logo

‘రామేశ్వరం కేఫ్‌’ కేసులో మరో నిందితుడి అరెస్టు

బెంగళూరు రామేశ్వరం కెఫే పేలుడు ఘటనకు సంబంధించి మరొక అనుమానిత తీవ్రవాదిని జాతీయ దర్యాప్తు దళం అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.

Published : 25 May 2024 01:42 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : బెంగళూరు రామేశ్వరం కెఫే పేలుడు ఘటనకు సంబంధించి మరొక అనుమానిత తీవ్రవాదిని జాతీయ దర్యాప్తు దళం అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. హుబ్బళ్లికి చెందిన శోహెబ్‌ అహ్మద్‌ మిర్జా అలియాస్‌ చోటు (35)ను నిందితునిగా ప్రకటించారు. టెకీగా పని చేస్తున్న ఇతను హుబ్బళ్లి గౌసియా టౌన్‌కు చెందిన వాడు. లష్కరే తోయిబాకు సానుభూతిపరుడని తేలింది. గతంలో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేయగా, 2018లో కారాగారం నుంచి విడుదలయ్యాడు. ఇప్పటికే అరెస్టయిన మతీన్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించాడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.


ఒక్క క్లిక్‌తో నగదు ఖాళీ

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : తన చరవాణికి వచ్చిన సందేశంలోని లింకును క్లిక్‌ చేసిన భాస్కర్‌ అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.82,200 నగదు మరో ఖాతాకు మారిపోయింది. ఆయన వాట్సప్‌కు సైబర్‌ వంచకులు ఈ లింకు పంపించారని గుర్తించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కాపు ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


పాక్‌ అనుకూల నినాదాలు

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీని కించపరుస్తూ వ్యాఖ్యలు, పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు రాసి పోస్టు చేసిన నాసిర్‌ హుసేన్‌ అనే వ్యక్తి కోసం చిక్కమగళూరు జిల్లా కొప్ప ఠాణా పోలీసులు గాలింపు చేపట్టారు. ‘అస్గర్‌ కొప్ప’ పేరిట నిందితుడు ఫేస్‌బుక్‌లో ఖాతా నిర్వహిస్తున్నారు. అతని పోస్టుకు విమర్శలు, ఆక్షేపణలు రావడంతో దాన్ని తొలగించాడు. పోలీసులు స్వయం ప్రేరితంగా కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న అతని కోసం గాలింపు తీవ్రం చేశారు.


అక్క అన్నపూర్ణ తాయి అంత్యక్రియలు

బీదర్, న్యూస్‌టుడే : అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో గురువారం మరణించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అక్క అన్నపూర్ణ తాయి అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. లింగాయత మఠాలకు చెందిన భక్తులు, పీఠాల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


వారు.. దారి తప్పిన పిల్లలు

బెంగళూరు, (మల్లేశ్వరం): మాజీ మంత్రులు శివరాం హెబ్బార్, ఎస్‌టీ సోమశేఖర్‌ (భాజపా) దారి తప్పిన పిల్లలని విపక్ష నేత ఆర్‌.అశోక్‌ విమర్శించారు. వారిద్దరూ కాంగ్రెస్‌ నేతలతో సన్నిహితంగా ఉంటూ, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారికే మద్దతుగా ప్రచారాన్ని చేశారని గుర్తు చేశారు. ఇప్పటికే వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు. శివరాం హెబ్బార్‌ తనకు మంచి స్నేహితుడని, క్రమం తప్పకుండా ఆయన తనను భేటీ అవుతుంటారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలిపారు.


ప్రతిసారీ ఆ మాటేల?

మండ్య, న్యూస్‌టుడే : నేను న్యాయవాదిని.. న్యాయస్థానాల్లో వాదనలు వినిపించానని ప్రతిసారీ చెప్పుకోవద్దని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి హితవు పలికారు. ఎంపీ ప్రజ్వల్‌ అశ్లీల వీడియోల పెన్‌డ్రైవ్‌ను బహిరంగ పరచిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని అటువంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. ప్రజ్వల్‌ తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించి తీరాలన్నారు. తాను ప్రజ్వల్‌ను రక్షించేలా మాట్లాడుతున్నానని చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఓ ట్వీట్లో డిమాండ్‌ చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని