logo

బడి దూరంగా.. బాట భారంగా..!

గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు లేక విద్యార్థులు పక్క ఊళ్లకు బడి బాట పడుతున్నారు. సైకిళ్లపై,  కాలినడకన, ఇతర వాహనాల్లో కి.మీ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు.

Updated : 03 Apr 2024 06:14 IST

గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు లేక విద్యార్థులు పక్క ఊళ్లకు బడి బాట పడుతున్నారు. సైకిళ్లపై,  కాలినడకన, ఇతర వాహనాల్లో కి.మీ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. బడికి సమయానికి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో విద్యార్థులు ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. కనీసం ఆర్టీసీ బస్సు సదుపాయమైనా కల్పించాలని వేడుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా అందించాల్సిన రూ.6 వేల రవాణా భత్యాన్ని ప్రభుత్వం ప్రస్తుతం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల రవాణా కష్టాలపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

న్యూస్‌టుడే, గంగాధర, కరీంనగర్‌ పట్టణం

నడకే శరణ్యం

మానకొండూర్‌ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముంజంపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్‌, సదాశివపల్లి, జాలగుట్ట గ్రామాల విద్యార్థినిలు దాదాపు 100 మందికి పైగా చదువుకుంటున్నారు. ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు వెళ్లకపోవడంతో వీరంతా పాఠశాలకు ప్రైవేటు వాహనాల్లో, సైకిళ్లపై, కాలినడకన వస్తుంటారు. వర్షాకాలంలో అయితే వానలు పడి పాఠశాలకు డుమ్మా కొట్టే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వేసవికాలంలో ఎండకు బడికి వెళ్లి వచ్చేసరికి అలసిపోతున్నారు.

న్యూస్‌టుడే, మానకొండూర్‌ 

సైకిళ్లపై సర్కారు బడికి..

సర్కారు బడులను ఒంటిపూట నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్సు సౌకర్యం, ఇతర వాహనాల సదుపాయం లేని దారుల్లో విద్యార్థులు పాఠశాలకు కాలినడకన, సైకిళ్లపై వెళ్తున్నారు. మధ్యాహ్నం బడి పూర్తయ్యాక ఇళ్లకు చేరే క్రమంలో ఎండతో అల్లాడుతున్నారు. గంగాధర మండలం న్యాలకొండపల్లి నుంచి కురిక్యాల ప్రభుత్వ పాఠశాలకు, నారాయణపూర్‌, లక్ష్మీదేవిపల్లి నుంచి గంగాధర ఉన్నత పాఠశాలకు పదుల సంఖ్యలో విద్యార్థులు సైకిళ్లపై వస్తున్నారు.

న్యూస్‌టుడే, గంగాధర

2 కి.మీ.లు నడిచి.. 5 కి.మీ.లు బస్కెక్కి

మండలంలోని లంబాడిపల్లికి చెందిన 20 మంది విద్యార్థులు 2 కి.మీ మండల కేంద్రానికి నడిచి.. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో 5 కి.మీ ముల్కనూరులోని ఆదర్శ పాఠశాలకు వెళ్తున్నారు. ఇంకో పది మంది విద్యార్థులు చిగురుమామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదర్శ పాఠశాలకు వివిధ గ్రామాల నుంచి చిగురుమామిడి మీదుగా ఉదయం, సాయంత్రం బస్సు వెళ్తుంది. దానినే లంబాడిపల్లి వరకు బస్సు నడిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, చిగురుమామిడి

ఆర్టీసీ బస్సు సరిపోక..

మండలంలోని రుక్మాపూర్‌ ఆదర్శ పాఠశాల ఊరికి 2 కి.మీ దూరంలో ఉండడంతో ఆ గ్రామ, కాట్నపల్లి విద్యార్థులు నడిచి వెళ్తున్నారు. వెదురుగట్ట, రాగంపేటలకు ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్న 500 మంది విద్యార్థులు ఉండడంతో కష్టాలు తప్పడం లేదు. ఆర్టీసీ అధికారులు మరో రెండు ట్రిప్పుల బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, చొప్పదండి

ఎండలో పడిగాపులు

చెల్పూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు హుజూరాబాద్‌ మండలంలోని పలు గ్రామాలతో పాటు జమ్మికుంట నుంచి విద్యార్థులు వస్తుంటారు. బస్సుల కోసం ప్రయాణ ప్రాంగణం వద్ద విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ఎండవేడిమిని తట్టుకుంటూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. డ్రైవర్లు బస్సులు ఆపటం లేదంటూ వాపోతున్నారు.

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌ గ్రామీణం

మండుటెండలో 2.5 కిలోమీటర్లు

తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పోరండ్ల, మల్లాపూర్‌, పొగాకులపల్లి గ్రామాల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు వస్తుంటారు. పోరండ్ల నుంచి 20 మంది విద్యార్థులు ఆటోకు, 10 మంది సైకిళ్లపై, 10 మంది కాలినడకన 2.5 కి.మీ దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్తుంటారు. పొగాకులపల్లి నుంచి 5 గురు కాలినడకన చేరుకుంటారు. దాతలు ముందుకొచ్చి ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసి తమ పిల్లల సమస్యను తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, తిమ్మాపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని