logo

మామా అల్లుళ్లకు సవాల్‌!

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతను రేకెత్తిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో కలబురగి (ఎస్సీ రిజర్వు) కూడా ఒకటి. పాలక, ప్రతిపక్షాల, ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated : 17 Apr 2024 08:57 IST

‘కలబురగి’లో ఖర్గే హవా ఎంత?

కలబురగిలోని ప్రగతి వేదిక.. కల్యాణ కర్ణాటక బోర్డు కార్యాలయం

రాయచూరు, న్యూస్‌టుడే : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠతను రేకెత్తిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో కలబురగి (ఎస్సీ రిజర్వు) కూడా ఒకటి. పాలక, ప్రతిపక్షాల, ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని బరిలో నిలవడమే. మామ జాతీయ స్థాయి పార్టీలో కీలక పదవిలో, అల్లుడు ప్రియాంక్‌ రాష్ట్రంలో కీలక శాఖ గ్రామీణాభివృద్ధి, పంచాయత్‌ రాజ్‌కు మంత్రిగా ఉన్నారు. రాజకీయ ప్రతిష్ఠను నిలుపుకొనేందుకు రాధాకృష్ణను గెలిపించుకోవడం మామా అల్లుడికి అనివార్యంగా మారింది. నిరుడు ఎన్నికల్లో ఖర్గేను మట్టి కరిపించిన ఎంపీ డాక్టర్‌ ఉమేశ్‌ జాదవ్‌ (భాజపా అభ్యర్థి)ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో రగలిపోతున్నారు. నామినేషన్ల ప్రారంభానికి ముందు నుంచి మంత్రి ప్రియాంక్‌, వైద్య విద్యాశాఖ మంత్రి శరణప్రకాశ్‌ పాటిల్‌ కలబురగి క్షేత్రాన్ని అంటి పెట్టుకున్నారు. ప్రతిపక్షాల్లోని బలమైన నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు మునిగాళ్లపై నిలబడ్డారు. ఆఫ్జలపూరు నియోజకవర్గంలో పట్టున్న భాజపా నాయకుడు, మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్‌ను పార్టీలోకి లాగుతున్నారు. గుత్తేదార్‌ కాంగ్రెస్‌ తీర్ధం స్వీకరిస్తారని డి.కె.శివకుమార్‌ ఇటీవల ప్రకటించారు. ఖర్గే అల్లుడిగానే రాధాకృష్ణ ప్రజలకు పరిచయం. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండరనే అపవాదు ఉంది. ఈ నష్టాలను భర్తీ చేసేందుకు ఖర్గేను అభ్యర్థిగా భావించి రాధాకృష్ణకు మద్దతు ఇవ్వాలన్న విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సామాన్య ఓటర్లను ఆకర్షించేందుకు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఖర్గే ప్రధాని కావటానికి అవకాశముందని ప్రచారం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఖర్గే చేసిన అభివృద్ధి, చరిష్మా, సిద్ధరామయ్య ప్రభుత్వం గ్యారంటీ పథకాలు విజయానికి బాట వేస్తుందన్న విశ్వాసం ముఖ్య నాయకుల్లో వ్యక్తమవుతోంది.

ఉమేశ్‌ గట్టిపోటీ

జాదవ్‌ కాంగ్రెస్‌కు గట్టి పోటీస్తున్నారు. ఐదేళ్లు శక్తికి మీరి శ్రమించడం వల్ల ఎంపీపై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా కనిపించలేదు. అయోధ్యలో రామమందిరం ప్రారంభం, హిందుత్వ ప్రభావం, మోదీ ప్రధాని కావాలన్న యువతలో కన్పిస్తున్న బలమైన ఆకాంక్ష కలసి వచ్చే అంశాలే. జాదవ్‌కు గ్రామీణులతో సంబంధాలు పెట్టుకోలేదని, కేంద్ర పథకాలు లబ్దిదారులకు సక్రమంగా చేరలేదన్న ఆరోపణలు నష్టం చేయనున్నాయి. లంబాడీ సామాజిక వర్గం వెనుక నిలబడటం కొండంత శక్తి. నియోజకవర్గంలో కోళి (బెస్తలు) సామాజిక వర్గం ఓట్లు అత్యధికం. గత ఎన్నికల్లో గురుమఠకల్‌ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కోళి సమాజం అధ్యక్షుడు బాబురావు చించసనూరు ఎంపీ ఉమేశ్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా పడ్డాయి. ఎంపీ ఎన్నికల తర్వాత చించసనూరు తిరిగి కాంగ్రెస్‌లో చేరి గురుమఠకల్‌లో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కోళి సమాజం ఒకే పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితి లేదు. గెలుపు ఇద్దరి మధ్య దోబుచలాడుతోంది. పార్టీలు సైతం గెలుపును సర్వే చేయలేకపోతున్నారు.

కులాల వారీ ఓట్లు..

  • లింగాయత్‌లు, దళితులు, ముస్లింలు, బెస్తలు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం లింగాయత్‌లు 4.80 లక్షలు, ఎస్సీలు 4 లక్షలు, బెస్తలు, ముస్లింలు 3 లక్షల చొప్పున ఓట్లు ఉంటాయి. లింగాయత్‌లను భాజపా, ముస్లింలను కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుగా పరిగణిస్తారు. దళితుల, బెస్తలు ఓట్లు రెండు పార్టీల మధ్య చీలిపోనున్నాయి.
  • కల్యాణ కర్ణాటక ప్రాంతానికి విభాగ కేంద్రమైన కలబురగిలో 1957 నుంచి 16 సార్లు సార్వత్రిక ఎన్నికలు, రెండుసార్లు ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ నుంచి 15 మంది, భాజపా నుంచి ఇద్దరు, దళ్‌ నుంచి ఒకరు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. మాజీ ముఖ్యమంత్రులు వీరేంద్రపాటిల్‌ (చించోళి), ధరంసింగ్‌ (జీవర్గి) ఈ జిల్లాకు చెందిన వారే.
  • కలబురగి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కలబురగి, కలబురగి దక్షిణ, గ్రామీణ, జీవర్గి, సేడం, ఆఫ్జలపూరు, చిత్తాపూరు, గురుమఠకల్‌ విధానసభ సెగ్మెంట్లున్నాయి. మొత్తం 20,35,806 మంది ఓటర్లు తీర్పునివ్వనున్నారు. కలబురగి గ్రామీణ, కలబురగి ఉత్తరకు భాజపా, గురుమఠకల్‌కు దళ్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని