logo

ఎప్పటికైనా.. నేనే ముఖ్యమంత్రి

కనకపుర నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా.. నేను ముఖ్యమంత్రిని అవుతానన్న నమ్మకంతో మీరంతా ఓట్లు వేసి నన్న భారీ మెజార్టీతో గెలిపించారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Published : 04 Jun 2023 01:25 IST

కల్లహళ్లి వెంకన్న ఆలయంలో శివకుమార్‌

ఈనాడు- బెంగళూరు, రామనగర- న్యూస్‌టుడే:  కనకపుర నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా.. నేను ముఖ్యమంత్రిని అవుతానన్న నమ్మకంతో మీరంతా ఓట్లు వేసి నన్న భారీ మెజార్టీతో గెలిపించారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. అధిష్ఠానం ఆదేశాలతో ముఖ్యమంత్రి పదవిని వదిలేసి.. ఉప ముఖ్యమంత్రి స్థానానికి పరిమితం కావలసి వచ్చిందని వివరించారు. రానున్న రోజులలో ఏఐసీసీ తనను ముఖ్యమంత్రిగా నియమిస్తుందన్న నమ్మకం ఉందని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతూరు.. కనకపుర నియోజవర్గానికి ఆయన మొదటిసారిగా శనివారం విచ్చేశారు. కల్లహళ్లి వెంకటరమణ స్వామి, కబ్బాళమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. హారోహళ్లిలో నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాదంటూ భాజపా, జనతాదళ్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీనే ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం తనకు ఉందని మొదటి నుంచి విశ్వసిస్తూ వచ్చానని చెప్పారు. హారోహళ్లి అనంతరం శివనహళ్లి, సాతనూరు, దొడ్డఆలహళ్లి, కోడిహళ్లి గ్రామాలలో రోడ్‌షో నిర్వహించి ఓటర్లు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

పేదలకు మరింత సాయం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : వంట గ్యాస్‌ సిలిండర్ల ధర పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో పేద, దిగువ మధ్యతరగతి వర్గాల కుటుంబాల కోసం గృహజ్యోతి, గృహలక్షీ పథకాలు అమలులోకి తెస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. అద్దె ఇంట్లో ఉండే కుటుంబాలకూ గృహజ్యోతి పథకం వర్తిస్తుందన్నారు. విద్యుత్తు మీటరు ఎవరి పేరు మీదున్నా దాఖలాలను అధికారులకు అందజేసి ఆ పథకాన్ని సద్వినియ్వోగం చేసుకోవచ్చన్నారు. రెండువందల యూనిట్లు ఉపయోగించే వారందరికీ పథకం వర్తిస్తుందన్నారు. కొందరు స్వయం ప్రేరితంగా గృహజ్యోతి పథకాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ పథకాన్ని మాకు వర్తింపజేయవద్దని ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు ప్రైవేట్‌ ఉద్యోగులు ప్రభుత్వానికి లేఖలు రాశారని వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నెలకు 150 యూనిట్లు వినియోగిస్తున్నా ‘గృహజ్యోతి’ పథకం వినియోగించుకొనేది లేదంటూ స్వయం ప్రేరితంగా లేఖ రాశారని హర్షం వ్యక్తం చేశారు. ఏ పథకాన్నైనా విమర్శించడమే ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యమన్నారు. దానికి మేమేమీ అభ్యంతరం చెప్పబోమన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమా చేస్తామంటూ భాజపా చేసిన వాగ్దానం ఏమైందని నిలదీశారు.

స్థానికులకు నమస్కరించుకుంటూ వెళుతున్న డీకే 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని