logo

ప్రజ్వల్‌ తప్పించుకోలేడు

మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు.

Published : 19 May 2024 04:10 IST

వేంకటేశ్వరాలయంలో ధ్యానముద్రలో దేవేగౌడ

ఈనాడు, బెంగళూరు : మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం తన 92 పుట్టిన రోజు సందర్భంగా దేవస్థానానికి వెళ్లి వస్తూ విలేకరులతో మాట్లాడారు. ‘నెల రోజులుగా ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నా. తప్పుచేసినట్లు తేలితే.. ప్రజ్వల్‌ రేవణ్ణపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు. నా కుమారుడు హెచ్‌.డి.రేవణ్ణపై ఎలాంటి కేసులు వేశారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు ఓ కేసులో బెయిల్‌ రాగా ఇంకో కేసు విచారణలో ఉంది. మా కుటుంబం తరఫున న్యాయ, రాజకీయ వ్యవహారాలన్నీ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చూసుకుంటున్నారు. ఈ కేసుల వెనుక ఎవరెవరున్నారో నాకు తెలుసు. వారి పేర్లు ఇప్పుడే బయటపెట్టను’ అంటూ వ్యాఖ్యానించారు. బాధిత మహిళలకు పరిహారం చెల్లించాలని ఇప్పటికే కుమారస్వామి డిమాండు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కేసు వెనుక ఎవరున్నా కుమారస్వామి వారిని విడిచిపెట్టడంటూ హెచ్చరించారు. ఓ భాజపా నేత ఈ కేసు వెనుక ఎవరున్నారో స్పష్టం చేశారని గుర్తుచేశారు. నెల రోజులుగా మా ఇంటి ముందు కెమెరాలతో వేచి ఉన్నా మీకు ఏం దొరికిందంటూ ఆయన మాధ్యమ ప్రతినిధులను ప్రశ్నించారు.

మరోవైపు.. భారత్‌కు రాకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) నిఘా పెంచింది. ఇప్పటికే మూడు సార్లు భారత్‌ వచ్చేందుకు విమాన టికెట్లు బుక్‌ చేసుకుని వాటిని రద్దు చేసుకున్న ప్రజ్వల్‌ను మరింత కట్టడి చేసేందుకు ఆయన బ్యాంక్‌ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.

ప్రజ్వల్‌

లండన్‌లో ప్రత్యక్షం

బెంగళూరు (సదాశివనగర) : హాసన లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణకు సిట్ అధికారులు అరెస్టు వారెంటు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ద్వారా వారెంటు జారీ చేశారు. మూడు వారాలుగా పరారీలో ఉన్న ఆయన జర్మనీ నుంచి లండన్‌కు రైల్లో వెళ్లాడని గుర్తించారు. ఆయన ఎంతకీ విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు చివరికి అరెస్టు వారెంటు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని