logo

నేర వార్తలు

రహదారి ప్రమాదంలో తండ్రీ,కొడుకులు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారి-50 కూకనపల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. పెళ్లి భాసికాలను హులిగమ్మదేవికి సమర్పించి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 05 Dec 2023 00:47 IST

రహదారి ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతి

గంగావతి,న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో తండ్రీ,కొడుకులు మృతిచెందిన సంఘటన జాతీయ రహదారి-50 కూకనపల్లి వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. పెళ్లి భాసికాలను హులిగమ్మదేవికి సమర్పించి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను ఇరకల్‌గఢాకు చెందిన మౌనేశ్‌ బడిగేర్‌(31), దేవేంద్రప్ప(55)లుగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం లారీని ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మౌనేశ్‌కు గతనెల 24న వివాహం జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై మునిరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదైంది.


తల్లీకుమారుల అదృశ్యం

బళ్లారి, న్యూస్‌టుడే: తల్లీకుమారులు అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు సిరుగుప్ప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సిరుగుప్ప పట్టణం ఆదోని రహదారిలోని రాజేశ్వరి లే అవుట్‌లో నివాసం ఉంటున్న ఇంద్రజ(32), కుమారుడు హర్షవర్దన(11)లు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలు చోట్ల గాలించినా ఆచూకీ తెలియరాలేదన్నారు.


ట్రాక్టర్‌ బోల్తా పడి కూలీ దుర్మరణం

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: హొసదుర్గం తాలూకా తుప్పదహళ్లి గ్రామం వద్ద కొబ్బరి కాయలను నింపుకొని తోట నుంచి రోడ్డుపైకి వస్తుండగా చోదకుని అదుపుతప్పి బోల్తా పడటంతో ట్రాక్టర్‌ పై కూర్చున్న కూలీ శివణ్ణ (65) ట్రాలీకింద చిక్కుకొని ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం జరిగిందని పోలీసులు తెలిపారు. మంజునాథ్‌కు చెందిన కొబ్బరి తోటలో కాయలను కోసుకొని ఇంటి వద్దకు తరలిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకొందన్నారు. ఈ ప్రమాదంలో నాగప్ప(55), మంజునాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.


భార్యను హత్య చేసిన భర్త

సిరుగుప్ప, న్యూస్‌టుడే: బలకుంది గ్రామంలో భార్యను చంపి భర్త పోలీసుఠాణాలో లొంగిపోయిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెక్కెలకోట పోలీసుఠాణా పరిధిలోని బలకుంది గ్రామానికి చెందిన రసూల్‌ సాబ్‌ (30), మైబున్నా బీ (25) భార్యాభర్తలు. ఇద్దరూ కూలిపని చేసుకుని జీవనం సాగించేవారు. వీరికి 4, 2 సంవత్సరాల వయస్సులు గల ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. రసూల్‌ సాబ్‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. నువ్వు ఇంటి వద్ద ఉంటే పిల్లలను పోషించేది ఎలా, మనం బతికేది ఎలా. కుటుంబం పోషణ ఒక్కదాంతో సాధ్య పడటం లేదని ఆమె తరచూ ఘర్షణ పడేవారు. తనను సరిగా చూసుకోవడం లేదని రసూల్‌ సాబ్‌ ఆదివారం రాత్రి భార్యతో ఘర్షణ పడ్డాడు. రాత్రి పడుకున్న సమయంలో భార్యను ఇనుప రాడ్డుతో తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది. రసూల్‌సాబ్‌ తన ఇద్దరు పిల్లలతో కలిసి తెక్కెలకోట పోలీసుఠాణాకు వచ్చి సంఘటనను వివరించి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రసూల్‌సాబ్‌ సమాచారం మేరకు తెక్కెలకోట సీఐ, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


తల్లీబిడ్డల ఆత్మహత్య

మడికేరి, న్యూస్‌టుడే : కొడగు జిల్లా గ్రామీణాభివృద్ధి సేవా సంస్థలో సేవా ప్రతినిధిగా పని చేస్తున్న అశ్విని (48) తన కుమార్తెలు నిఖిత (21), నవ్య (18)లతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. హైసోడ్లూరు గ్రామంలోని కాలువ నుంచి అగ్నిమాపకదళ సిబ్బంది వారి మృతదేహాలను బయటకు తీశారు. గోణికొప్ప కళాశాలలో నిఖిత విద్యార్థిని. నవ్య కంప్యూటర్‌ బేసిక్స్‌ శిక్షణ పొందుతోంది. అశ్విని భర్త మండ్యలోని ఒక హోటల్‌లో పని చేస్తున్నారు. శ్రీమంగల ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


గుడి ముంగిటే హత్య

మైసూరు, న్యూస్‌టుడే : వివాహేతర సంబంధానికి సంబంధించిన వివాదంలో మహదేవస్వామి (39) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నంజనగూడు తాలూకా హొసహళ్లి గ్రామంలో ఓ గుడి ముంగిట ఆదివారం రాత్రి ఈ హత్య జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నావంటూ సోమయ్య అనే వ్యక్తి మహదేవ స్వామితో పలు సందర్భాల్లో గొడవ పడ్డాడని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సోమయ్య కనిపించకుండా పోవడంతో అతని కోసం నంజనగూడు ఠాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.


ఆర్‌ఎస్‌ఎస్‌పై అవహేళనకర పోస్టు

వ్యక్తిపై సుమోటో కేసు

గంగావతి,న్యూస్‌టుడే: ఆర్‌ఎస్‌ఎస్‌పై సామాజిక మాధ్యమాల్లో అవహేళనకర పోస్టు పెట్టిన వ్యక్తిపై గంగావతి పట్టణ పోలీసులు సుమోటో కింద కేసు సోమవారం నమోదుచేశారు. ‘అమ్ము రాక్‌ జీవీటి’ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో అమీర్‌ అమ్ము అనే వ్యక్తి ఈ సందేశం పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి సందేశాలతో అల్లర్లు చెలరేగరాదనే ఉద్దేశంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని