logo

Prajwal Revanna: ప్రజ్వల్‌ అరెస్టుకు తీవ్ర ఒత్తిళ్లు.. ఏకమవుతున్న ప్రజా సంఘాలు

లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కర్ణాటక సౌహార్ధ్ర వేదికె డిమాండ్‌ చేసింది. ‘పోరు బాట, హాసన వైపు’ అనే నినాదంతో తాము రూపొందించిన గోడ పత్రికను సోమవారం విడుదల చేస్తున్నామని వేదికె ప్రతినిధులు పేర్కొన్నారు.

Updated : 27 May 2024 08:08 IST

ఇంకా దొరకని ఆచూకీ

ప్రజ్వల్‌ రేవణ్ణ 

హాసన, న్యూస్‌టుడే: లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అరెస్టు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కర్ణాటక సౌహార్ధ్ర వేదికె డిమాండ్‌ చేసింది. ‘పోరు బాట, హాసన వైపు’ అనే నినాదంతో తాము రూపొందించిన గోడ పత్రికను సోమవారం విడుదల చేస్తున్నామని వేదికె ప్రతినిధులు పేర్కొన్నారు. హాసనలో గురువారం భారీ ప్రదర్శన, ధర్నాలను నిర్వహిస్తున్నామని రైతు నాయకుడు బడగలపుర నాగేంద్ర ప్రకటించారు. గోడపత్రిక విడుదల, ఆందోళనల్లో సీనియరు సాహితీవేత్త ఆచార్య బరగూరు రామచంద్రప్ప దళిత పోరాట నాయకులు ఆర్‌ మోహన్, మావళ్లి శంకర్, గోపాలకృష్ణ అరళహళ్లి, రామకృష్ణ, మల్లిగె తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

అతని కుటుంబ నేపథ్యంతోనే...

వందలాది మంది మహిళలు, ఉద్యోగినులపై ఎంపీ ప్రజ్వల్‌ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడేందుకు అతని హోదా, కుటుంబ నేపథ్యమే కారణమని కర్ణాటక కాంగ్రెస్‌ విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన వైపు ఉన్నారన్న ధైర్యంతోనే అతను ఈ అకృత్యాలకు పాల్పడ్డారని ఆరోపించింది. తన పార్టీ, కుటుంబానికి చెందిన వ్యక్తి లైంగిక దౌర్జన్యాలకు పాల్పడితే బాధిత మహిళలకు మద్దతుగా ఉంటామని ఇప్పటి వరకు ఒక్కసారీ కుమారస్వామి పేర్కొనలేదంటూ ఎక్స్‌కార్ప్‌ ఖాతాలో కర్ణాటక కాంగ్రెస్‌ ట్వీట్లు చేసి విమర్శలు గుప్పించింది.

నెలరోజులైనా ఏదీ సమాచారం?

ప్రజ్వల్‌ విదేశాలకు పరారై నెల రోజులైంది. ఇప్పటి వరకు అతని ఆచూకీని ప్రత్యేక దర్యాప్తు దళం గుర్తించలేకపోయింది. నాలుగు సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ బహిరంగ విన్నపాలు చేసుకున్నా అటునుంచి స్పందన లభించలేదు. 

వారంతా ఎక్కడికి వెళ్లారు

ప్రజ్వల్‌ కామవాంఛకు బలైన బాధితుల్లో ఎక్కువ మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రజ్వల్‌ ఎంపీ కావడంతో అతని ద్వారా జిల్లాలో దళ్‌ మహిళా విభాగంలో సేవలు అందించేందుకు, పార్టీలో కీలక పదవులు, ఆయా మండలి, కార్పొరేషన్‌లో పదవుల కోసం ఎక్కువ మంది మహిళలు ఆయనను కలిసేవారు. పదోన్నతులు, బదిలీల కోసం ఉపాధ్యాయినులు, మహిళా పోలీసులు, ఇతర ఉద్యోగినులు ఆయనతో భేటీ అయ్యేవారు. దీన్ని అవకాశంగా తీసుకుని, వారిని తన పడక గదికి తీసుకువెళ్లేవారని సిట్ ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తులో గుర్తించింది. పార్టీకి సేవలు అందిస్తున్న మహిళా కార్యకర్తలు, కానిస్టేబుళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయురాళ్లు, తమ పిల్లవానికి బడిలో సీటుకు సిఫార్సు చేయాలని కోరుతూ వచ్చిన పలువురిని ఉచ్చులో బిగించి, తన శారీరక వాంఛలను అతను తీర్చుకున్నారని గుర్తించారు. తన కోరికను మన్నించని యువతులు, మహిళలను కనీసం వీడియో కాల్‌లో అయినా నగ్నంగా కనిపించాలని కోరేవారు. ఆ వీడియోలను అడ్డు పెట్టుకుని, వారిని తన పడక గదికి పిలిపించుకునేవారు. లైంగిక దౌర్జన్యానికి పాల్పడి, ఆ వీడియోలను తీసుకుని మళ్లీ బెదిరింపులకు పాల్పడేవారు. నీకు పరిచయం ఉన్న యువతులను తీసుకురావాలని కోరేవారు. ప్రజ్వల్‌ వలలో పడిన మహిళల్లో 60 మంది జనతాదళ్‌ కార్యకర్తలే ఉన్నారు. ప్రజ్వల్‌ పరారీలో ఉండగా, ఇతర కుటుంబ సభ్యులు హాసన, హొళెనరసీపుర, బెంగళూరుల్లో ఉంటున్నారు. బాధిత మహిళలు తమ కుటుంబాలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు తామున్న ఇళ్లను ఖాళీ చేసి, ఇతర ఊళ్లకు వెళ్లారు. ఇటీవల కొందరు యువతులకు వచ్చిన వివాహ సంబంధాలు కూడా వెనక్కు వెళ్లాయి. హాసన జిల్లా కావడంతోనే ఎక్కువ మంది తమను అనుమానంగా చూస్తున్నారని కొందరు యువతులు ఆరోపించారు. తమను హేళన చేస్తూ రీల్స్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు ఇప్పటికే స్థానిక పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని