logo

కష్టకాలంలో ఆదుకునే గుణమేదీ?

మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌ సాధారణ ఒక్కలిగ కుటుంబంలో జన్మించి- స్వయంకృషితో కాంగ్రెస్‌లో ఎదిగిన కార్యకర్త అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Published : 03 Apr 2024 02:53 IST

మోదీని నిలదీసిన సిద్ధు

చామరాజనగర నేత రామస్వామి, ఇతరులకు కాంగ్రెస్‌ పతాకాన్ని అందిస్తున్న సిద్ధరామయ్య

మైసూరు, న్యూస్‌టుడే : మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌ సాధారణ ఒక్కలిగ కుటుంబంలో జన్మించి- స్వయంకృషితో కాంగ్రెస్‌లో ఎదిగిన కార్యకర్త అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. మైసూరు- కొడగు జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. పార్టీలో చేరిన నాయకులకు పతకాలను అందించి మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు కర్ణాటక గుర్తుకు వస్తుందని ఆరోపించారు. కరవు, వరద పరిస్థితులు ఉన్నప్పుడు కర్ణాటక వైపు వారు ఎందుకు చూడరని ప్రశ్నించారు. సామాన్యుల సమస్యలపై గళం విప్పే లక్ష్మణ్‌ను పార్లమెంటుకు పంపించే బాధ్యతను ఓటర్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గంలో ఒక ఒక్కలిగ నాయకుడిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తూ ఉంటే.. భాజపా నేతలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ ఈ పదేళ్లలో అబద్ధాలు చెప్పి భారతీయులను దారి తప్పించారని ఆరోపించారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చింది భాజపా అని, వారితోనే ఇప్పుడు దళ్‌ పొత్తు కుదుర్చుకోవడం సిగ్గుచేటన్నారు. తనకు దేవేగౌడ, ఇతర దళ్‌ నేతలపై ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవని స్పష్టం చేశారు. నేతగా, మంత్రిగా తనకు వస్తున్న గుర్తింపును తట్టుకోలేక అక్కసుతోనే దళ్‌ నుంచి వారు బహిష్కరించారని గతాన్ని గుర్తు చేసుకున్నారు. కుమారస్వామి, దేవేగౌడ కన్నీరుకు కరిగిపోకుండా, కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని భాజపా కోరుకుంటుందని, అదే జరిగితే, పేదలు, మధ్యతరగతి ప్రజలు మరింత నిరుపేదలుగా మారిపోతారని హెచ్చరించారు. కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్‌ సమీప బంధువు రామస్వామి కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. శ్రీనివాస ప్రసాద్‌తో తాను ఇటీవలి కాలంలో మాట్లాడలేదని స్పష్టం చేశారు. చామరాజ నియోజకవర్గంలో 45 మంది నేతలు భాజపా, దళ్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి కే వెంకటేశ్‌, పార్టీ నాయకులు తన్వీర్‌ సేఠ్‌, హరీశ్‌ గౌడ, పుష్పా అమరనాథ్‌, లక్ష్మణ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


‘ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను’

ఈనాడు, బెంగళూరు : ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఆయన మంగళవారం మైసూరులో మాట్లాడుతూ వయోభారం ఎదురవుతుందని, ఆరోగ్యం సహకరించకపోవచ్చనే కారణంగా ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ‘ప్రస్తుతం నా వయసు 77 ఏళ్లు. మరో నాలుగేళ్ల తర్వాత నాకు 82 ఏళ్లు నిండుతాయి. ఆ వయసులో ఇప్పటిలా ఉత్సాహంగా పని చేయలేను’ అని ముఖ్యమంత్రి అన్నారు. మరోసారి వరుణ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారా? అంటూ అడిగిన ప్రశ్నకు ఆయనిలా స్పందించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించా. 50 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. వయసు మళ్లినట్లుగా కనిపించలేదన్న అంశం ఎలా ఉన్నా.. వయసు ప్రభావం నాకు మాత్రమే తెలుసున్నారు. గత విధానసభ ఎన్నికల సమయంలోనూ తాను పోటీ చేయనని ప్రకటించిన సిద్ధరామయ్య తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని చివరి ప్రయత్నంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని