logo

ఇండియా సత్తా చాటే తరుణమిదే

దేశంలో మార్పు కోసమే బెంగళూరు నగరంలో ఇండియా కూటమి ఏర్పడిందని, ఆ క్రమంలో ఇక్కడి పాలనలో మార్పు సాధ్యమైందని, దేశంలోనూ అదే తరహా ప్రగతి కోసం పోరాటం చేద్దామని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 03 Apr 2024 02:57 IST

ఇండియా కూటమి పార్టీల నేతలతో సమావేశమై.. ఐక్యత చాటుతున్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తదితరులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దేశంలో మార్పు కోసమే బెంగళూరు నగరంలో ఇండియా కూటమి ఏర్పడిందని, ఆ క్రమంలో ఇక్కడి పాలనలో మార్పు సాధ్యమైందని, దేశంలోనూ అదే తరహా ప్రగతి కోసం పోరాటం చేద్దామని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు. బెంగళూరులోని కాంగ్రెస్‌భవన్‌లో మంగళవారం రాష్ట్రంలోని ‘ఇండియా’ మిత్రపక్షాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌- జేడీఎస్‌ కలిసి పోటీ చేసిన విషయాన్ని వివరించారు. తుమకూరులో సీపీఐ అభ్యర్థి 17 వేల ఓట్లు దక్కించుకున్నారని, నాడు కూటమి తరఫున బరిలో దిగిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ 12 వేల ఓట్లతేడాతో ఓడిపోయారని గుర్తు చేశారు. ఈసారి ఓట్లు చీలిపోకుండా అప్రమత్తం కావాలన్నారు. ఎన్‌డీఏ కూటమిని ఓడించడమే మనందరి లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై లేని ఆరోపణలు చేస్తూ అణచివేతకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. బూత్‌ స్థాయి నుంచి కలిసి పని చేయాలని సూచించారు. ఎన్నికల బాండ్ల అంశంపై భాజపా నోరువిప్పడం లేదన్నారు. రాష్ట్రానికి వచ్చిన భాజపా నేత అమిత్‌షా కరవుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. సమావేశంలో పీసీసీ మాధ్యమ విభాగం అధ్యక్షుడు రమేశ్‌బాబు, ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు ‘ముఖ్యమంత్రి’ చంద్రు, పృథ్వీరెడ్డి, మోహన్‌ దాసరి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, సీపీఐ కార్యదర్శి సాతి సుందరేశ్‌, వివిధ సంఘాల నేతలు అనంతసుబ్బారావు, క్లిప్టన్‌ డి.రూజెరియో, ఇనాందార్‌, యాకుబ్‌ గుల్మాడి, శివశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.


బచ్చేగౌడకు కాంగ్రెస్‌ తీర్థం

కాంగ్రెస్‌లో చేరిన బచ్చేగౌడకు కాంగ్రెస్‌ పతాకాన్ని అందిస్తున్న డీకే శివకుమార్‌

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దేశం మార్పు కోరుకుంటోందని ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఆశించిన స్థానాలు గెలవలేమనే భయంతోనే భాజపా నేతలు 12 చోట్ల కీలక అభ్యర్థులను మార్చారని గుర్తు చేశారు. బెంగళూరులోని కాంగ్రెస్‌భవన్‌లో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో చిక్కబళ్లాపుర మాజీ శాసనసభ్యుడు కేపీ బచ్చేగౌడ, శిడ్లఘట్ట భాజపా నేత పుట్ట అంజనప్ప తదితరులను పార్టీలో చేరుకున్నారు. వారి మెడలో కాంగ్రెస్‌ కండువా వేసి స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆపరేషన్‌ కమల’కు పాల్పడి కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసిన పార్టీతో దళ్‌ పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు. కుమారస్వామి మంచివాడు కాదని ప్రచారం చేసిన వ్యక్తులు- ఇప్పుడు ఆయనతో కలిసి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనను అధికారంలో నుంచి కిందకు దింపేసినప్పుడు ‘కులం’ ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎనిమిది మంది ఒక్కలిగరులకు ఈసారి టికెట్‌ ఇచ్చిందని, భాజపా, జేడీఎస్‌ ఆ వర్గానికి ప్రాధాన్యమివ్వలేదన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీలో ఉన్నారని, భవిష్యత్తులో జేడీఎస్‌ ఉంటుందో లేదో అనే అనుమానంతో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ తన అల్లుడిని భాజపా చిహ్నంపై పోటీలోకి దింపారని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు కృష్ణభైరేగౌడ, డాక్టర్‌ సుధాకర్‌, శాసనసభ్యుడు ప్రదీప్‌ ఈశ్వర్‌, ఎంఎస్‌ సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని