logo

ప్రజ్వల్‌ రేవణ్ణకు తాఖీదులు

అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడు, కర్ణాటలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ షోకాజ్‌ నోటీసు జారీచేసింది.

Published : 25 May 2024 01:52 IST

 విదేశీ వ్యవహారాల శాఖ స్పందన

ప్రజ్వల్‌ రేవణ్ణ

బెంగళూరు గ్రామీణ, దిల్లీ : అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడు, కర్ణాటలోని హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ షోకాజ్‌ నోటీసు జారీచేసింది. మీ దౌత్య పాస్‌పోర్ట్‌ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ అందులో కోరినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి. ప్రజ్వల్‌ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు జేడీ(ఎస్‌) నాయకుడి దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేసే ప్రక్రియ విదేశీ వ్యవహారాల శాఖలో కొనసాగుతోందని అధికారవర్గాలు గురువారం వెల్లడించాయి. ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు భావిస్తున్న ఎంపీకి ఈమెయిల్‌ ద్వారా షోకాజ్‌ నోటీసు జారీచేసినట్లు సమాచారం. పాస్‌పోర్టు చట్టం 1967లో సెక్షన్‌ 10 (3) (హెచ్‌), ఇతర నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు రద్దు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. ఒకవేళ దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దు చేసినట్లైతే సంబంధిత వ్యక్తి విదేశాల్లో ఉండడం అక్రమం అవుతుంది. దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దైనా దేశం వీడనందుకు సంబంధిత దేశానికి చెందిన అధికారులు అతడిపై చర్యలు సైతం తీసుకోవచ్చు.

చాలా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయి

మండ్య: హాసన ఎంపీ ప్రజ్వల్‌ అశ్లీల వీడియోలకు సంబంధించిన పెన్‌ డ్రైవ్‌లతో పాటు, ఇతర పార్టీల నాయకులవి అలాంటివే ఉన్నాయని కన్నడ పోరాట నాయకుడు వాటాళ్‌ నాగరాజ్‌ వ్యాఖ్యానించారు. ఆయన మండ్యలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజ్వల్‌ వీడియోలు బయటకు రావడంతో అందరూ అతన్ని లక్ష్యం చేసుకున్నారని పేర్కొన్నారు. ‘ఊళ్లో దొంగలు చేరుకున్నారు. ఇప్పుడు దొంగల్ని దొంగలే పట్టుకునే స్థితి ఎదురైంది’ అన్నారు. తాను దక్షిణ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు.

కస్టడీ పొడగింపు..

హాసన: హాసన ప్రాంతంలో ఆందోళనకు కారణమైన అశ్లీల వీడియోల్లో కనిపించిన కొందరు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా నాయకుడు దేవరాజేగౌడ న్యాయనిర్బంధాన్ని మరో 14 రోజులు పొడిగిస్తూ హాసనలోని రెండో అదనపు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఆదేశించింది. తనకు జామీను కావాలని కోరుతూ ఆయన వేసుకున్న అర్జీని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆయనను హొళెనరసీపుర ఠాణా పోలీసులతో పాటు సిట్ కూడా ఇప్పటికే ఒకసారి విచారించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని