logo

నేలకొరిగిన అర్జునుడు

మైసూరు దసరా ఉత్సవాల్లో ఎనిమిదిసార్లు అంబారీ మోసిన అర్జున సోమవారం కన్నుమూసింది. నాలుగు అడవి ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అది మరణించిందని అధికారులు తెలిపారు.

Updated : 05 Dec 2023 06:04 IST

ఏనుగుల దాడిలో విషాదాంతం

హాసన, న్యూస్‌టుడే : మైసూరు దసరా ఉత్సవాల్లో ఎనిమిదిసార్లు అంబారీ మోసిన అర్జున సోమవారం కన్నుమూసింది. నాలుగు అడవి ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అది మరణించిందని అధికారులు తెలిపారు. సకలేశపుర యసళూరు బాళెకెరె అటవీ విభాగంలో మదగజాలను బంధించేందుకు అర్జున, మరో మూడు ఏనుగులతో సిబ్బంది వేటకు కదిలారు. ఏనుగులకు రేడియో కాలర్ల ఏర్పాటు, బంధించేందుకు తీసుకుంటున్న చర్యలకు ‘అర్జున’ నేతృత్వం వహిస్తోంది.

ఒక మదగజానికి మత్తు సూది ఇచ్చే సమయంలో దానితో పాటు మరో నాలుగు ఏనుగులు అర్జునపై దాడి చేశాయి. తమ దంతాలతో పొట్ట భాగం వద్ద చీల్చడంతో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మరణించింది. మైసూరు దసరా ఉత్సవాల్లో 2012 నుంచి 2019 వరకు వరుసగా అంబారీతో ఇది నడిచింది. మొత్తం 22 సార్లు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఘనత దీని సొంతం. కాకనకూట అటవీ విభాగంలో 1968లో అర్జునను బంధించారు. నాగరహొళ జాతీయ ఉద్యానం పరిధిలోని శిబిరంలో ఇది శిక్షణ పొందింది. పులులు, మదగజాల వేటలో కెప్టెన్‌ అర్జున పాత్ర కీలకం అని అధికారులు తెలిపారు. అర్జున తమ కళ్లముందే మరణించడంతో మావటీలు కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని