logo

ఖరారు విషయంలో తకరారు!

‘ప్రవీణ్‌రెడ్డి..? రాజేందర్‌రావు? మరో కొత్త అభ్యర్థా..?’ ఇదే ప్రశ్న సగటు కాంగ్రెస్‌ కార్యకర్త మదిలో మెదులుతోంది. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి అడుగులేస్తుండగా..కార్యకర్తల్లో ఉత్కంఠ రేగుతోంది..

Updated : 03 Apr 2024 06:18 IST

కొలిక్కిరాని కాంగ్రెస్‌ కరీంనగర్‌ అభ్యర్థిత్వం

ఈనాడు, కరీంనగర్‌: ‘ప్రవీణ్‌రెడ్డి..? రాజేందర్‌రావు? మరో కొత్త అభ్యర్థా..?’ ఇదే ప్రశ్న సగటు కాంగ్రెస్‌ కార్యకర్త మదిలో మెదులుతోంది. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆచితూచి అడుగులేస్తుండగా..కార్యకర్తల్లో ఉత్కంఠ రేగుతోంది.. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించి దాదాపు పక్షం రోజులు దాటినా ఇంకా ఎవరు అభ్యర్థి అనేది పార్టీ తేల్చడం లేదు.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌ కీలకమైన కరీంనగర్‌ విషయంలో మాత్రం జాప్యం చేస్తోంది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగుచోట్ల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్న ఈ స్థానంలో ఇంతటి సందిగ్ధత నెలకొన్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఈ పార్లమెంటు ఎన్నికల్లో జోరుగా ప్రచారానికి సిద్ధమవ్వాలనుకుంటున్న నాయకులు, కార్యకర్తలు మాత్రం ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ అనే విధంగా పార్టీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. విపరీతమైన జాప్యం చేస్తే ప్రచారానికి సమయం సరిపోదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ వాళ్లు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరు ఖరారు చేస్తారని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఎవరి బలమెంత?

ప్రజలతో ఉన్న సత్సంబంధాలతోపాటు రాజకీయ అనుభవానికి అధిష్ఠానం ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయా అభ్యర్థుల విషయంలో పార్టీ చేపట్టిన సర్వేలో ఎవరికి ఎంత మెరుగైన స్థానముందనే విషయాన్ని బేరీజు వేసుకుంటున్నారు. దీంతోపాటు సామాజిక సమీకరణాల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనే విషయమై కూడా పార్టీ పెద్దలు లోతుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి ఏ ప్రాంతం అనుకూలమనే విషయమై కూడా పార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల అభిప్రాయాలను రాష్ట్రస్థాయి నేతలతోపాటు దిల్లీ పెద్దలు సేకరించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటు ప్రవీణ్‌రెడ్డి, అటు వెలిచాల రాజేందర్‌రావులు తమకే టికెట్‌ ఖాయమని అనుచరులకు ధీమానిస్తున్నారు. ప్రచారానికి సన్నద్ధమవ్వాలనే సంకేతాల్నిస్తున్నారు. ఇక వీరిద్దరే కాకుండా పార్టీ మరో అభ్యర్థి వేటలో ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అందుకోసమే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తుక్కుగూడలో బహిరంగ సభ తరువాతనే కరీంనగర్‌ స్థానం విషయంలో పార్టీ సీరియస్‌గా దృష్టి పెడుతుందని జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు దిల్లీ పెద్దలు కరీంనగర్‌ స్థానంపై దృష్టి పెట్టిన క్రమంలోనే అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని