logo

‘డీకేపై అర్థరహిత ఆరోపణలు’

హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ పంపిణీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి పాత్ర ఉందంటూ చెబితే రూ.100 కోట్లు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు ఆశ చూపించారంటూ భాజపా నేత దేవరాజేగౌడ

Published : 19 May 2024 04:06 IST

చెలువరాయ స్వామి

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌ పంపిణీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి పాత్ర ఉందంటూ చెబితే రూ.100 కోట్లు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు ఆశ చూపించారంటూ భాజపా నేత దేవరాజేగౌడ వ్యాఖ్యానించడాన్ని వ్యవసాయ శాఖ మంత్రి చెలువ రాయస్వామి ఖండించారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణ కుటుంబానికి షాక్‌ ఇవ్వాలని దేవరాజేగౌడ ఏడాదిగా ప్రచారం చేసుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ఆయన వద్ద పెన్‌డ్రైవ్‌ దాచుకుని ఇన్నాళ్లూ న్యాయస్థానానికి ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. పెన్‌డ్రైవ్‌ను ఇతరులకు చేరవేయడంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు కృష్ణభైరేగౌడ, ప్రియాంక్‌ఖర్గేకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘పెన్‌డ్రైవ్‌ వ్యవహారం ఏప్రిల్‌ 25న వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల తరువాత ఆ తీవ్రతపై నిరసనలు ఎక్కువయ్యాయి. ఇలాంటి సంఘటనల్లో జోక్యం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ వ్యవహారంలో ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణతో పాటు కార్తీక్, దేవరాజేగౌడ అనే వ్యక్తులు ప్రముఖ నిందితులు. వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి. కారాగారంలో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న దేవరాజేగౌడ చేస్తున్న ఆరోపణలకు అర్థం లేదు’ అని కొట్టిపారేశారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి నిత్యం ఆరోపణలు చేసే బదులు విదేశాల్లో ఉన్న ప్రజ్వల్‌ రేవణ్ణను రప్పించి ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌)కు అప్పగించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని