logo

ఇస్రో.. ఉద్యోగావకాశాల గని!

ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది.

Published : 19 May 2024 04:08 IST

వేదికపై శ్రీహరిశాస్త్రిని సత్కరిస్తున్న డాక్టర్‌ వి.కె.ఆత్రే, ఎం.ఆర్‌.సీతారామ్‌ తదితరులు

ఈనాడు, బెంగళూరు : ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది. బీఈ, ఆర్కిటెక్చర్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ..ఇలా అన్ని సబ్జెక్టుల్లో పట్టభద్రులకు ఉపాధి కల్పించే వేదికగా మారిందని ఇస్రో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ అండ్‌ సేఫ్టీ విభాగం మాజీ సంచాలకుడు పి.శ్రీహరిశాస్త్రి వివరించారు. బెంగళూరులోని రామయ్య సాంకేతిక విద్యాసంస్థ (ఆర్‌ఐటీ) బీఈ, బీటెక్, ఎంబీఏ తదితర కోర్సుల పట్టభద్రుల వీడ్కోలు సమావేశంలో ఆయన శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్, సాంకేతిక కోర్సులు నేడు సంప్రదాయ పరిధిలు దాటి విస్తృత అవకాశాలు అందించే స్థాయికి చేరుకున్నాయని వివరించారు. కృత్రిమమేధ, మిషన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక కోర్సులను ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ వంటి కోర్సులతో పాటు నేర్చుకునే వెసులుబాటు అన్ని విద్యా సంస్థల్లో ఉందన్నారు. ఈ బహుముఖ కోర్సుల విధానం ఇస్రో, డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉపాధి అందించేవిగా మారాయన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్ల మెకానికల్‌ పోస్టులు ఖాళీ అవుతుండగా, అందులో 30 శాతం భారత్‌లోనే ఉన్నాయన్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలోనూ ఈ స్థాయిలో ఉపాధి అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మాజీ సలహాదారుడు డాక్టర్‌ వి.కె.ఆత్రే మాట్లాడుతూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికత కలిగిన దేశంగా మారే భారత్‌కు ప్రస్తుత విద్యార్థుల సహకారం ఎంతో కీలకమన్నారు. జీఈఎఫ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎం.ఆర్‌.సీతారామ్, ఆర్‌ఐటీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని