logo

కలగానే కల్లాల నిర్మాణం

యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటే రైతులకు కల్లాల కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల్లో కోతలు ముమ్మరం కానుండటంతో ఇప్పటినుంచే ధాన్యం ఆరబోతకు పడరాని పాట్లు పడుతున్నారు.

Updated : 03 Apr 2024 06:16 IST

హుజూరాబాద్‌- కాట్రపల్లి రోడ్డు పక్కన చదును చేసిన దృశ్యం

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌: యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటే రైతులకు కల్లాల కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల్లో కోతలు ముమ్మరం కానుండటంతో ఇప్పటినుంచే ధాన్యం ఆరబోతకు పడరాని పాట్లు పడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 19 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశముండగా ధాన్యం ఆరబెట్టుకునేందుకు సదుపాయాలు లేకపోవడంతో రహదారుల పక్కన స్థలాలు తమవే అనిపించుకునేందుకు రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హుజూరాబాద్‌లోని కేసీ క్యాంపు నుంచి కాట్రపల్లి వరకు రహదారికి ఇరువైపులా కల్లాల కోసం ఆయా గ్రామాల రైతులు ఖాళీ సంచులు, పాలిథిన్‌ కవర్లు వేసి ఆ స్థలం తమదే అనిపించుకుంటున్నారు. కోతలు ప్రారంభమైతే అనేక ప్రాంతాల్లో రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. వరికోతలు ముమ్మరమైతే కల్లాలకు స్థలాలు దొరకవనే ఆందోళనతో ఇలా చేయక తప్పడం లేదని రైతులు చెబుతున్నారు.

అన్నదాతకు అవస్థలు

ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ క్షేత్రాల వద్ద కల్లాలు నిర్మించాలని అయిదారేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. కరీంనగర్‌ జిల్లాలో 2,600, పెద్దపల్లిలో 1,930, జగిత్యాలలో 3,029, రాజన్న సిరిసిల్లలో 1,652 కల్లాలను నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,211 కల్లాలు మంజూరవగా నిధులు కూడా విడుదలయ్యాయి. కల్లాల (సిమెంటు గచ్చు) నిర్మాణానికి 50 చదరపు అడుగులకు రూ.56 వేలు, 60 చదరపు అడుగులకు రూ.68 వేలు, 75 చదరపు అడుగులకు రూ.85 వేలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, మిగిలిన వారికి 90 శాతం రాయితీ కల్పించింది కానీ.. పది శాతానికి మించి పూర్తి కాలేదు. మిగిలిన ప్రాంతాల్లో అసలు పనులే ప్రారంభం కాలేదు. ఫలితంగా కల్లాలు కలగానే మిగిలిపోవడంతో ప్రతీ సీజన్‌లో ధాన్యం ఆరబోతకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. వరి కోతలకు ముందే రహదారుల పక్కన ఖాళీ సంచులు వేసి ఆ స్థలం తమదే అనిపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థలాలు అందుబాటులో లేకపోవడం, వ్యవసాయ క్షేత్రాల వద్ద సరిపోను సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలతో రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని