోప్‌ పార్టీ భారీ బలగాల మధ్య సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. భక్తులు ఎత్తు బంగారం, కొబ్బరికాయలు, తలనీలాలు, కోడి మొక్కులు, ఓడిబియ్యం సమర్పించారు. సమ్మక్క-సారలమ్మలు ఇద్దరు గద్దెకు చేరడంతో శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇప్పటికే జాతర ప్రాంగణానికి చేరుకున్న భక్తులు వసతి ఏర్పాటు చేసుకున్నారు.

సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తున్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, తదితరులు

శంకరపట్నం : సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా గురువారం రాత్రి కేశవపట్నంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. గుట్ట ప్రాంతం నుంచి డప్పుచప్పుళ్లతో అమ్మవారిని తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. సమ్మక్క సారలమ్మలు గద్దెపై కొలువుదీరటంతో భక్తులు మొక్కులు సమర్పించడానికి తరలి వచ్చారు.

రేకుర్తి : సమ్మక్కను తీసుకొస్తున్న పూజారులు

మంత్రి మొక్కులు...

రేకుర్తి సమ్మక్క-సారలమ్మలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మొక్కులు చెల్లించారు. ఉదయం మంత్రి వన దేవతలకు ఎత్తుబంగారం సమర్పించారు. సాయంత్రం కరీంనగర్‌ మాజీ ఎంపీ, మాజీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అమ్మవార్లను దర్శించుకున్నారు. పీసీసీ రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌, కాంగ్రెస్‌ కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పురుమల్ల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి మొక్కులు చెల్లించారు.

కేశవపట్నంలో సమ్మక్కను తీసుకొస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని