logo

నిధుల్లేక అభివృద్ధి కరవు: భాజపా

అభివృద్ధి పనులకు నిధులు కరవై ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు.

Published : 25 May 2024 01:55 IST

వేదికపై విజయేంద్ర, అశోక్, పీసీ మోహన్‌ తదితరులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : అభివృద్ధి పనులకు నిధులు కరవై ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. బెంగళూరులో మౌలిక సదుపాయాల కొరత, నిలిచిపోయిన అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 28న ధర్నా చేస్తామని ప్రకటించారు. నగరంలోని సమస్యలపై విపక్ష నేత అశోక్, చట్టసభల ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ మోర్చాల ప్రతినిధులతో శుక్రవారం చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజులు వరుసగా వర్షం కురిస్తే నగరంలో వాహన రద్దీ, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు, విద్యుత్తు, అంతర్జాల సేవలకు అంతరాయం తదితరాలు ఉంటాయని గుర్తు చేశారు. ఆస్తి పన్నును ఇష్టం వచ్చినట్లు పెంచిన పాలికె, మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఫొటో షూట్కు వెళ్లినట్లు నగర పర్యటన చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భావిస్తున్నారని విపక్ష నేత ఆర్‌ అశోక్‌ విమర్శించారు. ఖజానాలో నగదు లేకపోవడంతోనే గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. బ్రాండ్‌ బెంగళూరును ప్రకటించి ఏడాదైనా, ఇప్పటి వరకు దాని కోసం ఎటువంటి నిధులు విడుదల చేయలేదన్నారు. పార్టీ నాయకులు అశ్వత్థ నారాయణ, డీవీ సదానందగౌడ, గోపాలయ్య, భైరతి బసవరాజ్, పీసీ మోహన్, మునిరాజు, సీకే రామమూర్తి, లెహర్‌సింగ్‌ సిరోయ, కట్టా సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉడ్తా.. బెంగళూరు

బెంగళూరు (మల్లేశ్వరం): కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాజధానిని ‘ఉడ్తా బెంగళూరు’గా మార్చివేసిందని కర్ణాటక భాజపా దుయ్యబట్టింది. నగరాన్ని మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చారని, రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయని ఆరోపించింది. అనుమతి లేకుండా ఒకచోట చేరి రేవ్‌ పార్టీలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైందని భాజపా దుయ్యబట్టింది. శాంతిభద్రతలకు భంగం కలుగుతున్నా, ప్రభుత్వం ఉలుకు, పలుకులేకుండా ఉండిపోయిందని దుయ్యబట్టింది. సిలికాన్‌ సిటీని ‘ఉడ్తా బెంగళూరు’ అని పిలవడం సరికాదని హోం మంత్రి డాక్టర్‌ జీ పరమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. రేవ్‌ పార్టీకి హాజరైన 103 మందిని పట్టుకుని ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. అందరికీ పరీక్షలు చేసి, మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రుజువైన ప్రతి ఒక్కరికీ సీసీబీ నోటీసులు జారీ చేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని