logo

కలరాతో కలవరం.. జనం కకావికలం

మొన్నటి వరకు కరవు, నేడు వర్షాలు.. తాగునీటిని విషతుల్యం చేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వేసిన వారు ఫ్లోరైడ్‌ నీటితో సరిపెట్టుకోగా, వర్షాలతో ఉరకలు వేస్తున్న నదులు ఆ నీటిలో కాలుష్య కారకాలనూ అందిస్తున్నాయి.

Published : 25 May 2024 02:01 IST

నదుల్లో కాలుష్యం
భూగర్భంలో ఫ్లోరైడ్‌
బెంగళూరులో విషతుల్యం

కావేరి నదిలో యథేచ్ఛగా చేరుతున్న మురికి నీరు

ఈనాడు, బెంగళూరు : మొన్నటి వరకు కరవు, నేడు వర్షాలు.. తాగునీటిని విషతుల్యం చేస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వేసిన వారు ఫ్లోరైడ్‌ నీటితో సరిపెట్టుకోగా, వర్షాలతో ఉరకలు వేస్తున్న నదులు ఆ నీటిలో కాలుష్య కారకాలనూ అందిస్తున్నాయి. వెరసి.. రాష్ట్రాన్ని ప్రస్తుతం కలుషిత నీరు ఓ భూతంలా వెంటాడుతోంది. రెండు నెలల కిందట ప్రజారోగ్యానికి రక్షణగా నిలిచే వైద్యులు సైతం కలుషిత నీటిని తాగి ఆస్పత్రి పాలైన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. నిన్నగాక మొన్న మైసూరు తాలూకాలోని సాలుండి గ్రామంలో కాలుష్య నీటిని తాగి మృతి చెందిన వార్తలు భయం గొలిపాయి. మృతుల కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించి పరిహారం చెల్లించటం తెలిసిన విషయమే. రాష్ట్ర రాజధాని బెంగళూరు, వెనుకబడిన జిల్లాలైన యాదగిరి, రాయచూరులే కాదు పర్యాటక నగరి మైసూరు కూడా ఈ కాలుష్య జలాల నుంచి తప్పించుకోలేని స్థితి.

కుశాల్‌నగర వద్ద మురికి కూపంగా మారిన కావేరి నీరు

 బెంగళూరు నగరంలో ఏప్రిల్‌ చివరి నాటికి బీబీఎంపీ ఆరోగ్య విభాగం అధికారులు చేసిన విశ్లేషణ ప్రకారం ఎన్‌ఎస్‌పీపీ (నాన్‌ సూటబుల్‌ ఫర్‌ పోటబుల్‌ పర్పసెస్‌- వాడకానికి ఉపయోగపడని జలం) గుర్తించిన ప్రాంతాలు ఎక్కువగానే ఉన్నాయి. బెంగళూరు నగరంలో మొత్తం 692 చోట్ల నీటిని పరీక్షలకు పంపగా అందులో 128 చోట్ల నీరు తాగేందుకే కాదు.. వాడేందుకు కూడా వీలుకానట్లు తేలాయి. మరో 30 చోట్ల కేవలం వాడకానికి మాత్రమే ఉపయోగపడేవిగా తేలాయి. (ఈ నమూనాల వివరాలు ఇక్కడ పట్టికలో చూడొచ్చు) ఈ ప్రాంతాల్లో కుళాయి, బోరు నీరు, ట్యాంకర్లు, శుద్ధి చేసిన (ఆర్‌ఓ) నీరు తాగేందుకు వీలుకానట్లు తేలింది.

యాదగిరి జిల్లాలో కుళాయిలో వస్తున్న కలుషిత నీరు

మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో నీటి కొరత తాండవించిన విషయం తెలిసిందే. కృష్ణరాజ సాగరలో నీరు లేక బెంగళూరు నగరమంతా ట్యాంకర్లపై ఆధారపడగా.. ఆ నీరు సైతం అంత సురక్షితం కాదన్న లెక్క తేలింది. బెంగళూరులోని యలహంక, మహదేవపుర, ఎలక్ట్రానిక్స్‌ సిటీ, మారతహళ్లి, బసవనగుడి, కామాక్షిపాళ్య, చామరాజపేట తదితర ప్రాంతాల్లో నీరు కలుషితం కావటంతో ఈ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఎక్కువ మంది విరేచనాలు, వాంతులు, దీర్ఘకాలిక జీర్ణాశయ సమస్యలతో చేరినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్య నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య అధికారికంగా వెల్లడికాకపోయినా ఏస్టర్‌ సీఎంఐ, ఫోర్టీస్‌ వంటి ఆస్పత్రుల నివేదిక ప్రకారం వారానికి కనీసం 50శాతం మందిలో ఈ సమస్య గుర్తించారు.

బాధితుల పరామర్శలకే పరిమితమైన ఏలికలు

ఫ్లోరైడ్‌ సమస్య..

కాలాలకు అతీతంగా కర్ణాటకలోని కొన్ని జిల్లాలు ఫ్లోరైడ్‌ వలయంలోనే జీవనం సాగిస్తున్నాయి. కోలార, ధార్వాడ, హావేరి, తుమకూరు, చిత్రదుర్గ, గదగ, బళ్లారి, యాదగిరి, విజయనగర జిల్లాల్లో తాగునీరు అంటే ఫ్లోరైడ్‌ నీరనే అక్కడి ప్రజలు భావిస్తారు. సాధారణ రోజుల్లో 150 అడుగులు తవ్వగానే రాతి పగుళ్లతో పాటు తెల్లడి సుద్దవంటి పదార్థాలు ఇక్కడి నీటిలో కనిపిస్తుంటాయి. ఈ జిల్లాల్లోని ఒక లీటరు నీటిలో కనీసం 1.50 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్‌ను గుర్తించారు. ఇంత ప్రమాణంలో ఫ్లోరైడ్‌ నీరు తాగిన వారు స్కెలటల్‌ ఫ్లోరైడ్‌ (కీళ్ల వంపులు) బారిన పడటం సర్వసాధారణం. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో యాదగిరి జిల్లాలో తల్లిపాల నమూనాల్లోనూ ఫ్లోరైడ్‌ ప్రమాణాలు గుర్తించటం ఆందోళన కల్గించే అంశం. ఈ జిల్లాల్లో గనులు, ఇసుక తవ్వకాలు నీటిని కాలుష్యంగా మారుస్తున్నట్లు ఖనిజ, భూగర్భ శాఖ నివేదిక వెల్లడించింది.

నదీజలాలతో ప్రమాదం

ఇటీవల మైసూరు తాలూకాలోని సాలుండి గ్రామంలో ఓ యువకుడు కలుషిత నీరు తాగి మృతి చెందగా.. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ప్రతి నెలా ఏదో ఒక జిల్లాలో చోటు చేసుకుంటూనే ఉంటాయి. గతేడాది ఆగస్టులో చిత్రదుర్గ జిల్లా కావడిగరహట్టిలో ఐదుగురు, అదే నెలలో యాదగిరిలో ముగ్గురు, అంతకు ముందు ఏడాది బళ్లారిలోని సుండూరులో నలుగురు, విజయనగర జిల్లా హూవిన హడగలిలో ఆరు మంది.. ఇలా వివరిస్తూ వెళ్తే అంతగా ప్రచారం కాని కలుషిత నీటి మరణాల సంఖ్య వందలకు పైమాటే. ఈ మరణాలన్నీ ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా పరిగణించాలని కావేరి స్వచ్ఛతా ఆందోళన సమితి నిర్వాహకులు చంద్రమోహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. దక్షిణ గంగగా పిలిచే కావేరి నది రాష్ట్రంలో కనీసం 765 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. ఈ పరివాహక ప్రాంతంలో కనీసం 60 శాతం గృహ, పరిశ్రమల వ్యర్థాన్ని నేరుగా నీటిలో మిశ్రమం చేస్తున్నట్లు చంద్రమోహన్‌ ‘ఈనాడు’కు వివరించారు. కావేరి నది ప్రవహించే ప్రాంతాల్లో టీడీఎస్‌ (టోటల్‌ డిజాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) ప్రమాణం ప్రతి ఏటా ప్రమాదకరంగా మారుతుందని ఆయన తెలిపారు. టీడీఎస్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కలరా సంభవించే ప్రమాదం ఉంది. బెంగళూరుకు సరఫరా చేసే 1,500 ఎంఎల్‌డీ నీటిలో 760 ఎంఎల్‌డీ నీరు కలుషితమని తేల్చారు. మురుగునీటి వ్యవస్థ లేని చోట్ల అర్కావతి వంటి ప్రమాదకరమైన కాల్వ నీరు కలిసిపోవటం ఆందోళన కల్గించే అంశం. కావేరి, కబిని, లక్ష్మణ తీర్థ, అర్కావతి వంటి నదుల్లో ఏ ఒక్క చోటా నీటి స్వచ్ఛత ప్రమాణం పూర్తి సంతృప్తిగా లేకపోవటం నదుల కాలుష్య తీవ్రతను వెల్లడిస్తోంది. స్వచ్ఛత ప్రమాణాల ప్రకారం శుద్ధనీటిని ‘ఏ’, సాధారణ స్వచ్ఛతను ‘బీ’, శుద్ధి చేసి తాగాల్సిన నీటిని ‘సీ’, వాడకానికి పనికిరాని నీటిని ‘డీ, ఈ’లుగా విశ్లేషించారు.


రాష్ట్రమంతటా పరీక్షలు

కలరా సమస్య ఉద్భవించిన కారణంగా రాష్ట్రంలోని ప్రతి చోటా జల నీటిని ప్రతి వారం పరీక్షలు చేయాలని అధికారులకు సూచించాం. బోర్లు, కుళాయిలు, ట్యాంకర్ల నీటిని ప్రతి రోజూ పరీక్షించిన తర్వాతనే వాడకానికి అనుమతి ఇవ్వాలని జిల్లా యంత్రాంగానికి సూచించాం. ఇకపై కలుషిత నీటి ద్వారా మరణాలు సంభవించకుండా చూడాలని ఆదేశించాం.

డీకే శివకుమార్, జలవనరుల మంత్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు