logo

కాంగ్రెస్‌ పనైపోయింది

దేశాన్ని 65 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీని గతంలో ఉద్యోగులు, విద్యావంతులు, శ్రీమంతులు తిరస్కరించారు.

Published : 25 May 2024 01:46 IST

కేంద్రంలో హ్యాట్రిక్‌ సాధిస్తాం

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషి, రవికుమార్‌ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: దేశాన్ని 65 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీని గతంలో ఉద్యోగులు, విద్యావంతులు, శ్రీమంతులు తిరస్కరించారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో పేదలు, సామాన్యులు తిరస్కరించారు. కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు. ఈశాన్య కర్ణాటక పట్టభద్రుల నియోజకవర్గం భాజపా అభ్యర్థి అమరనాథ పాటీల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి పాల్గొన్నారు. శుక్రవారం స్థానిక డా.రాజ్‌కుమార్‌ రహదారిలోని బసవరాజేశ్వరి పబ్లిక్‌ స్కూల్‌ సభాభవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి ఆయన తర్వాత అవినీతిరహిత పాలన అందజేశారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా అభివృద్ధి చేశారు. 2004 నుంచి 2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో రూ.12 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారు. మా ప్రభుత్వంలో ఒక ఎంపీ, మంత్రిపైనా అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకి 400కుపైగా లోక్‌సభ స్థానాలు వస్తాయి. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతూ హ్యాట్రిక్‌ సాధిస్తారని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఒక్క అభివృద్ధి పనీ చేయడం లేదని తీవ్రంగా ఆరోపించారు. తమ ప్రభుత్వంలో విద్యుత్తు, రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే శాఖకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో విద్యుత్తు కనెక్షన్లు లేని 18,100 గ్రామాలను గుర్తించి గత ప్రభుత్వంలో విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక కిలోమీటర్‌ రహదారీ వేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీపై ఏడాదికే వ్యతిరేకత వచ్చింది. 28 లోక్‌సభ స్థానాల్లో 24 చోట్ల తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో జరుగుతున్న అభివృధ్ధి పనులు చూసి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉద్యోగులు భాజపా అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. విధానపరిషత్‌ ప్రతిపక్ష నేత ఎన్‌.రవికుమార్‌ మాట్లాడుతూ విధానపరిషత్‌ అంటే పెద్దల సభ..ఇలాంటి సభకు గత ఎన్నికల్లో ఎన్నికైన చంద్రశేఖర్‌ పాటీల్‌ ఒక్క రోజు ప్రశ్నించలేదు. సమస్యలపై మాట్లాడలేదు..ఇలాంటి అభ్యర్థికి కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తిరస్కరించాలని కోరారు. బళ్లారి జిల్లాలోని సండూరు, సిరుగుప్ప, కురుగోడు తాలూకాల్లోనే 396 ఉపాధ్యాయుల ఖాళీలు ఉన్నాయి. దీన్ని గుర్తించి మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో 412 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ఒక్క కళాశాలలోనూ శాశ్వత ప్రధాన ఆచార్యులు లేరు. ఈ విద్యా సంవత్సరంలో 53 శాతం పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. విద్యారంగాన్ని కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి బి.శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మోకా మాట్లాడారు. పార్టీ నేతలు యశవంత్‌భూపాల్, మహిపాల్, రామలింగప్ప, గురులింగనగౌడ, హరికుమార్, నూర్, మారుతి, దమ్మూరు శేఖర్, జేడీఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాయణ్ణ, మహేశ్వరస్వామి పాల్గొన్నారు.

భాజపాకు ఓటు వేస్తామని చేతులు ఎత్తిన పట్టభద్రులు

ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగాలి

బళ్లారి : రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషి కోరారు. ఈశాన్య కర్ణాటక పట్టభద్రుల విధానపరిషత్తు నియోజకవర్గం భాజపా అభ్యర్థి అమరనాథ పాటీల్‌ తరఫున ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం బళ్లారి నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసిన విలేకరులతో మాట్లాడారు. 2023లో జరిగిన విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ సీట్లు కట్టబెట్టారు.కేంద్ర మంత్రిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రభుత్వం ఐదేళ్లు పాటు ఉండాలి. ప్రభుత్వంలో అంతర్గత విభేదాలతో ప్రభుత్వం పడిపోతే చెప్పలేమన్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యం.ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన చికిత్స లభించడం లేదు. ఔషధాలు లేవన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలు అయినా జీతాలు లేవు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. బెంగళూరులోని రామేశ్వరలో కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడుపై హోంమంత్రి నిర్లక్ష్యంగా మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి విషయాలపై మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిపై నిర్లక్ష్యం, విద్యాశాఖ మంత్రిపై తీవ్రంగా విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని