logo

ఐటీ శాఖ ఉన్నతాధికారినంటూ.. మాయగాడి పెళ్లినాటకం

అంతర్జాలంలో ప్రైవేట్‌ పెళ్లి వేదికలను వివిధ పేర్లతో నిర్వహిస్తూ, నకిలీ ఖాతాలను సృష్టించి, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారిగా చెప్పుకొంటూ మహిళలను మోసం చేస్తున్న అంకిత్‌జైన్‌ అనే వ్యక్తిని బెంగళూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

Updated : 29 Feb 2024 07:46 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : అంతర్జాలంలో ప్రైవేట్‌ పెళ్లి వేదికలను వివిధ పేర్లతో నిర్వహిస్తూ, నకిలీ ఖాతాలను సృష్టించి, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారిగా చెప్పుకొంటూ మహిళలను మోసం చేస్తున్న అంకిత్‌జైన్‌ అనే వ్యక్తిని బెంగళూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

వారందించిన సమాచారం ప్రకారం.. వితంతువులు, విడాకులు తీసుకున్న దాదాపు 250 మంది మహిళలను మోసగించాడనేది ప్రధాన ఆరోపణ. నా పేరు ‘పవన్‌ అగరవాల్‌’ అని చెప్పుకొని, ఆదాయ పన్నుశాఖ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకోవడం ద్వారా అందరినీ సులువుగా మోసం చేయగలిగాడని రైల్వే పోలీస్‌ ఐజీపీ డాక్టర్‌ ఎస్‌.శరణప్ప వెల్లడించారు. పెళ్లి విషయాన్ని మాట్లాడాలంటూ ఇటీవల కోయంబత్తూరు నుంచి ఓ మహిళ కుటుంబాన్ని నగర రైల్వేస్టేషన్‌కు ఆ వ్యక్తి రప్పించాడు. వారిని ఓ హోటల్‌లో ఉంచి చర్చలు జరిపాడు. పనిలో పనిగా టికెట్‌ రిజర్వు చేసుకోవాలంటూ.. ఇంట్లో పర్సు మరచిపోయానని ఆమె నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మి ఆమె డబ్బు సమర్పించుకున్న కొద్ది సేపటికే బయటకు వెళ్లిన అంకిత్‌.. అలియాస్‌ ‘పవన్‌’ ఫోను మూగబోయింది.

అప్రమత్తమైన ఆమె రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. ఆ వ్యక్తి అత్యంత చాకచక్యంగా పత్రికల్లో వచ్చే ప్రకటనల ఆధారంగా వితంతువులు, విడాకులు తీసుకున్న ఆడవారికి వలవేసి, ఆకర్షించేవాడని గుర్తించారు. నేనే పెళ్లి చేసుకుంటానంటూ కొందరిని నమ్మించి, కొన్నాళ్లు సహజీవనం సాగించి, వారి వద్ద మోసపూరితంగా డబ్బు లాగేసుకుని మాయమైపోయేవాడని దర్యాప్తులో గుర్తించారు. ఈ పనుల కోసమే ప్రత్యేక ఫోన్లను ఉపయోగించాడు. రాత్రిళ్లు మాత్రమే ఆడవారితో మాట్లాడేవాడట. ఈ వ్యక్తి వలలో పడిన వివిధ రాష్ట్రాల బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన 56, ఉత్తరప్రదేశ్‌ 32, దిల్లీ 32, కర్ణాటక 17, మధ్యప్రదేశ్‌ 16, మహారాష్ట్ర 13, గుజరాత్‌ 11, తమిళనాడు ఆరుగురు, బిహార్‌ ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం 250 మంది మహిళలతో ఆ వ్యక్తి చాట్‌ చేసిన దాఖలాలు వెలుగుచూశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని