logo

దళపతుల ప్రచార జోష్‌!

భాజపా- జేడీఎస్‌ నేతల ఎన్‌డీఏ కూటమి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరలేపింది. ఉభయ జనతా దళాలు ఒకే వేదికపై ఎన్‌డీఏ అభ్యర్థుల విజయానికి శంఖారావాన్ని పూరించాయి.

Published : 03 Apr 2024 03:04 IST

తొలివిడతలో అసమ్మతికి కళ్లెం
బెంగళూరులో సుడిగాలి పర్యటన

‘శక్తి కేంద్రం’ సమావేశ వేదికపై అమిత్‌షాను సత్కరిస్తున్న ఎన్‌డీఏ నాయకుల బృందం

ఈనాడు, బెంగళూరు : భాజపా- జేడీఎస్‌ నేతల ఎన్‌డీఏ కూటమి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరలేపింది. ఉభయ జనతా దళాలు ఒకే వేదికపై ఎన్‌డీఏ అభ్యర్థుల విజయానికి శంఖారావాన్ని పూరించాయి. మంగళవారం భాజపా దిగ్గజ నేత అమిత్‌ షా నేతృత్వంలో ఎన్‌డీఏ సమన్వయ సమావేశం, అనంతరం భాజపా ప్రముఖులు భేటీ, ఆపై కాంగ్రెస్‌ శక్తి కేంద్రం బెంగళూరు గ్రామీణలో ఏర్పాటు చేసిన సుదీర్ఘ రోడ్‌ షో ఎన్‌డీఏ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. స్థానికంగా రెండు పార్టీల కార్యకర్తల్లో ఉన్న అసమ్మతిని తొలగించటం, ఏకైక ప్రత్యర్థి కాంగ్రెస్‌కు బలమైన సవాలు విసిరే దిశగా అమిత్‌ షా పర్యటన విజయవంతమైనట్లు ఎన్‌డీఏ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

ఈశ్వరప్పకు కళ్లెం..

అమిత్‌ షా రాకతో భాజపాకు పక్కలో బళ్లెంలా మారిన ఈశ్వరప్పకు కళ్లెం పడటం ఖాయంగా కనిపిస్తోంది. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తీరుతానని కుండబద్దలు కొట్టిన ఈశ్వరప్ప ఇప్పటి వరకు నామినేషన్‌ వేయలేదు. ఆయన దిల్లీ పెద్దల ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. అంచనా వేసినట్లే అమిత్‌ షా రాష్ట్రంలో అడుగుపెట్టగానే ఈశ్వరప్ప వేగానికి అడ్డుపడింది. అమిత్‌ షా బెంగళూరుకు వచ్చి రాగానే ఈశ్వరప్పకు ఫోను చేశారు. వెంటనే దిల్లీకి వచ్చి మాట్లాడాలని సూచించగానే ఈశ్వరప్ప కాస్త నెమ్మదించారు. పోటీ నుంచి విరమించుకోవాలని సూచించకపోతేనే దిల్లీకి వస్తారన్న షరతు తీసుకున్నట్లు ఈశ్వరప్ప చెప్పటం కొసమెరుపు. అమిత్‌ షా బెంగళూరు పర్యటన ముఖ్య ఉద్దేశమే అసమ్మతులను బుజ్జగించటం. యడియూరప్ప వంటి నేతలకే లొంగని ఈశ్వరప్పకు స్వయంగా ఫోను చేయటంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. స్వతంత్ర అభ్యర్థిగా ఈశ్వరప్ప బరిలో దిగితే యడియూరప్ప కుమారుడికి శివమొగ్గలో గెలుపు కాస్త కష్టమన్న విశ్లేషణల నేపథ్యంలో షా స్వయంగా రంగంలో దిగారు. విజయేంద్రను అధ్యక్ష పదవి నుంచి తొలగించటం, పార్టీలో యడియూరప్ప కుటుంబ జోక్యాన్ని నియంత్రించాలన్న పలు డిమాండ్లతో దిల్లీకి వెళ్లే ఈశ్వరప్ప తిరుగు ప్రయాణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఎన్‌డీకే నేతల వేదికపై అమిత్‌షా, యడియూరప్ప, కుమారస్వామి, అశోక్‌, విజయేంద్ర

కాంగ్రెస్‌పై విమర్శలు..

భాజపా ‘శక్తి కేంద్రం’ ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న అమిత్‌ షా.. కాంగ్రెస్‌పై విమర్శలతో దండెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉండేదే అవినీతిని పోషించేందుకు.. నిత్యం కుర్చీల కోసం పోట్లాడుకునే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు రాష్ట్ర అభివృద్ధిని మరచినట్లు ఆరోపించారు. కాంగ్రెస్‌ పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఇచ్చిన రూ.1.42లక్షల కోట్ల కంటే నాలుగు రెట్లు అధికంగా ఎన్‌డీఏ సర్కారు ఇచ్చిందని విశ్లేషించారు. పదేళ్ల కాలంలో భారత్‌దేశం అతి పెద్ద ఆర్థికత కలిగిన దేశాల్లో 12వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకోగా మరో రెండేళ్లలో 3వ స్థానానికి చేరుకుంటుందన్నారు. ప్రధాని మోదీ రేయింబవళ్లు దేశం కోసం శ్రమిస్తున్నారు. జమ్ముకశ్మీరు దేశంలో సంపూర్ణ విలీనం, సర్జికల్‌ స్ట్రైక్‌, రామమందిరం, భారత పౌరసత్వ నమోదు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్న ఎన్‌డీఏకు మరోమారు అధికారాన్ని అందించాలని దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించారన్నారు. ఈసారి 400కుపైగా స్థానాలతో గెలిచే ఎన్‌డీఏకు అవినీతి కూటమి ఇండియాతో పోటీ లేదని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ వంటి సంస్థలకు వెన్నుదన్నుగా ఉండే కాంగ్రెస్‌తో రాష్ట్రానికే కాదు దేశానికి కూడా భద్రత లేదన్నారు. అనంతరం ఆయన చెన్నపట్టణలో రోడ్‌షోలో పాల్గొని బెంగళూరు గ్రామీణ అభ్యర్థి డా.మంజునాథ్‌ను ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలన్నారు. దేశమంతా మోదీతోటే ఉందన్న విశ్వాసాన్ని ఈ రోడ్‌షో నిరూపించిందన్నారు. మోదీ ప్రామాణిక ప్రధాని కాగా మంజునాథ్‌ సేవా తత్పరులని అభినందించారు. కర్ణాటకలో భాజపా, జేడీఎస్‌లకు వేసే ఓట్లన్నీ మోదీకి వేసినట్లేనని ఆయన ప్రకటించారు. ఇదే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రులు హెచ్‌డి.కుమారస్వామి, బి.ఎస్‌.యడియూరప్ప, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర తదితరులు పాల్గొన్నారు.

చెన్నపట్టణ రోడ్‌షోలో అమిత్‌షా, డాక్టర్‌ మంజునాథ్‌, కుమారస్వామి, బీవై విజయేంద్ర తదితరులు

కరవుపై ఆరోపణల పోరు

అమిత్‌ షా పర్యటన సందర్భంగా కరవు పరిహారంపై మరోమారు విమర్శల పోరు మొదలైంది. కేంద్రం రాష్ట్రానికి సకాలంలో పరిహారం చెల్లించలేకపోయేందుకు రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యమే కారణమని భాజపా నేతలు ఆరోపించారు. షా రాకపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ.. రాష్ట్రానికి కరవు పరిహారం చెల్లించలేని హోంమంత్రి ఏ నైతికతతో ప్రజల ఓట్లను అడుగుతారని ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన అమిత్‌ షా.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనలు తయారు చేసే సమయానికి రాష్ట్రం నుంచి మనవి పత్రం రాలేదన్నారు. మూడు నెలలు ఆలస్యంగా రాష్ట్రం నుంచి నివేదిక వచ్చిందన్నారు. రాష్ట్రం గత సెప్టెంబరు నుంచే వినతిపత్రాలను పంపినట్లు ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూశాఖ మంత్రి కృష్ణభైరేగౌడ ఆ నివేదికల తాలూకు దాఖలాలను సామాజిక మాధ్యమంలో ఉంచారు. మూడు సార్లు నివేదికలు పంపగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా కూడా ఇందుకు స్పందించి డిసెంబరులో హోంమంత్రి నేతృత్వంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తామని హామీ కూడా ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.


భాజపాకు గుణపాఠం తథ్యం

మైసూరు, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు గుణపాఠం చెప్పేందుకే ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న కర్ణాటకకు నిధులు విడుదల చేయాలని కోరినా, మొండి చేయి చూపించిన హోం మంత్రి అమిత్‌షాకు కన్నడిగుల ఓటు అడిగేందుకు నైతిక హక్కు లేదన్నారు. మైసూరు, చామరాజనగర నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఆయన నగరంలో క్రైస్తవ మత పెద్దలతో సోమవారం రాత్రి సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం శంకరమఠానికి వెళ్లారు. ఈ సందర్భంగా తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ అమిత్‌షాను ఉద్దేశించి తన కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలకు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసిందన్నారు. దానికి ఇప్పటికే బదులిచ్చామని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అమలు చేస్తున్న పథకాలే తమ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని