logo

కరవే ఆందోళన తీవ్రరూపం

కర్ణాటకలో ప్రతి వ్యాపారి, సంస్థ తమ నామఫలకాలపై కనీసం 60 శాతం కన్నడ ఉండేలా చూసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికె అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘిస్తే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.

Published : 28 Dec 2023 01:39 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలో ప్రతి వ్యాపారి, సంస్థ తమ నామఫలకాలపై కనీసం 60 శాతం కన్నడ ఉండేలా చూసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికె అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘిస్తే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. యలహంక నుంచి విమానాశ్రయం రోడ్డు సాదరహళ్లి గేటు వరకు వందలాది మంది కార్యకర్తలతో ఆయన ఊరేగింపు నిర్వహించారు. కొన్ని చోట్ల ఆంగ్లంలో ఉన్న ఫలకాలను ఆందోళనకారులు రాళ్లు రువ్వి పగలగొట్టారు. మరికొన్ని చోట్ల వాటిని బలవంతంగా తొలగించారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను నియంత్రించారు.

యలహంక సమీపంలో నారాయణగౌడ, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమను విడిచి పెట్టాలని ఎంజీరోడ్డు, బ్రిగేడ్‌ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించాలని నారాయణగౌడ పట్టుపట్టారు. నామఫలకం వివాదానికి సంబంధించి బ్యాటరాయనపురలోని మాల్‌ ఆఫ్‌ ఆసియా ఇప్పటికే న్యాయస్థానంలో ఒక దావా వేసింది. అక్కడకు ఆందోళనకారులు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. బెంగళూరులో ఉంటున్న కన్నడిగులు మాతృభాషను మర్చిపోయే స్థితికి చేరుకున్నారని కరవే నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తాను అరెస్టయినా, కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తారని నారాయణగౌడ చెప్పారు. ఆయన అరెస్టు అనంతరం కొందరు కార్యకర్తలు యూబీ సిటీలోకి ప్రవేశించి, అక్కడి కొన్ని దుకాణాల ముందున్న ఫలకాలను పగలగొట్టారు. కన్నడకు మద్దతుగా, ఆంగ్లానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని