logo

జడివానతో జనం దడ

రాష్ట్రాన్ని వానదేవుడు కుదిపేస్తున్నాడు. జనం కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరప్రాంత జిల్లాలు, మళెనాడులో మంగళవారం వర్షం కొంత మందగించినా.. గురువారం వరకు ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. కేఆర్‌ఎస్‌ జలాశయం నుంచి

Published : 10 Aug 2022 02:40 IST

శివమొగ్గ : కొమ్మనాలు గ్రామంలో కూలుతున్న నివాసాలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : రాష్ట్రాన్ని వానదేవుడు కుదిపేస్తున్నాడు. జనం కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరప్రాంత జిల్లాలు, మళెనాడులో మంగళవారం వర్షం కొంత మందగించినా.. గురువారం వరకు ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. కేఆర్‌ఎస్‌ జలాశయం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర తాలూకా అప్సరకొండ వద్ద 64 కుటుంబాలకు చెందిన 173 మంది సభ్యులను నిరాశ్రితుల కేంద్రానికి తరలించారు. వారుంటున్న ప్రాంతంలో కొండ చరియ ఏ క్షణానైనా విరిగి పడుతుందనే భయంతోనే ఆ పని చేశారు. కుందాపుర సమీపంలోని కాల్తోడు గ్రామం బిజమక్కి వద్ద కాలుసంక కాలువను దాటుతూ సన్నిధి (7) అనే బాలిక నీటిలో పడిపోయింది. ఆమెను రక్షించేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు.

కంప్లి- గంగావతి మధ్య తుంగభద్ర వంతెన నీటిలో మునక.. రాకపోకలు బంద్‌

* శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా కాచిగొండనహళ్లిలో ఇంటి గోడ కూలి సుజాత (60) అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు కృష్ణమూర్తి (40) తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడ్ని చికిత్స కోసం భద్రావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రావతి తహసీల్దారు ప్రదీప్‌ నిక్కం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుందాపుర తాలూకా ఆలూరు గ్రామంలో మేత మేసేందుకు వెళ్లిన నాలుగు ఆవులు విద్యుదాఘాతంతో చనిపోయాయి. తెగిపడిన విద్యుత్తు తీగను చూసుకోకుండా నీటిలోనే వెళ్లి అవి మృత్యువాత పడ్డాయి. యాదగిరి జిల్లాలో బసవసాగర (నారాయణపుర) జలాశయం భర్తీ అయ్యింది. జలాశయానికి చెందిన 13 గేట్ల ద్వారా 80,620 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెట్టారు. ఆలమట్టి జలాశయానికి ఇన్‌ఫ్లో అధికం కావడంతో బసవసాగరకు అధికంగా నీటిని విడిచి పెట్టారు. గురువారం ఉదయం.. తుంగభద్ర జలాశయానికి చెందిన మొత్తం 33 గేట్లను తెరచి 1,41,891 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. ప్రవాహం ఎక్కువ కావడంతో కంప్లి- గంగావతిలను కలిపే వంతెన నీటిలో మునిగిపోయింది. శివమొగ్గ తాలూకా గాజనూరులోని తుంగా జలాశయంలోకి ఇన్‌ఫ్లో ఎక్కువైంది. ఆనకట్టలోని 21 క్రస్ట్‌ గేట్లు తెరచి 58,919 క్యూసెక్కుల వాననీరు విడుదల చేస్తున్నారు. కాఫీనాడు చిక్కమగళూరు జిల్లా సఖరాయపట్టణంలో వంతెనపై వరద ప్రవాహం కొనసాగింది. ఆ ప్రవాహాన్ని పట్టించుకోకుండా వెళ్లిన ఓ కారు కొట్టుకువెళ్లి, వంతెన అంచున నిలిచిపోయింది. దీన్ని గుర్తించిన స్థానికులు కారుకు తాడు కట్టి జేసీబీతో బయటకు లాగి, అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులను రక్షించారు. నెల్లిబీడు వంతెన ఇలానే మునిగిపోవడంతో కళస- కుదరేముఖ-మంగళూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ధార్వాడ జిల్లా చిక్కోడి ఉప విభాగంలో నాలుగు వంతెనలు కనిపించడం లేదు. వాహన సంచారం అస్తవ్యస్తమైంది. మూడిగెరె హ్యాండ్‌ పోస్టు నుంచి కొట్టిగెహార వరకు ఆదివారం ఉదయం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఎనిమిది రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో రహదారిపై వాహనాల చక్రాలకు పట్టుదొరక్క ప్రమాదాలు జరిగాయని పోలీసులు గుర్తించారు. ఎగువన మహారాష్ట్రలో కుంభవృష్టి నేపథ్యంలో బెళగావి జిల్లా నిప్పాణి తాలూకాలో నదులు, వంకల్లో ప్రవాహం ఎక్కువైంది. నిప్పాణి తాలూకా దూధ్‌ గంగా నదిపై ఆయా ప్రాంతాల్లో ఉన్న నాలుగు చిన్న వంతెనలు మునిగి తేలుతున్నాయి. ప్రవాహాన్ని పట్టించుకోకుండా రాకపోకలు కొనసాగించకుండా అన్ని వంతెనలకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను ఎగువకు తరలించారు. వారికి జిల్లాధికారి డాక్టర్‌ నితేశ పాటిల్‌ నిత్యావసరాలు, ఔషధాలు ఉన్న కిట్లను అందజేశారు. కావేరి నదీ ప్రవాహం ఎక్కువ కావడంతో చామరాజనగర జిల్లా కొళ్లేగాళ తాలూకాలోని భరచుక్కి జలపాతం వద్దకు వస్తున్న సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాల నురగ తరహాలో దుముకుతున్న నీటి ప్రవాహన్ని వీక్షించేందుకు స్థానికులు కూడా ఆసక్తి చూపించారు.

తుంగభద్ర తాకిడికి నీటిపాలైన కంప్లి కోట ప్రాంతంలో కూలిన భారీ వృక్షం

బాధితులకు పరామర్శ

దావణగెరె జిల్లా హొన్నాళి, చెన్నగిరి, న్యామతి తాలూకాల్లో వర్షానికి నీట మునిగిన ప్రాంతాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎం.పి.రేణుకాచార్య పరిశీలించారు. వందలాది ఎకరాల్లో బీన్స్‌, టమోటా, క్యాలీఫ్లవర్‌, కంది తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించే దిశగా చర్యలు తీసుకుంటానని అన్నదాతలకు ఆయన భరోసా ఇచ్చారు. కొడగులోని వర్షంతో అతలాకుతలమైన ప్రాంతాలను జిల్లా వ్యవహారాల బాధ్యుడు బి.సి.నాగేశ్‌ సందర్శించారు. సోమవారపేట, కుశాలనగర తాలూకాల్లో ఏర్పాటు చేసిన నిరాశ్రితుల కేంద్రంలో ఉంటున్న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.


తుంగభద్రమ్మ దూకుడు

గేట్లద్వారా నదివైపు ప్రవహిస్తున్న తుంగభద్ర జలాలు

హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయానికి వస్తున్న వరద ప్రమాణం అమాంతం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి జలాశయానికి 1.36 లక్షల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో 33 క్రస్టుగేట్లను పైకెత్తి అంతే ప్రమాణంలో నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. మూసివేసిన రెండు గేట్లకు ఇటీవలే మరమ్మతులు చేశారు. ఇప్పుడు అన్ని గేట్ల నుంచి నదికి నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 101.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం ఎగువ ప్రాంతాల్లోని శివమొగ్గ జిల్లాలో ఉన్న తుంగ, భద్ర జలాశయాలు పూర్తిగా నిండటంతో రెండు జలాశయాలు కలిసి మొత్తం 1.10 లక్షల క్యూసెక్కులదాకా నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. రానున్న రోజుల్లో జలాశయానికి 1.5 లక్షల నుంచి 2లక్షల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర నదీ తీరంలోని ప్రాంతాలకు మండలి వారు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణంలోనైనా నదికి 1.5లక్షల నుంచి 2లక్షల క్యూసెక్కులదాకా నీటిని విడుదల చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విజయనగర, బళ్లారి, కొప్పళ, రాయచూరు, ఆంధ్రలోని కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని