logo

ప్రధాని వ్యాఖ్యలు షాకిచ్చాయి

మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 19 May 2024 04:07 IST

డీకే శివకుమార్‌ ప్రతిస్పందన

ఈనాడు, బెంగళూరు : మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు షాక్‌కు గురి చేశాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రధాని మోదీ ఓ మాధ్యమానికి ఇచ్చిన ముఖాముఖిలో ఉచిత ప్రయాణాలు మెట్రో లాభాలపై ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలపై శనివారం డీకే స్పందిస్తూ ప్రధానికి శక్తి పథకంతో పాటు మెట్రో లాభాలపై సరైన సమాచారం లేదన్నారు. రాష్ట్రంలో ‘శక్తి’ పథకం ప్రారంభమైన తర్వాత మెట్రో ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగితే ఏడాదిలో రూ.130 కోట్ల ఆదాయంతో ఈ రైళ్లు నడుస్తున్నాయన్నారు. మెట్రో కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితమని, శక్తి పథకం రాష్ట్రమంతటా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రోజుకు 60 లక్షల మంది రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తుండగా వీరి వల్ల అనుబంధ రంగాలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. ఉచిత ప్రయాణాలు అందించే సంస్థలకు సర్కారు ప్రతి ఆరు నెలలకు నిధులు సమకూరుస్తున్నట్లు డీకే చెప్పారు. కర్ణాటకలో అమలు చేసిన శక్తి పథకం ప్రత్యేకతలపై దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అడిగి తెలుసుకుంటున్నట్లు వివరించారు. మహిళల స్వావలంబన పెంచే ఇలాంటి పథకంపై ప్రధానికి ఎవరో తప్పుడు సమాచారం అందించినట్లు ఆరోపించారు. ఉత్తర కర్ణాటకలో బస్సుల కొరతను నివారించేందుకు వెయ్యి బస్సులు కొనుగోలు చేయగా అందులో వంద రామనగర జిల్లాకు కేటాయించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని