logo

DK Shivakumar: చతురత.. డీకే ఘనత

దొడ్డాలహళ్లి కెంపేగౌడ శివకుమార్‌.. అంటే ఎక్కువ మందికి తెలియదు. ‘కనకపుర బండె’ లేదా డీకేశీ అంటే వెంటనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ గుర్తుకు వస్తారు.

Updated : 15 Oct 2023 11:23 IST

రాజకీయ వ్యూహరచనలో మేటి

డీకే శివకుమార్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే:  దొడ్డాలహళ్లి కెంపేగౌడ శివకుమార్‌.. అంటే ఎక్కువ మందికి తెలియదు. ‘కనకపుర బండె’ లేదా డీకేశీ అంటే వెంటనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) గుర్తుకు వస్తారు. దేశంలోని ఎమ్మెల్యేల్లో అత్యంత కోటీశ్వరుడు శివకుమారే. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీని 135 సీట్లతో పూర్తి మెజార్టీతో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్రను పోషించారు. కర్ణాటకలో చూపించిన చొరవే తెలంగాణలోనూ చూపించేందుకు శివకుమార్‌ను తురుపుముక్కగా వినియోగించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి నరసింహులు వరుసగా శివకుమార్‌తో పలు దఫాలు చర్చలు జరిపారు. వ్యూహ రచన చేయడంలో శివకుమార్‌ దిట్ట.

కాంగ్రెస్‌ పార్టీకి చేరువ అయ్యేందుకు ప్రయత్నించిన తెలంగాణ వైకాపా అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి చివరి క్షణం వరకు శివకుమార్‌ సహకారాన్ని కోరుతూ వచ్చారు. కర్ణాటకలో శివకుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని అందరి అంచనా కాగా, చివరి క్షణంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అవకాశం దక్కింది. అనుకున్నట్లు అధికార పీఠం దక్కకపోయినా, తన ఆవేదనను బయటపెట్టకుండా సంయమనాన్ని పాటించారు. పార్టీలో ఒకే ఉప ముఖ్యమంత్రి ఉండాలని, ఆర్థిక సంబంధిత అంశాల్లో ముఖ్యమంత్రి తనతో చర్చించిన తర్వాతే నిర్ణయాన్ని తీసుకునేలా అధిష్ఠానాన్ని ఒప్పించారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో శివకుమార్‌ కీలక పాత్రను పోషిస్తారని పార్టీ అగ్రనాయకత్వం విశ్వసిస్తోంది. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ప్రకటించగా, తెలంగాణలో ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.

తాము ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో నాలుగింటిని ఇప్పటికే విజయవంతంగా జారీలోకి తీసుకు వచ్చారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చామని, తెలంగాణలోనూ తప్పనిసరిగా అమలు చేస్తామని ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే టికెట్‌ కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. కర్ణాటకలో కావేరి వివాదం తెరపైకి రావడంతో శివకుమార్‌ తెలంగాణకు వెళ్లడంలో జాప్యం జరిగింది. తెలంగాణలో ఎన్నికల తేదీ ఇప్పటికే ప్రకటించేశారు. త్వరలోనే అక్కడికి వచ్చి పార్టీ నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ, అక్కడా తనదైన శైలిలో చక్రం తిప్పుతారని, ఆయనను సమీపం నుంచి చూసినవారంతా ధీమాతో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు కీలక నియోజకవర్గాల్లో ఆయన పర్యటించే అవకాశం ఉంది.

తెలంగాణలో హంగ్‌ వస్తుందని భాజపా చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ నాయకులు అంతా ఖండించారు. పార్టీకి దూరంగా ఉంటున్న వారు, టికెట్‌ దక్కని నేతలు అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావడం శివకుమార్‌కు వెన్నతో పెట్టిన విద్య. గతంలో గుజరాత్‌ నుంచి రాజ్యసభకు అహ్మద్‌ పటేల్‌, మరికొందరు నాయకులను పంపించేందుకు రిసార్టులో ఉంచి, వారిని రక్షించారు. అప్పటి నుంచే తనపై ఆదాయ పన్ను, ఈడీ దాడులు ఎక్కువ అయ్యాయని శివకుమార్‌ పలు సందర్భాల్లో ఆరోపించారు. దిల్లీ, సదాశివనగరలోని ఆయన నివాసాల్లో ఐటీ అధికారులు నగదును జప్తు చేశారు. కొన్ని రోజులు తిహాడ్‌ కారాగారంలోనూ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. తనను భాజపాలోకి చేరాలని ఒత్తిళ్లు వస్తున్నాయని, పార్టీ మారకపోవడంతోనే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని బహిరంగంగా ప్రకటించారు. తాను చేసే వ్యాపారాలు, రాజకీయాలన్నీ పారదర్శకమేనని ప్రతి సందర్భంలోనూ ఆయన పేర్కొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని