logo

శభాష్‌.. గౌరీశ్‌..!

ఓ బస్టాపు సమీపాన నిలిచి ఉన్న బీఎంటీసీ బస్సును వెనకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని పెను ముప్పును సృష్టించింది. ఈ సంఘటన బెంగళూరు శివారు బ్యాటరాయనపుర (ఉత్తర) పోలీసుఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

Published : 05 Dec 2023 00:57 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఓ బస్టాపు సమీపాన నిలిచి ఉన్న బీఎంటీసీ బస్సును వెనకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని పెను ముప్పును సృష్టించింది. ఈ సంఘటన బెంగళూరు శివారు బ్యాటరాయనపుర (ఉత్తర) పోలీసుఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. యశ్వంతపుర నుంచి బనశంకరి వైపు వెళుతున్న ఆ బస్సును కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొనటంతో ఒక్కసారిగా మంటలు ఎగసి.. బస్సునూ చుట్టుముట్టాయి. ఢీకొన్న ఉత్తర క్షణమే కారులోంచి లోకేశ్‌ అనే వ్యక్తి భార్య, కుమారుడుతో అందులోంచి తప్పించుకున్నారు.

మంటలు గుర్తించిన బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ గౌరీశ్‌, గిరిధర్‌ వేగంగా స్పందించి అందులోని 35 మంది ప్రయాణికులను వేగంగా కిందకు దింపారు. బస్సు కాలిపోతుందనే విషయాన్ని పసిగట్టిన గౌరీశ్‌ వేగంగా ఆ బస్సును ముందుకు నడిపినా.. కారు విడివడలేదు. చివరికి కండక్టర్‌ గిరిధర్‌ సహకారంతో చాకచక్యంగా ఓ డివైడర్‌పైకి బస్సును దూకించడంతో కారు విడిపోయి.. ఆగిపోయింది. బస్సుకు పాక్షికంగానే నష్టం వాటిల్లింది. బస్సు డ్రైవర్‌ సమయస్ఫూర్తిని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. సంస్థ ఆస్తి రక్షణకు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని